టాలీవుడ్ హీ మేన్....
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్....ఆరడుగుల హైట్, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్....ఇవన్నీ కలిసి ఉన్న అసలు సిసలైన టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వెండితెరపై బాహుబలిగా తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. తెలుగు సినిమా హీమాన్‌గా.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే రెబల్‌స్టార్‌గా ప్రభాస్ ఎదగడం వెనుక ఎంతో కృషి వుంది. మరెంతో పట్టుదల వుంది. అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవడానికి వేసిన ప్రతి అడుగులో ఇంకెంతో దీక్ష వుంది. కృషి, పట్టుదల, దీక్ష.. ఈ మూడూ ప్రభాస్‌ని కోట్లాది మంది అభిమానించే రెబల్‌స్టార్‌ని చేశాయి.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటవారసుడుగా 'ఈశ్వర్' చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. 'రాఘవేంద్ర', 'వర్షం', 'అడవిరాముడు', 'చక్రం', 'ఛత్రపతి', 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా' 'బుజ్జిగాడు' 'బిల్లా', 'ఏక్‌నిరంజన్', 'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్', 'రెబల్', 'మిర్చి' వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.
ఇంటర్నేషనల్ హీరో..
బాహుబలి సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్‌లో తెలుగు సినిమా స్థాయి, మార్కెట్ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా సహా పలు దేశాల్లో ఈ చిత్రం సూపర్ సక్సెస్‌ను సాధించింది. బాహుబలి వరకు ప్రభాస్ తెలుగు హీరో. బాహుబలి2కి ఇంటర్నేషల్ హీరో అయ్యారు. బాహుబలి 650 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతోపాటు పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్ హీరో అయ్యారు. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబలి2లో ప్రభాస్‌ను చూసేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోందంటే యూనివర్సల్ హీరోగా ప్రభాస్ ఎంతటి ఖ్యాతిని సంపాదించుకున్నారో అర్థమవుతుంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో తెలుగు సినిమా అంటే చిన్నచూపు చూసేవారు. కానీ ప్రభాస్ బాహుబలితో తెలుగు సినిమా రేంజ్‌ను తెలియచెప్పారు. బాలీవుడ్‌లో బాహుబలి హిందీ వెర్షన్ వందకోట్ల రూపాయలను వసూళ్లు చేయడం గొప్ప విషయం. ప్రభాస్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్‌ను హిందీలో నటించమని ఫ్యాన్సీ ఆఫర్స్ ప్రకటించడం అతనికి వున్న ఫాలోయింగ్‌ని తెలియజేస్తుంది. బాహుబలి సినిమా విడుదల వేరే భాషల్లో కూడా ప్రభాస్‌కు ఆదరణ పెరగడంతో తెలుగులో కమర్షియల్‌గా యావరేజ్ సక్సెస్‌ను సాధించిన సినిమాలు కూడా సోషల్ మీడియాల్లో, డబ్బింగ్ వెర్షన్స్‌లో సూపర్‌హిట్ చిత్రాలుగా ఎక్కువమంది వ్యూవర్స్ చూసిన చిత్రాలుగా నిలిచాయి.
బాహుబలిగా సెన్సేషనల్ రికార్డ్స్..
కొన్ని సినిమాలు.. కొన్ని కథలు ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు కానీ 'బాహుబలి'లాంటి సినిమా చెయ్యాలంటే ప్రభాస్ ఒక్కడే చెయ్యగలడని 'బాహుబలి ది బిగినింగ్' విడుదలకు ముందు అనుకున్నారు. రిలీజ్ తర్వాత అవును నిజమే....బాహుబలిగా ప్రభాస్ స్థానంలో ఇంకెవర్నీ ఊహించలేంటూ ముక్త కంఠంతో బదులిచ్చారు...అది కూడా రికార్డుల రూపంలో...బహుబలి చిత్రాన్ని ప్రభాస్ కోసమే రాజమౌళి స్పెషల్‌గా డిజైన్ చేశారు. ప్రభాస్‌ని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి 'బాహుబలి'ని ఓ అపురూప శిల్పంలా రూపొందించారు...రూపొందిస్తున్నారు.
దటీజ్ ప్రభాస్..
