ఇప్పటికీ మోసగాళ్ళకు మోసగాడు షూటింగ్ రోజులే గుర్తున్నాయి - ప్రముఖ నిర్మాత, పద్మాలయ అధినేత జి. ఆదిశేషగిరిరావు.
ఏడవ దశకం ప్రారంభంలో తెలుగు సినిమా పరిణామ క్రమంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అభినయం ప్రధానంగా సాగే చిత్రాల దశ నుంచి, సాంకేతిక విలువలతో భారీ వ్యయంతో హాలీవుడ్ చిత్రాలను తలపింపచేసే సాహసకృత్యాల నేపథ్యంలో కొనసాగే చిత్రాల ఆవిర్భావం జరిగింది. కథలు కొత్తగా ఉండాలి. తారాగణం వేషధారణ కొత్తగా ఉండాలి. సన్నివేశాల చిత్రీకరణకు ఉపయేగపడే లొకేషన్లు ఎప్పుడూ చూడనివిగా ఉండాలి. ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించే సస్పెన్సు ఉండాలి. అన్నిటినీ మించి కథనంలో వేగం అతిముఖ్యమైంది. ఆ వేగం ప్రేక్షకులను మైమరపించి ఔరా అనిపించాలి. ఈ సమస్యలన్నిటికీ తెరలేపుతూ ఒక సస్పెన్స్ ఎడ్వంచరస్.. క్రైమ్ చిత్రానికి శ్రీకారం చుట్టారు సూపర్‌స్టార్ కృష్ణ. అలా ఒక వినూత్న ప్రయత్నంగా నిర్మించిన చిత్రమే ‘మోసగాళ్ళకు మోసగాడు’. పద్మాలయ బ్యానర్‌లో రూపొందిన ఈ మూవీ1971ఆగస్ట్ 27న విడుదలైన సంచలన విజయాన్ని అందుకుంది. 2020ఆగస్ట్27 నాటికి 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చిత్ర నిర్మాత జి. ఆదిశేషగిరిరావు చెప్పిన విశేషాలు.
ఆయన మాట్లాడుతూ.. ‘మోసగాళ్ళకు మోసగాడు’ పద్మాలయ బ్యానర్‌లో నేను నిర్మాతగా తీసిన రెండవ సినిమా. ఆ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రేక్షకులందరికీ తెలుసు. ఘన విజయంతో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనుండి కూడా మా సినిమాలలో ఏ సినిమాకు రానన్ని ప్రశంసలు ఆ సినిమాకి వచ్చాయి. ఇప్పటికీ మా బేనర్‌లో ఎన్నో సినిమాలు విడుదలైనా ఆ సినిమా పేరు చెప్పకుండా పద్మాలయ చరిత్ర మొదలవ్వదు.
ఆ రోజుల్లోనే టెక్నికల్‌గా చాలా హై వ్యాల్యూస్‌తో వచ్చే హాలివుడ్ సినిమాలతో పోటీపడి కొత్త టెక్నీషన్స్ కె.ఎస్.ఆర్ దాస్ గారి దర్శకత్వం, వి.ఎస్.ఆర్ స్వామి గారి ఫోటోగ్రఫి, కోటగిరి గోపాలరావుగారి ఎడిటింగ్ ఆరుద్ర గారి కథ. ఆరుద్ర గారు అప్పటికీ పాటలే ఎక్కువగా రాస్తుండేవారు. అయితే హాలీవుడ్ స్థాయి నిర్మాణానికి అనుగుణంగా ఆ కథని మనకు, తెలుగు చిత్రానికి పరిచయం చేశారు. కౌబాయ్ గెటప్స్ ఉన్నప్పటికీ కథలో మన నేటివిటీని తీసుకవచ్చి ఆంధ్ర ప్రేక్షకులకు అందివ్వడం జరిగింది.
సంగీతం ఆదినారాయణగారు. ఆయనేంటి వెస్ట్రన్ మ్యూజిక్ ఏంటి అనే రోజుల్లోంచి ఆ సినిమాకు చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉంది. ఈ యాభై ఏళ్ళలో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఎక్కడైనా రాసినా, చదివినా మోసగాళ్ళకు మోసగాడు సినిమా ప్రస్తావన లేకుండా ఇంత వరకూ జరుగలేదు. అది మాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా.
