'లై' పక్కా హిట్ అని ఆరోజే డిసైడ్ అయిపోయా: దర్శకుడు హను రాఘవపూడి
14 రీల్స్ బ్యానర్ అంటే తెలుగు సినిమాకు ఓ బ్రాండ్. కమర్శియల్ సినిమాలు నిర్మిస్తూనే..ఇన్నోవేటివ్ థాట్స్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటుంది. అంతటి క్రేజీ బ్యానర్ ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'లై' చిత్రాన్ని వెంకట్ బోయిన్‌పల్లి సమర్పణలో 14 రిల్స్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ఆడియో సూపర్ హిట్ అయింది. ట్రైలర్...టీజర్ లతో అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. లవ్ కమ్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో స్టైలిష్ తెరకెక్కిన సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో హను రాఘవపూడి కాసేపు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం....
మీరు ఎలాంటి కథలోనైనా ప్రేమను మేళవించడానికి కారణం ఏదైనా ఉందా?
నా ప్రతీ సినిమాలో లవ్ కామన్ గా ఉంటుంది. ఆ పాయింట్ తోనే మిగతా కథను అల్లుకుంటా. ప్రేమలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ కు నా క్రియేటివిటీని వాడి డిఫరెంట్ గా కథ రాసుకుంటా. 'లై' సినిమా ప్రేమ ప్రధానంగా సినిమానే. అయితే ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది. అది భారీ స్థాయిలోనే ఉంటుంది. నాకు తెలిసి లవ్ లేకుండా ఏ సినిమా కూడా ఉండదు. సినిమాను బట్టి స్పాన్ మారొచ్చు, లెవల్ మారొచ్చు.
అమెరికాలో షూటింగ్ చేయడానికి ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందా?
మన దేశంలోనే మంచి లోకేషన్స్ ఉన్నాయి. కానీ నా కథకు అవి సరిపోవు అనిపించింది. కథ డిమాండ్ మేరకే అమెరికాలో ఎక్కవ షూటింగ్ చేశాం. లోకేషన్స్ అన్నీ నా కథకు బాగా కుదిరాయి. అందుకే సినిమా అంత బ్యూట్ ఫుల్ గా వచ్చింది. మొత్తం 95 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాం. సినిమాను కొంచెం డిఫరెంట్ గా షూట్ చేశాం. మేకింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సన్నివేశాలను రాసుకోవడాన్ని బట్టే మేకింగ్ కూడా డిసైడ్ చేస్తాను.
అర్జున్ ను విలన్ గా తీసుకోవాలని కథ రాసుకున్న టైమ్ లోనే అనుకున్నారా? లేక యాదృశ్చికంగా జరిగిందా?
అర్జున్‌గారంటే నాకు చిన్న నాటి నుంచి ఎంతో ఇష్టం. ఆయన నటించిన సినిమాలన్నీ చూశాను. ఆయనతో కలిసి ఓ సినిమాకు పనిచేయాలని అప్పటి నుంచే ఉండేది. ఇన్నాళ్లకు అది వీలైంది. సుధాకర్‌రెడ్డిగారు ఓసందర్భంలో నన్ను ఆయనతో కలిపించారు. నేను భయపడుతూనే కథను ఆయనకు వినిపించాను. ఆయనకు నచ్చడంతో చేస్తానని వెంటనే ఒకే చేశారు. ఆయనలా అన్న రోజునే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం బలంగా కల్గింది. ఆయన క్యారెక్టర్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆయనలో అబ్‌సెషనే సినిమాలో యూనిక్‌గా ఉంటుంది. సినిమాకు హైలైట్ పాయింట్ అవుతుంది.
సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేసినట్లున్నారు?
కథకు తగ్గట్లు, నితిన్ మార్కెట్ వేల్యూను అనుసరించే సినిమా మేకింగ్ చేశాం. అనీల్‌గారు ప్లానింగ్ అద్భుతం. రేపు సినిమాను తెరపై చూస్తే 70 కోట్ల సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. నిర్మాతలు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. అది తెరపై కనపడుతుంది. ఇది రివేంజ్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు కానీ రివేంజ్ పార్ట్ ఉంటుంది.
ఇలాంటి కథలను తెరకెక్కించాలంటే నిర్మాతలు కూడా మీ అంత ఫ్యాషన్ గా ఆలోచిస్తేనే వర్కౌట్ అవుతుందంటారా?
కచ్చితంగా నండి. నా క్రియేటివిటీనే బయట పెట్టాలంటే నిర్మాతలు కూడా నా లా ఆలోచించగలగాలి. అంత ఫ్యాషన్ ఉంటే ఇలాంటి స్టోరీలు బయటకు వస్తాయి. లేదంటే అవి మైండ్ లోనే ఇంకిపోతాయి. నిర్మాతలు లేనిదే నేను లేను. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ ఇన్నోవేటివ్ గానే ఉంటాయి. అందుకు నన్ను ప్రోత్సహించిన నిర్మాతలందరికీ కృతజ్ఞతలు.
దర్శకుడిగా ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది?
దర్శకుడిగా నా జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. సినిమా హిట్ అయితే పొంగిపోవడం, ప్లాప్ అయితే కుంగిపోవడం తెలియదు. స్థిరత్వంతో ఉంటాను. అందుకు కారణం. నా స్నేహితులు. నా చుట్టు ఉన్న వాతావరణం.
మీ తదుపరి చిత్రాలు ఏంటి?
నానితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాను. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అది. లడక్‌లో సినిమా రన్ అవుతుంది. కాబట్టి వచ్చే మే వరకు షూటింగ్ చేయలేం. అలాగే నాని కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నానని ముగించారు.