చాలా కాలం తర్వాత ప్రియమణి రెండు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. వాటిలో ఒకటి ‘విరాటపర్వం’లో చేస్తున్న కామ్రేడ్ భారతక్క పాత్ర అయితే, ఇంకొకటి ‘నారప్ప’ చిత్రంలో చేస్తున్న సుందరమ్మ పాత్ర. టాలీవుడ్‌లో ప్రియమణి ఒక పెద్ద హీరో సరసన నటించి పదేళ్లయిపోయింది. 2010లో ‘శంభో శివ శంభో’ రవితేజ పక్కన, ‘రగడ’లో నాగార్జున సరసన (సెకండ్ హీరోయిన్‌గా) నటించింది. ఇన్నేళ్ల తర్వాత సీనియర్ స్టార్ వెంకటేశ్ భార్యగా ‘నారప్ప’లో ఆమె నటిస్తోంది. ‘నారప్ప’ తమిళ హిట్ ఫిల్మ్ ‘అసురన్’ రీమేక్ అనే విషయం మనకు తెలుసు. ఒరిజినల్‌లో మంజు వారియర్ చేసిన పాత్రను ప్రియమణి చేస్తోంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని డి. సురేశ్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సుందరమ్మ పాత్రకు ప్రియమణిని దర్శక నిర్మాతలు ఎంపిక చేయడం ఊహాతీతం. నటనకు అవకాశమున్న ఒక పల్లెటూరి గృహిణి పాత్ర కోసం వాళ్లు చేసిన అన్వేషణ ప్రియమణి దగ్గర ఆగింది. జాతీయ ఉత్తమనటిగా అవార్డు అందుకున్న ప్రియమణి దానికి న్యాయం చేస్తుందని వాళ్లు నమ్మారు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురి తల్లి పాత్ర అది. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి తల్లడిల్లిపోయి మానసిక రుగ్మతకు గురయ్యే పాత్ర. ఆమె పాత్రలో యంగర్ ఫేజ్ కూడా ఉంటుంది. అలా రెండు ఛాయలున్న పాత్రను ప్రియమణి చేస్తోంది. సుందరమ్మగా ఆమె లుక్ ఇప్పటికే ఆకట్టుకుంది.
నటనకు సవాలు విసిరే పాత్రలు చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. ‘పెళ్లైన కొత్తలో’ సినిమాలో జగపతిబాబు భార్యగా ఆయనతో పోటీపడి నటించి ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ వెంటనే తమిళ సినిమా ‘పరుత్తివీరన్’లో ముత్తళుగు పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును చేజిక్కించుకుంది. ‘యమదొంగ’, ‘ప్రవరాఖ్యుడు’, ‘శంభో శివ శంభో’ చిత్రాలలో మంచి పాత్రలు చేసింది. అయితే తెలుగులో కంటే మలయాళ, తమిళ చిత్ర రంగాలే ఆమెలోని నటిని బాగా ఉపయోగించుకున్నాయి.
అందం, అభినయ సామర్థ్యం మెండుగా ఉన్నా, చేసిన ప్రతి పాత్రలోనూ రాణించినా టాలీవుడ్‌లో ఆమె కెరీర్ ఓ స్థాయికి వచ్చి ఆగిపోవడం ఆశ్చర్యకరం. దక్షిణాది భాషా చిత్రాలన్నింటిలోనూ నాయికగా నటించిన ఆమె మాతృభాష మలయాళం సహా ఎందులోనూ టాప్ రేంజికి వెళ్లలేకపోయింది. తెలుగులో టాప్ హీరోల విషయానికొస్తే మెయిన్ హీరోయిన్‌గా బాలకృష్ణ (మిత్రుడు), జూనియర్ ఎన్టీఆర్ (యమదొంగ)తో మాత్రమే నటించే అవకాశం ఆమెకు లభించింది. తెలుగులో ఏడేళ్ల క్రితం చేసిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘చండీ’ ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడిన ఆమె ఓ వైపు నటనను కొనసాగిస్తూనే, మరోవైపు టెలివిజన్‌పై దృష్టి సారించింది. సౌత్‌లోని అన్ని భాషలో టీవీ చానళ్లలోని డాన్స్ రియాలిటీ షో జడ్జ్‌గా వ్యవహరిస్తూ వచ్చింది. ఆ క్రమంలో తెలుగులోనూ ‘ఢీ 10’, ‘ఢీ 11’ షోలకు జడ్జిగా వ్యవహరించింది.
ఇన్నాళ్ల తర్వాత తెలుగులో వరుసగా రెండు సినిమాలను ఒప్పుకొని చేస్తుండటం, ఆ రెండూ నటిగా ఆమెకు పేరు తెచ్చేవే కావడం విశేషం. ‘విరాటపర్వం’లోని భారతక్క పాత్ర ప్రియమణి ఇంతదాకా చేసిన ఉత్తమ పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుందని ఆ సినిమా యూనిట్ మెంబర్స్ గట్టి నమ్మకంతో చెబుతున్నారు. అలాగే ‘నారప్ప’లో సుందరమ్మ పాత్ర నటిగా ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందని ఆ చిత్ర బృందమూ అంటోంది. ఈ రెండు పాత్రలతో వచ్చే పేరుతో ప్రియమణి కెరీర్ టాలీవుడ్‌లో ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాల్సిందే.