డ్రగ్స్ పేరెత్తగానే బాలీవుడ్‌లో గుర్తుకువచ్చే మొదటి పేరు సంజయ్ దత్. 1992లోనే డ్రగ్స్ కేసులో అరెస్టయి, ఐదు నెలలు జైల్లో కూడా ఉన్నాడు ఈ మున్నాభాయ్. అన్ని రకాల మాదక ద్రవ్యాలని రుచి చూశాననీ అప్పట్లోనే ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశాడు. ఎప్పుడూ మత్తులో జోగుతూ ఉండే కొడుకు పరిస్థితి చూసి తండ్రి సునీల్ దత్ తల్లడిల్లిపోయారు. బలవంతంగా అమెరికాకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తే కానీ మామూలు మనిషి కాలేదు సంజయ్. అఫ్‌కోర్స్ ఆ తర్వాత అతను డ్రగ్స్ జోలికి వెళ్లలేదనుకోండి.
నిన్నటి తరం ప్రేక్షకుల కలల రాణి పర్వీన్ బాబి కూడా డ్రగ్స్‌కు బానిసే. డైరెక్టర్ మహేష్ భట్‌తో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో ఎల్.ఎస్.డి. అనే మాదక ద్రవ్యానికి ఆమె బానిస అయ్యింది. సినిమా ప్రపంచాన్ని వదిలిపెట్టి దూరంగా ఎక్కడికో వెళ్లిపోయింది. చివరికి అనామకంగానే తనువు చాలించింది.
1990 దశకంలో గ్లామరస్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మమతా కులకర్ణి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. యాక్టింగ్ కంటే డ్రగ్స్ బిజినెస్ బాగుందనుకొని భర్త విక్కీతో కలసి ఆ వ్యాపారం మొదలుపెట్టింది. కొంత కాలం బాగానే ఉంది కానీ ఆ తర్వాత వ్యవహారం బెడిసికొట్టి 2014లో కెన్యాలో భర్త విక్కీతో పాటు పోలీసులకు దొరికిపోయింది.
తను యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకొనే రోజుల్లో మారిజోనా మత్తు మందు రుచి చూశాననీ కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో రణబీర్ ఒప్పుకున్నాడు. ఆ మత్తు అప్పట్లో మజా ఇచ్చినా, దాన్నుంచి త్వరగానే బయటపడ్డానని చెప్పాడు. బహుశా రణబీర్‌కు ఆ ఎక్స్‌పీరియెన్స్ ఉందనేమో సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’లో టైటిల్ రోల్‌ను అతడికి ఇచ్చాడు డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ. ఆ క్యారెక్టర్‌లో రణబీర్ బాగా రాణించాడు.
డ్రగ్స్ కేసులో నటుడు ఫిరోజ్ ఖాన్ కొడుకు ఫర్దీన్ ఖాన్ కూడా నిందితుడే. స్వల్ప మొత్తంలో కొకైన్‌ను కొనుగోలు చేశాడన్న నేరంపై 2011లో ఫర్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది తర్వాతే బెయిల్ దొరకడంతో అతను జైలు నుంచి బయటకు వచ్చాడు.
షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఓసారి బెర్లిన్ ఎయిర్‌పోర్టులో మారిజోనా మత్తుమందుతో పోలీసులకు దొరికిపోయింది.
ఇలా బాలీవుడ్‌లో కొంతమంది నటులపై డ్రగ్స్‌కు సంబంధించిన మరకలు ఉన్నాయి. వీటి నుంచి బాలీవుడ్ త్వరగానే బయటపడగలిగింది. ఇక డ్రగ్స్ ఇతివృత్తంగా బాలీవుడ్‌లో హరే రామ హరే కృష్ణ, చరస్, జాన్‌బాజ్, జ్వాలా, ఫ్యాషన్, దమ్ మారో దమ్, ఉడ్తా పంజాబ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ‘ఉడ్తా పంజాబ్’ సినిమాలో సెలబ్రిటీలు మత్తుమందులకు ఎలా బానిసలవుతున్నారో వివరంగా చూపించింది.