సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు దేవకట్టా ఇంటర్వ్యూ విశేషాలు...
- రిపబ్లిక్ సినిమాకు ఇన్‌స్పిరేషన్ నా అజ్ఞానం. మనకు ఉహ తెలిసినప్పటి నుంచి ఈ రాజకీయాలేంటి? రాజకీయ నాయకులేంటి? అని అనుకుంటూ ఉంటాం. క్యాప్టలిజం, కమ్యూనిజం, సోషలిజం అంటూ మనం ఇజమ్‌ల గురించి మాట్లాడుతుంటాం. డెమోక్రసీ, డిక్టేటర్ షిప్ అంటాం. ఇలా చాలా వాటి గురించి మాట్లాడుతుంటాం. అయితే వీటి గురించి మనకు ఎంత లోతుగా తెలుసు? అనే ప్రశ్న వేసుకుంటే మనకు తెలియదు. నా వరకు వస్తే.. నాకు తెలియదు. మనం ప్రకృతిలో ఓ భాగం, మనం ఎక్కడున్నామో దాని గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే ఉండలేం. అలాగే సమాజం కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటప్పుడు మనం ఎలాంటి వ్యవస్థలో ఉన్నామో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చదువుకున్న వ్యక్తిగా అలాంటి సమాజం గురించి తెలియనప్పుడు ఓ సామాన్యుడికి ఏం అర్థమవుతుందనే సిగ్గుతో దానిపై స్టడీ చేసుకుని ఈ కథను తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రభుత్వమో, ప్రజాస్వామ్యమో ఉందనే భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ అదెలా ఉంటుందో తెలియదు. అంటే మనం ప్రజాస్వామ్యంలో బతకడం లేదు. ఏ పార్టీకి, మనిషికి అయినా అపరిమితమైన శక్తి ఇచ్చినప్పుడు కచ్చితంగా కరెప్ట్ అవుతాడు. అది మానవ నైజం. పవర్ అనేది ఓ క్రమబద్దంగా ఉండాలి. బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడే బావుంటుంది. ట్రంప్‌లాంటి వ్యక్తి ఏ దేశంలో అయినా డిక్టేటర్ అయ్యుండేవాడు. కానీ ఆయన నియమించిన జడ్జీలే ఆయన్ని డిక్టేటర్ కానీయకుండా అడ్డుకున్నారు.
- న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, లెజిస్లేటివ్ అనేవి ఇండిపెండెంట్‌గా ఉండాలి. అయితే ఒకరికొకరు అన్వయం ఉండాలి. ఇవి మూడుగుర్రాలుగా ఉండి ప్రయాణించేటప్పుడు ఏదైనా ఓ గుర్రం గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే మిగిలిన గుర్రాలు పట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా ఉంటుంది. కామన్ మేన్‌గా విలువ తప్పడాన్ని మనం ఆనందిస్తే, మనం పవర్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ విలువ తప్పుతారు. ఈరోజు మన పార్టీ గెలిచి విలువ తప్ప మరో పార్టీని ఇబ్బంది పెట్టినప్పుడు, రేపు ఆ పార్టీ వాళ్లు పవర్‌లోకి వచ్చినప్పుడు మనల్ని ఇబ్బంది పెడతాడు. వేరే దారిలేదు. ఈ విషయాలపై సామాన్యులకు అవగాహన లేదు. ఇదేదో ఓ పార్టీని ఉద్దేశించోమనిషిని ఉద్దేశించో వచ్చిన ఆలోచనలు కావు. ఈ ఐడియాను ఓ రోజు జిమ్‌లో సాయితేజ్‌కు చెప్పాను.
- సాధారణంగా రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య అన్వయకర్తగా ఉండే ఓ బ్యూరోక్రట్ నిజాయతీగా ఉన్నప్పుడు, తను వ్యవస్థను ఎలా చూస్తున్నాడు. తన ఆలోచనల వల్ల తన ప్రయాణం ఎలా సాగింది. అనే పాయింట్‌తో ఈ కథను తయారు చేశాను. సాయితేజ్ ఓ కామన్ మ్యాన్‌గా ఈ కథకు రిలేట్ అయ్యాడు. ఈ డిస్ట్రబెన్స్ నుంచి వచ్చిన ఐడియాలో నిజం ఉంది. ఈ కథను నేనే చేయాలి. అనుకున్నాడు. ఈ ఆలోచనను కథగా రాయక ముందే నాతోనే ఈ సినిమా చేయాలని తేజ్ ప్రామిస్ తీసుకున్నాడు.
- సెన్సార్ సభ్యులకు సినిమా చాలా బాగా నచ్చింది. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా నిష్పక్షంగా, ఎలా బేదాభావాలు లేకుండా నిజాయతీగా తెరకెక్కించారని అప్రిషియేట్ చేశారు.
- ఇందులో ప్రజలకు ఏదీ మంచిది అనేది చెప్పలేదు. ఓ ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకున్నప్పుడు అది ఎలా అవ్యస్థంగా ఉందని ఎత్తి చూపిస్తూనే, అదొక వ్యవస్థగా మారాలని సొల్యూషన్‌గా నిర్వచనం చెప్పే ప్రయత్నం చేశాం. ఇప్పుడు సమాజంలోని వ్యవస్థలు, మన ఆలోచనలు, దాని వల్ల ప్రభావితమయ్యే అంశాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను.