ఇప్పటికీ టెక్నికల్ వ్యాల్యూస్ లో బ్యాక్‌లీస్ట్ ఫోటోగ్రఫి తీసుకువచ్చిన సినిమా అది. ఆ రోజుల్లో ఒక చిన్న సినిమా ఏంటి కలర్‌లో చేయడం ఏంటి అనే విమర్శలు వచ్చినా ఆ రోజుల్లో అతి తక్కువ బడ్జెట్‌తో ఆ చిత్ర నిర్మాణం జరిగింది. అలా అని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా లోకేషన్స్ పరంగా రాజస్తాన్ ఎడారుల్లో గాని, హిమాలయాల్లోని మంచుకొండల్లో, పాండిచ్చేరి లాంటి ఎర్రమట్టి కోటల్లో ఇలా అనేక ఔట్‌డోర్ లొకేషన్స్‌లో చేసిన నూతన ప్రయోగమే మోసగాళ్ళకు మోసగాడు.
దాసు గారు, స్వామిగారు ముఖ్యులైతే బ్యాక్‌బోన్‌గా నిలిచిన కోటగిరి గోపాలరావు, ఆదినారాయణ రావు ఆరుద్ర, స్టంట్ మాస్టర్స్ మాధవన్, రాజు అలాగే మేకప్ మాధవరావుగారు వారి శిష్యులు ఇలా ప్రతిఒక్కరి పని తనం ప్రశంసనీయం. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే కృష్ణగారు అత్యద్భుతంగా నటించారు. విజయనిర్మల గారు నూతన ఒరవడిలో నటించారు. నాగభూషణం, జ్యోతిలక్ష్మీ, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, జగ్గారావు, ఆనంద మోహన్, త్యాగరాజు వంటి వారు ఆ సినిమాలో నటించారు. నటీటులు, సాంకేతిక నిపుణులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమా మా సొంతం అనే రీతిలో పనిచేయడం వల్లే అంతటి విజయం సాధ్యం అయింది.
ముఖ్యంగా కృష్ణగారికి అభిమానులు అంటే ప్రాణం. ఆయన అభిమానుల్ని అప్పటినుండి ఇప్పటివరకూ అలానే కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక్కసారి కృష్ణగారికి అభిమాని అయితే జీవితంలో అభిమానిగానే మిగిలిపోతాడు తప్ప మారడు అనే దానికి నానుడిగా ఇప్పటికీ ఐదారు దశాబ్దాల ప్రస్థానంలో చాలా మంది ఆయన అభిమానులుగానే మిగిలిపోయారు.
ఆ రోజుల్లో అసాధ్యడు, గూఢచారి 116, అవేకళ్లు లాంటి యాక్షన్ పిక్చర్స్ వచ్చినా ఫ్యామిలీ పిక్చర్స్ ఎక్కువగా అలవాటు అయిపోయింది. అలాంటి సమయంలో కొంచె బ్రేక్ కావాలి అని అనుకున్నారు కృష్ణగారు అందులోనూ ఆ సినిమాకు ముందు ఏడెనిమిది సినిమాలు సరిగా ఆడలేదు అందులో మా అగ్నిపరీక్ష ఒకటి. యన్‌టీఆర్, ఏఎన్నార్ లు అప్పటికే చాలా ఫేమస్, చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ లో సినిమాలు తీస్తుండేవారు. వారికి పోటిగా మనం కూడా ఎదగాలన్న ప్రయత్నంలో అప్పటి హాలీవుడ్ సినిమాలు ఎక్కువ ప్రభావం చూపిస్తుంటే దానకి అనుగుణంగానే నూతన ఒరవడిలో మనం కూడా మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా తీస్తే బాగుంటుంది అన్న దృక్పథంలొంచి వచ్చిన ఆలోచనే మోసగాళ్ళకు మోసగాడు.
