2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక పవన్ కళ్యాణ్ రేంజ్ అయితే అమాంతం పది రేట్లు పెరిగిపోయింది. ఎమ్యెల్యేగా ఎన్నికైన తొలిసారి ఏకంగా ఉప ముఖ్యమంత్రిని పొందారు. అంతేకాదు తన ఆలోచన తీరుకు తగ్గ మంత్రిత్వ శాఖలని ఎంచుకున్నారు.
రాష్ట్ర రాజకీయాలన్నీ సవ్యంగా సాగుతున్న భావన ప్రజల్లో ఇప్పటికే నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ పయనం మాత్రం ఎవరికి అర్ధం కాని అయోమయాన్ని సృష్టిస్తుంది. 30 శాతం పూర్తయిన ఒక సినిమా, 60 శాతం పూర్తయిన మరో సినిమా, 75 శాతం పూర్తయిన ఇంకో సినిమా.. 100 శాతం పూర్తవడానికి పవన్ కళ్యాణ్ కోసం పడిగాపులు కాస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ దశలో కళ్యాణ్ తన బాధ్యతలని సంపూర్ణంగా నిర్వర్తించగలరా, ఆ సినిమాలని పూర్తి చెయ్యగలరా.. ఇదే ఇప్పుడు పెద్ద క్వచ్చన్ మార్క్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవి ని ఇవ్వడంతో పాటు ప్రత్యేక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి కళ్యాణ్ కి వెన్నుదన్నుగా నిలుస్తున్న చంద్రబాబు. నిజానికి ఈరోజు కళ్యాణ్ స్థాయి ఆయనే కాదు.. కనీసం ఆయన అభిమానులైనా ఊహించి ఉండరు. అంతగా వెలిగిపోతుంది పవన్ ప్రభ. ప్రభుత్వ సంస్థల్లో కూడా తనతో పాటుగా ఉపముఖ్యమంత్రి ఫోటో ఉండాలని ఆదేశించి చంద్రబాబు యావత్ కాపు శ్రేణి ఓట్ బ్యాంకు ని టీడీపీ ఖాతాలో పర్మినెంట్ చేసేసుకున్నారు.
మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని పలకరించాలంటేనే కష్టం. కలవాలంటే కష్టం. ఈ నిర్మాతలెవరైనా దర్శకులెవరైనా పవన్ ని ప్రశ్నించగలరా, కనీసం అభ్యర్దించగలరా, అవన్నీ సందేహాలు కాదు స్పష్టంగా కనిపిస్తున్న సంకేతాలు. ఎన్నెన్నో శాఖలు తీసుకుని తన గుప్పిట్లో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటికి న్యాయం చేస్తారా, ఇన్నాళ్లు, ఇన్నేళ్లు తననే నమ్ముకుని తనకి అడ్వాన్స్ లు ఇచ్చి వడ్డీలు కట్టుకుంటున్న నిర్మాతలకి సమయం కేటాయిస్తారా.. అనే దానిపై అందరి దృష్టి ఉంది.
2024 ఎలక్షన్స్ లో గేమ్ చేంజర్ అనిపించేసుకుని, పెద్దాయన మోడీ దగ్గరనుంచి మన కుప్పం సింహం చంద్రబాబు వరకు అందరితో అభినందనలు పొందిన పవన్ కళ్యాణ్, జనాల్లో కూడా నిజాయితీ పరుడు అనే బ్రాండ్ తెచ్చుకున్న పవన్ ఇప్పుడేం చేస్తారో చూద్దాం, ఇటు ప్రజలకి అటు నిర్మాతలకి న్యాయం చెయ్యాల్సిన బాధ్యత తెలుస్తుంది, కనిపిస్తుంది. ఇకపై పవన్ చేసేది చూడాల్సి ఉంది.