- వ్యక్తిగతంగా దూషించినప్పుడు ఇతరులు బాదపడతారు. దాని నుంచి సమస్యలు వస్తాయి. అదే మనసాక్షితో మాట్లాడినప్పుడు ఏమీ కాదు. నొప్పించే విధంలో కాకుండా చెప్పాలి. బ్యూరోక్రాట్స్ మీద, న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను. పొలిటికల్ పవర్ ఉన్నప్పుడు ఏమైనా చేయవచ్చు అనే ఓ భావన అందరిలో ఉంది. దాన్ని అందరం ఎంజాయ్ చేస్తున్నాం కూడా. కానీ అది తప్పు. మనం ఎలా ఆలోచిస్తున్నామో అదే వ్యవస్థ అవుతుంది.
- వెన్నెల, ప్రస్థానం సినిమాలు చేసేటప్పడు నాకు రిసోర్సస్ తక్కువగా ఉన్నాయి. కానీ.. లిబర్టీ ఉండేది. కానీ ఓ స్థాయి తర్వాత మన చుట్టు పక్కల ఉన్నవాళ్ల లెక్కలు వచ్చేస్తాయి. ప్రస్థానం బ్లాక్‌బస్టర్ కాకపోవడానికి కామెడీ ట్రాక్ లేకపోవడమో, మరోటో అని నన్ను కన్విన్స్ చేసి.. నేను ఆ ట్రాప్‌లో పడ్డ తర్వాత నేనెదైతే చెత్త పెట్టానో దాన్ని ప్రజలు తిప్పి కొట్టారు. కానీ రిపబ్లిక్ విషయంలో ఇలాంటివేమీ లేకుండా నేను ఓన్ చేసుకుని చేసిన సినిమా. నా విజన్‌లోనే నన్ను సినిమా తీసేలా సాయితేజ్ సినిమా చేయడానికి ఎంకరేజ్ చేశాడు. సైనికుడిలా నాకు అండగా నిలబడ్డాడు.
- డైలాగ్ అనేది నా దృష్టిలో మాటల గారడీ కాదు. ప్రతి మాట ఓ ఆలోచన. ఆలోచనను, తత్వాని పదునుగా ఎలివేట్ చేయాలి. ఆలోచన ఎంత బలంగా ఉంటే డైలాగ్ అంత పదునుగా ఉంటుంది. ఈ సినిమా కథను చూసిన నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ రీమేక్ రైట్స్‌ను కూడా కొనేశారు.
- ఫ్రస్టేషన్‌లో, బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అలా తీసుకున్న నిర్ణయమే డైనమైట్ సినిమా. అదే సమయంలో నేను యు.ఎస్‌లో ఫ్యామిలీని వదిలేసి వచ్చాను. అర్థికంగా ఎలాంటి సపోర్ట్ లేదు. ఇలాంటి కారణాలతో కన్విన్స్ అయిన ఒప్పుకున్న సినిమా. ఆ సినిమాను నేను 9 రోజులు మాత్రమే షూట్ చేశాను. తర్వాత వాళ్లకు కావాల్సి వచ్చినట్లు వాళ్లే షూట్ చేసుకున్నారు. దాని తర్వాత నేను దర్శకుడిగా ఇతరుల నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఇంకా సమయం పట్టింది. రిపబ్లిక్ ఆ నమ్మకాన్ని పెంచుతుందని భావిస్తున్నాను. ఇకపై ఎక్కువ గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.
- తమిళంలో కాక్కాముట్టై అనే సినిమాను చూసినప్పుడు అందులో ఐశ్వర్యా రాజేశ్ నటన బాగా ఆకట్టుకుంది. ఆమెతో ఎప్పుడైనా పనిచేయాలని అనుకున్నాను. ఈ సినిమాకు కుదిరింది. అయితే నేను రొటీన్‌కు భిన్నంగా నటీనటులను ఇతర పాత్రల్లో నటింప చేయడానికి ప్రయత్నిస్తాను. అలా ఐశ్వర్యా రాజేశ్‌ను ఇందులో ఎన్నారై అమ్మాయిగా చూపించాను. తను అద్భుతంగా నటించింది. రమ్యకృష్ణగారు క్యారెక్టర్‌లో ముందుగా భారతీరాజానో, మహేంద్రన్ వంటి డైరెక్టర్స్‌ను పెట్టుకోవాలని క్యారెక్టర్ రాసుకున్నాను. అయితే నటీనటుల ఎంపిక గురించి మాట్లాడుకుంటున్న సమయంలో తేజ్ రమ్యకృష్ణగారిని ఆ పాత్రకు తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనను చెప్పాడు. క్యాస్టింగ్‌లో కొత్తదనం కోసం ఆ పాత్రను మహిళగా మార్చాం. ఆ పాత్రలో రమ్యకృష్ణగారిని లేదా విజయశాంతిగారినో తీసుకోవాలని అనుకున్నాం. అయితే అప్పటికే విజయశాంతిగారు పాలిటిక్స్‌లో ఉన్నారు. ఆమె రాజకీయ జీవితం ఎక్కడ ప్రభావితమవుతుందోనని భావించి, రమ్యకృష్ణగారిని అప్రోచ్ అయ్యాం. ఆమె అప్పటికే నరసింహ, బాహుబలి సినిమాల్లో తన పాత్రలను రమ్యగారు మరొకరు చేయలేరనే గొప్పగా చేసున్నారు. దాంతో ఈ పాత్రకు ఆమె న్యాయం చేస్తుందని భావించాం.
- మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మనసులో ఉన్నది దాచుకోకుండా మాట్లాడుతారు. సాయితేజ్‌కు యాక్సిడెంట్ అయిన తర్వాత మేం ఆలోచిస్తున్నప్పుడు చిరంజీవిగారు ట్రైలర్ లాంచ్ చేస్తానని మాట ఇచ్చారు. కళ్యాణ్‌గారు నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వస్తానని అన్నారు. పవన్‌గారు వేదికపై ఏం మాట్లాడారనేది ఆయన వ్యక్తిగత కోణం కావచ్చు. కానీ మా రిపబ్లిక్ సినిమా అనేది ఈ రాజకీయ కోణాలకు సంబంధం లేని న్యూట్రల్ పాయింట్‌తో తెరకెక్కింది.
- నేను ఎవరినీ వేదికపై విమర్శించలేదు. ఆన్‌లైన్ టిక్కెటింగ్ వల్ల పారదర్శకత ఉంటుంది. కానీ తర్వాత స్టెప్స్ ఏంటని నేను అడిగానంతే.
- సాయితేజ్‌ను యాక్సిడెంట్ తర్వాత కలిశాను. అక్టోబర్ 1న సినిమాను విడుదల చేద్దామని తనతో మాట్లాడుకున్న తర్వాతే ఫైనల్‌గా ఓకే చేశాం. తను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చూశాడు. తను హండ్రెడ్ పర్సెంట్ ఓకే అనుకునే వరకు ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని భావించాం. తను త్వరగా కోలుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు. కాస్త కాస్త ఆహారం కూడా తీసుకుంటున్నాడు. తను రికవర్ కావడానికి సమయం పడుతుంది.
- చంద్రబాబునాయుడుగారు, వై.ఎస్‌గారి జీవితాలను బేస్ చేసుకుని వారీ కాలేజీ జీవితాల నుంచి వై.ఎస్.ఆర్ మరణం వరకు ఉండే సినిమా. ఈ సినిమాను గాడ్‌ఫాదర్ రేంజ్‌లో మూడు భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నాను. వెబ్ సిరీస్‌గానూ కూడా తెరకెక్కించవచ్చు. ఇంద్రప్రస్థం అనే వర్కింగ్ టైటిల్‌ను అనుకున్నాం. విష్ణువర్ధన్‌గారితో ఎన్టీఆర్‌గారి బయోపిక్ గురించి, ఈ కథ గురించి చర్చించాను. ఎన్టీఆర్ బయోపిక్ తన సినిమా అనేలా బయటకు వెళ్లింది. కానీ ఇంద్రప్రస్థం అనే సినిమా గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఎలా రూపొందుతుందో అందరూ ఎదురుచూస్తున్నారు. పెద్ద క్యాస్టింగ్ అవసరం. సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో విష్ణువర్ధన్‌గారు వారి జీవితాలపై సినిమాను తీస్తానని చెప్పినప్పుడు నాకేం అభ్యంతరం అనిపించలేదు. అయితే స్టోరి పరంగా నా కథలో ఎలిమెంట్స్‌ను తీసుకుంటే లీగల్‌గా చర్యలు తీసుకుంటానని అన్నాను.
- బాహుబలి ది బిగినింగ్ ముఖ్యోద్దేశం ఇండియాకు చెందిన గ్రేమ్ ఆఫ్ థ్రోన్స్ కావాలనేదే. అలాంటి గొప్ప ఆశయాన్ని ఒకరిద్దరూ దర్శకులతో ఒకట్రెండు సంవత్సరాల్లో చేసేది కాదు. దానికి సమయాన్ని వెచ్చించడం చాలా అవసరం. ఉదాహరణకు గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను పదేళ్లు కథగా రాస్తే పది పదిహేనేళ్లు స్క్రీన్‌ప్లే రాశారు. తీశారు. ఆపేశారు. మళ్లీ తీశారు. అలా ఎంతో క్లారిటీగా చేశారు. ఆ లెవల్ టీమ్ టెక్నీషియన్స్, టైమ్, ఇన్వెస్ట్ చేస్తేనే ఔట్‌పుట్ వస్తుందని భావించి .. మా జీవితాన్నంతా అక్కడే వెచ్చించలేమని అర్థం చేసుకుని రాసిందంతా అక్కడే పెట్టేసి ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాం. ఓ సీజన్‌ను రాసుకుని తీసే ప్రాజెక్ట్ అది కాదు. కాస్త షూట్ చేసినా కూడా పక్కకు వచ్చేశాం.