Advertisementt

‘సూప‌ర్’ నుంచి ‘సైలెన్స్‌’ దాకా.. అనుష్క ప్ర‌యాణం!

Mon 27th Jul 2020 01:21 PM
anushka,super,silence,anushka movie journey,sweety,arundhati,rudramadevi,baahubali,anushka movies  ‘సూప‌ర్’ నుంచి ‘సైలెన్స్‌’ దాకా.. అనుష్క ప్ర‌యాణం!
Super movie to Silence.. Anushka Journey ‘సూప‌ర్’ నుంచి ‘సైలెన్స్‌’ దాకా.. అనుష్క ప్ర‌యాణం!
Advertisement
Ads by CJ

బెంగ‌ళూరు భామ అనుష్క కెరీర్ కీల‌క ద‌శ‌కు చేరుకుంద‌ని చెప్పాలి. నాగార్జున స‌ర‌స‌న రెండో హీరోయిన్‌గా చేసిన తొలి సినిమా ‘సూప‌ర్’ స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మ‌నుకునే ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డిన ఆమె, ‘అరుంధ‌తి’ సినిమా త‌ర్వాత సూప‌ర్ హీరోయిన్‌గా అవ‌త‌రించి, నేడు సౌత్ ఇండియాలోనే అగ్ర‌శ్రేణి తార‌గా నీరాజ‌నాలు అందుకుంటోంది. రాజ‌మౌళి ‘విక్ర‌మార్కుడు’తో తొలి విజ‌యాన్ని సాధించిన ఆమె.. ల‌క్ష్యం, శౌర్యం, అరుంధ‌తి, వేదం, ర‌గ‌డ‌, మిర్చి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి సినిమాల‌తో టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకుంది. జూలై 22తో ఆమె 15 సంవ‌త్స‌రాల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంది. అంటే ‘సూప‌ర్’ రిలీజై జూలై 22కు ప‌దిహేనేళ్లు గ‌డిచాయ‌న్న మాట‌.

అమాయ‌కంగా క‌నిపించే అంద‌మైన ముఖం, ముత్యాలు రాలుతున్న‌ట్ల‌నిపించే న‌వ్వు, తీగ‌లాంటి న‌డుము, (‘సైజ్ జీరో’కి ముందు వ‌ర‌కు), గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శించ‌డంలో ఉదార‌త్వం.. ఇవ‌న్నీ ఆమెకు ప్ల‌స్‌గా నిలిచాయి. తొలి సినిమా నుంచీ ‘సైజ్ జీరో’ సినిమా రిలీజ‌య్యే వ‌ర‌కూ గ్లామ‌ర్ విష‌యంలో ఆమెకు మంచి పేరే వ‌చ్చింది. ఇప్పుడు హాలీవుడ్ న‌టులు కూడా న‌టించిన ‘నిశ్శ‌బ్దం’ (ఇంగ్లీష్ వెర్ష‌న్ ‘సైలెన్స్‌’)లో ఆమెకు అవ‌కాశం క‌ల్పించింది మాత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో ఆమె ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం, ‘బాహుబ‌లి’లో దేవ‌సేన‌గా ఆమెకు ల‌భించిన ఖ్యాతే.

ఎయిర్‌పోర్ట్‌లో అనుష్క‌తో జ‌రిపిన సంభాష‌ణ త‌ర్వాత ‘నిశ్శ‌బ్దం’లో మూగ చిత్ర‌కారిణి సాక్షి పాత్ర‌కు ఆమె అయితేనే న్యాయం చేస్తుంద‌ని కోన వెంక‌ట్ నిర్ధారించుకుని, ఆమెను సంప్ర‌దించారు. ఆమె కూడా స్క్రిప్ట్‌, సాక్షి క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో ఆ సినిమా చేసింది. హేమంత్ మ‌ధుక‌ర్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్ల‌ర్‌లో సాక్షి స‌ర‌స‌న మాధ‌వ‌న్ న‌టించ‌గా, హాలీవుడ్ యాక్ట‌ర్ మైఖేల్ మ్యాడ్స‌న్‌, అంజ‌లి, శాలినీ పాండే, సుబ్బ‌రాజు, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల వంటి ప్ర‌తిభావంతులు న‌టించారు.

అనుష్క త‌న కెరీర్‌లో ఎక్కువ‌గా సీనియ‌ర్ స్టార్ నాగార్జున‌, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించింది. ‘సూప‌ర్’ త‌ర్వాత ‘డాన్‌’, ‘ర‌గ‌డ‌’, ‘డ‌మ‌రుకం’, ‘ఓం న‌మో వేంక‌టేశాయ’ సినిమాల్లో న‌టించిన ఆమె.. ఆయ‌న ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’, ‘కేడి’, ‘ఊపిరి’ సినిమాల్లోనూ అతిథి పాత్ర‌లు పోషించింది. ఇక ప్ర‌భాస్‌తో ‘బిల్లా’లో తొలిసారిగా జోడీ క‌ట్టిన ఆమె.. ఆపైన ‘మిర్చి’, ‘బాహుబ‌లి’, ‘బాహుబ‌లి 2’ సినిమాల్లో నాయిక‌గా న‌టించింది.

సీనియ‌ర్ స్టార్స్ అంద‌రితోనూ న‌టించిన అనుష్కకు ఇంత‌దాకా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్‌తో న‌టించే అవ‌కాశం రాలేదు. ‘వ‌కీల్ సాబ్‌’లో ఆయ‌న భార్య క్యారెక్ట‌ర్‌కు ఆమెను మొద‌ట ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నా, త‌ర్వాత ఆ పాత్ర‌ను శ్రుతి హాస‌న్‌కు ఇచ్చారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్ జోడీగానూ ఆమె చెయ్య‌లేదు. అల్లు అర్జున్‌తో ఆమె ‘వేదం’, ‘రుద్ర‌మ‌దేవి’ చిత్రాల్లో న‌టించినా.. అవి అత‌నికి జోడీగా కాదు.

టాలీవుడ్‌లో విజ‌య‌శాంతి త‌ర్వాత సూప‌ర్ హీరోయిన్ రేంజి అందుకున్న తార‌గా ఎదిగిన అనుష్క త్వ‌ర‌లోనే జీవితంలో స్థిర‌ప‌డుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమ‌ధ్య రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు ప్ర‌కాష్ కోవెల‌మూడితో ఆమె పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్లు వ‌చ్చిన ప్ర‌చారంలో నిజం లేద‌ని తేలింది. ప్ర‌భాస్‌తో ఆమె పేరు అనేక‌మార్లు వినిపించినా, ఇద్ద‌రూ వాటిని ఖండిస్తూ, తాము మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని చెబుతూ వ‌చ్చారు. 38 ఏళ్ల అనుష్క‌ ఎప్పుడు వివాహం చేసుకుంటుందోన‌ని ఆమె శ్రేయోభిలాషులంతా ఎదురు చూస్తున్నారు.

Super movie to Silence.. Anushka Journey :

Anushka completes 15 years cine career

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