ఆ రోజుల్లో రామారావు గారు, నాగేశ్వరరావుగారు ఎస్టాబ్లీష్‌డ్ యాక్టర్స్. వారికి ఎన్ఏటి, విజయ ప్రొడక్షన్స్, రామారావుగారికి ఉండేవి, అన్నపూర్ణ ఫిలింస్, వి.పి రాజేంద్ర ప్రసాద్ గారి లాంటి పెద్ద పెద్ద బ్యానర్స్ వారికి అండగా ఉండేవి, మనం కూడా ఆ స్థాయికి వెళ్లాలనే కృష్ణగారి ఆలోచనలోంచి పుట్టిందే పద్మాలయ సంస్థ. గూఢచారి 116 లాంటి ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ కృష్ణగారు చేసినా ఆ ప్రయత్నాలలో భాగంగా మన బ్యానర్‌లోనే తొలి ప్రయత్నంగా మోసగాళ్ళకు మోసగాడు సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అప్పటికి కలర్ సినిమాలని ఎక్కువగా ప్రోత్సహించేవారు కాదు డిస్ట్రిబ్యూటర్స్, అయినా సరే వారిచ్చినదాంట్లో నుండే సినిమా తీశాం. ఆ సినిమా లక్కీగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, బెంగాలి, మలయాలం, కర్నాటకలో తెలుగు వెర్షన్ అయినా బ్రహ్మండంగా ఆడింది. అలాగే ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చేశాం. ఫారెన్ లో అనేక భాషల్లో డబ్బింగ్ కి వెళ్లిన తొలి సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఆ తర్వాత ఆ సినిమా స్పూర్తితో చాలా సినిమాలతో క్రిష్ణగారు ఎక్స్ పెరిమెంట్స్ చేశారు. దానిలో భాగంగా తొలి సినిమాస్కోప్ అల్లూరి సీతారామరాజు మా ప్రతిష్టాత్మక చిత్రం, అలాగే కృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన సింహాసనం తొలి 70 ఎమ్ఎమ్ చిత్రం. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈనాడు ఇలా ఎప్పటికప్పుడు విప్లవాత్మకంగా సినిమా ఇండస్ట్రీ లో కొత్తతరం తీసుకురావాలనే తపన కృష్ణగారిలో మొట్టమొదట నుండే ఉండేది. ఆ ఆలోచన లోంచి వచ్చిన పద్మాలయ సంస్థలో కృష్ణగారి సినిమాల్లో ఇప్పటికీ నిలిచిపోయిన మోసగాళ్ళకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మునుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు ఇలా ప్రతి సంవత్సరం ఒకదానిని మించిన సినిమా ఒకటి వచ్చి ఆయన టాప్ స్టార్ గా వెలుగోందడానికి ఆయన స్థాపించిన పద్మాలయ సంస్థే కారణం. దానికి సహకారం అందించామనే సంతృప్తి మా అందరిలో నిలిచి పోయింది.
ఇప్పటికీ కృష్ణగారిది విజయనిర్మల గారిది ఏదైనా క్లిపింగ్ వేయాలంటే మంచు కొండల్లో తీసిన ఈ సినిమా పాటే వేస్తుంటారు. ముఖ్యంగా ఆదినారాయణగారు మేం రషేస్ చూసినదానికన్నా తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాని ఎన్‌హాన్స్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి కూడా ఇంత వ్యాల్యూ ఉంటుందని మాకు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మాకనిపించింది. అలాగే శ్రీశ్రీ గారు నేషనల్ అవార్డ్ తీసుకున్న పాట తెలుగు వీర లేవరా, అలానే ఆ సినిమాలో వస్తాడు నా రాజు పాట, మ్రోగిందిలే కళ్యాణ వీణ, నేడే ఈ నాడే ఇలా ఆయన రాసిన పాటల్లో కొన్ని వందలపాటలు మాకు నచ్చినవే ఉన్నాయి.
70వ దశకంలో కృష్ణగారి కెరియర్‌కే ఇంపార్టెంన్స్ ఇచ్చి ప్రతి సంవత్సరం ఒక మంచి సినిమా పెద్ద సినిమా తీయాలని నిర్మించిన సంస్థ 80వ దశకంలోకి వచ్చేసరికి ఒక కమర్షియల్ బ్యానర్‌గా ఎదిగింది. పదేళ్ళ కాలంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, బెంగాలి ఇలా అన్ని భాషల్లో 65 సినిమాలు తీశాం. పద్మాలయ సంస్థ గ్రాఫ్ చూస్తే 70లో ప్రతిష్ఠాత్మక సినిమాలు అలానే 80లో ప్రజారాజ్యం, ఈనాడు, సింహాసనం, మగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, అలానే హిందీలో మేరి ఆవాజ్ సునో, హిమ్మత్ వాలా, మవ్వాలి, జస్టీస్ చౌదరి, పాతాల భైరవి, ఖైదీ ఇలా పదేళ్ళలో 32 సినిమాలు తీశాం. ఎన్నో సూపర్‌డూపర్ హిట్స్ తో ప్రపంచవ్యాప్తంగా పద్యాలయ బ్యానర్‌కి ఉన్న వ్యాల్యూ 80లో పెరిగింది. అయినప్పటికీ మాకు ఇప్పటికీ 70వ దశాబ్దం గుర్తుంటుంది. 80వ దశాబ్దం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఇప్పటికీ మోసగాళ్ళకు మోసగాడు షూటింగ్ జరిగే రోజులే మాకు గుర్తున్నాయి.