రీమేక్.. ఇది టాలీవుడ్‌లో ఓ బ్రహ్మ పదార్థం. ఎందుకంటే రీమేక్ సినిమాలు కూడా ఒరిజినల్ సినిమాల తరహాలోనే లాటరీ తరహాలో ఆడుతున్నా మనవాళ్ల దృష్టి ఎప్పుడూ పరభాషా చిత్రాలపైనే. రీమేక్‌లు టాలీవుడ్ డైరెక్టర్ల క్రియేటివిటీని ఎదగనీయకుండా చేస్తున్నాయని కొందరు వాదిస్తే, ఏ లాంగ్వేజ్‌లో వచ్చిన సినిమా అయినా చివరకు ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిందే కదా అనేది మరికొందరి అభిప్రాయం. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఈ రీమేక్‌లో జోరు తెలుగుతెరపై నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో ఒక్క భాష అని కాకుండా అనేక భాషల నుంచి తెలుగులో రీమేక్‌లు వస్తున్నాయి. ఎక్కువగా తమిళ, హిందీ భాషల నుంచి ఎక్కువ సినిమాలు వస్తుంటే, ఓ బేబీ తర్వాత కొరియన్ సినిమాల మీద మనవాళ్ల దృష్టి మళ్లింది.
ఇటీవలి కాలంలో అంటే 2018 నుంచి తీసుకుంటే.. తమిళం నుంచి గద్దలకొండ గణేష్, చీకటి గదిలో చితక్కొట్టుడు, బ్లఫ్ మాస్టర్, అర్జున్ సురవరం, జాను, కౌసల్య కృష్ణమూర్తి, నెక్ట్స్ నువ్వే, సిల్లీ ఫెలోస్, రాక్షసుడు, రాజుగారి గది 3, మలయాళం నుంచి ఏబీసీడీ, ఫలక్‌నుమా దాస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కన్నడం నుంచి ఫస్ట్ ర్యాంక్ రాజు, ఆటగదరా శివ, కిర్రాక్ పార్టీ, యు టర్న్, హిందీ నుంచి నెక్స్ట్ ఏంటి, పంజాబీ నుంచి హ్యాపీ వెడ్డింగ్, గుజరాతీ నుంచి ఎంత మంచివాడవురా లాంటి సినిమాలు రీమేక్ అయ్యాయి. వీటిలో ‘గద్దలకొండ గణేష్’, ‘అర్జున్ సురవరం’, ‘రాక్షసుడు’, ‘ఫలక్‌నుమా దాస్’ మాత్రమే హిట్టనిపించుకున్నాయి. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఇటీవలే రిలీజైంది.
ప్రస్తుతం విడుదల కోసం ‘దటీజ్ మహాలక్ష్మి’, ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘రెడ్’ సినిమాలు ఎదురు చూస్తున్నాయి. బ్లాక్‌బస్టర్ హిందీ ఫిల్మ్ ‘క్వీన్’కు రీమేక్‌గా ‘దటీజ్ మహాలక్ష్మి’ రూపొందింది. ఒరిజినల్‌లో కంగనా రనౌత్ చేసిన క్యారెక్టర్‌ను తెలుగులో తమన్నా పోషించింది. ఏడాదిన్నర క్రితమే పూర్తయినా విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత ఏడాది వచ్చిన తమిళ హిట్ మూవీ ‘నట్‌పే తునై’ ఆధారంగా సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చేశాడు. లావణ్యా త్రిపాఠి నాయికగా నటించిన ఈ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అలాగే గత ఏడాదే వచ్చిన మరో తమిళ బ్లాక్‌బస్టర్ ‘తాడమ్’ను రామ్ హీరోగా రీమేక్ చేశాడు డైరెక్టర్ కిశోర్ తిరుమల. ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీపై కరోనా దెబ్బపడి, థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తోంది.
ప్రస్తుతం మేకింగ్‌లో మూడు భారీ రీమేక్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి.. పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ కాగా, మరొకటి వెంకటేశ్ ‘నారప్ప’, ఇంకొకటి కృష్ణవంశీ తీస్తున్న ‘రంగమార్తాండ’. అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ హిట్ ఫిల్మ్ ‘పింక్’కు రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ రూపొందుతోంది. మేలోనే దీన్ని రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేయగా, మార్చి నుంచి షూటింగ్స్ ఆగిపోవడంతో, అది వీలు కాలేదు. పవన్ కల్యాణ్ మరో రెండు వారాలు షూటింగ్‌లో పాల్గొంటే సినిమా పూర్తవుతుంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గేదాకా సెట్స్ మీదకు రానని ఆయన తేల్చేశారు. నారప్ప పరిస్థితి కూడా అంతే. తమిళ హిట్ ఫిల్మ్ అసురన్‌కు అది రీమేక్. ఇప్పట్లో రిస్క్ తీసుకొని షూటింగ్ చెయ్యాల్సిన పనిలేదనీ, పరిస్థితులు పూర్తిగా కుదుటపడ్డాకే మిగతా సీన్లు తీసుకుందామని వెంకటేశ్ డిసైడ్ అయ్యాడు. జాతీయ అవార్డ్ పొందిన మరాఠీ మూవీ ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా ప్రకాశ్‌రాజ్‌తో కృష్ణవంశీ తీస్తున్న ‘రంగమార్తాండ’కు సంబంధించి కూడా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.
నిజానికి రీమేక్స్ అనేవి సర్వసాధారణమే. పలు తెలుగు సినిమాలు కూడా ఇతర భాషల్లో రీమేక్ కావడం మనం చూస్తున్న విషయమే. అయితే వీటివల్ల నేటివిటీ ప్రాబ్లెమ్ రావడమే కాకుండా క్రియేటివిటీ కూడా దెబ్బతింటుందనడంలో సందేహం లేదు. జాను, కౌసల్య కృష్ణమూర్తి, కిర్రాక్ పార్టీ, ఎంత మంచివాడవురా లాంటి సినిమాలు ఫెయిలవడానికి ఇవే కారణం. అంతమాత్రాన రీమేక్స్ టాలీవుడ్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని భయపడాల్సిన అవసరం లేదు. పరభాషా చిత్రాలను పరిశీలిస్తూనే మన క్రియేటివిటీని పెంచుకునే దిశగా పయనిస్తే తప్పకుండా అచ్చమైన మన కథలు అందర్నీ అలరిస్తాయి. దీనికి కావాల్సిందల్లా కుదురుగా ఆలోచించి, కొత్తదనం కోసం పరితపించడమే. ఎంతైనా ఒరిజినాలిటీ ఒరిజినాలిటీయే కదా...