తెలుగు సినిమా అంటే ఏవో నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్.. కొన్ని కామెడీ డైలాగులు పెడితే సరిపోతాయి కదా అనుకున్నవారందరూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది విజువల్ వండర్ అంటూ అప్రిషియేట్ చేశారు. ముఖ్యంగా హీరో ప్రభాస్ బాహుబలి పార్ట్ 1 కోసమే రెండేళ్లు కష్టపడ్డారు. ఈజీగా సినిమాలు చేసుకునే అవకాశాలున్నా ప్రభాస్ ఒక సినిమా కోసం రెండేళ్ళు ఇంకే సినిమా కమిట్ అవకుండా వర్క్ చెయ్యడం ఏమిటి? సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకోవడం ఏమిటి? సినిమా కోసం నిజంగా కత్తి యుద్దాలు నేర్చుకోవడం ఏమిటి? రెండేళ్ళలో ఈజీగా నాలుగు పక్కా కమర్షియల్ సినిమాలు చేసుకుంటే పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు అన్నీ వస్తాయి కదా.. ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి.. కథ చెప్తానని ఎవరు అడిగినా వినకుండా.. ఏ నిర్మాత ఎంత భారీ రెమ్యూనరేషన్ ఇస్తానని ఆఫర్ ఇచ్చినా.. ఒప్పుకోకుండా సున్నితంగా తిరస్కరిస్తూ.. అందరికీ ప్రభాస్ బాహుబలి కోసమే తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. బాహుబలి రెండు పార్టుల కోసం ప్రభాస్ వెచ్చించిన సమయం నాలుగేళ్లు. ఇలా ఒక స్టార్ హీరో తన కెరీర్‌లో నాలుగేళ్ళ విలువైన సమయాన్ని ఓ సినిమాకే కేటాయించడం ప్రభాస్ డేడికేషన్‌కు నిదర్శనం. ఏ సినిమా చేసినా బాహుబలి తర్వాతే అంటూ ఎన్ని సినిమాలు చేసాం అన్నది కాదు.. ఎంత గొప్ప సినిమా చేస్తున్నాం అన్న పాయింట్‌ని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'బాహుబలి'ని తన నటనతో జీవం పోస్తున్నాడు ప్రభాస్. అందరి అంచనాలను మించి బాహుబలి ది బిగినింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 600 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. టాలీవుడ్ జక్కన్నగా పేరున్న దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ 1 హై బడ్జెట్‌తో, విజువల్ టెక్నాలజీతో తెలుగు సినిమా స్టామినాని తెలియజేసింది. సైమా, ఐఫా అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ సహా పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అంతే చైనాలో 5000 థియేటర్స్‌లో విడుదలై సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. చైనాతో పాటు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 'బాహుబలి' చిత్రాన్ని ప్రదర్శించారు. 'బాహుబలి'గా ప్రభాస్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.
అరుదైన గౌరవం..
భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడవ్‌ు టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టిం చబోతున్నారు. ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన ఈ మైనపు ప్రతిమ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మార్చ్ 2017 నుండి ప్రత్యేకమైన ఆకర్షణ కాబోతుంది. 2016 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపు విగ్రహ ప్రతిష్ట తర్వాత, ఈ గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్ నిలవబోతున్నారు. ప్రముఖ నిర్మాత అయిన తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, ప్రముఖ నటులు, రాజకీయనాయకులు అయిన పెదనాన్న కృష్ణంరాజు గార్ల వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా కూడా ప్రఖ్యాతిగాంచారు. భారతీయ చిత్రాలు సాధించిన వసూళ్ల పరంగా ప్రపంచంలో మూడవస్ధానంలో, భారతదేశంలో మొదటి స్ధానంలో నిల్చిన 'బాహుబలి ది బిగినింగ్ (2015)' లో నటించిన ప్రభాస్, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అత్యధికులు వెతికిన వ్యక్తుల్లో ఒకరు అయ్యారు. ప్రభాస్ ప్రతిమను యదాతధంగా రూపొందించడానికి మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నుండి వచ్చిన కళాకారులు ఆయనను హైదరా బాద్‌లో కలిసి 350 ఛాయాచిత్రాలను, ఆయన శారీరక కొలతలను తీసుకున్నారు. ఆయన బాహు బలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి అదే పేరుతో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. ఈ చిత్రంలో నటించిన తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదగడంతో పాటు, అనేక మంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు.
ఎగ్జయిటింగ్ క్రియేట్ చేస్తున్న 'బాహుబలి 2'
కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు?.. ఈ ప్రశ్న తెలుగు ప్రేక్షకులనే కాదు..ఇండియాలో చాలా ఫేమస్ అయ్యింది. కానీ సమాధానం మాత్రం తెలియడం లేదు..ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఏప్రిల్ 28, 2017 వరకు ఆగాల్సిందే.. ఎందుకంటే బాహబలి 2 మరి అదే రోజున విడుదలవుతుంది. అయితే ఆలోపే బాహుబలికి సంబంధించి ఫెస్టివల్‌ను స్టార్స్ చేస్తున్నామని హీరో ప్రభాస్ తెలియజేశారు. నా ఫ్యాన్స్, అందరూ ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్‌ను అక్టోబర్ 22న నా పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేస్తున్నామని ప్రభాస్ అన్నారు. బాహుబలికి సంబంధించిన రకరకాల విషయాలు అక్టోబర్ నుండి విడుదలవుతూ ఆడియన్స్‌ని ఎగ్జయిట్ చేస్తున్నాయి. బాహుబలి యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఒక మహావ క్షంగా తీసుకుంటే టీవీ సీరీస్, కామిక్స్, బుక్స్, గేమ్స్ అన్నీ హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అంతే కాకుండా బాహుబలితో వర్చువల్ రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్ అనే దాన్ని పరిచయం చేస్తుండటం విశేషం. బాహుబలి థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే వర్చువల్ రియాలిటీ హయ్యండ్ ఎక్స్ పీరియన్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మేకింగ్ వీడియోస్‌ని వర్చువల్ రియాలిటీలో చేస్తున్నారు. మేకింగ్ వీడియోలను కూడా హయ్యండ్ క్వాలిటీస్‌తో రూపొందిస్తున్నారు. ఇన్ని రకాల విశేషాలతో మరోసారి తెలుగు సినిమా స్టామి నాని, వాల్యూను పెంచి బాహుబలి2 ఎప్పు డెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తు న్నారు. బాహుబలి పార్ట్ 1తో 600 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిన హీరో ప్రభాస్ బాహుబలి2తో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
150 కోట్ల బడ్జెట్ హీరో....
బాహుబలితో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్ సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 150 కోట్ల బడ్జెట్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం తర్వాత రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ పతాకంపై 'జిల్' రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ ప్రెస్టీజియస్ మూవీ ప్రభాస్ చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత చేయబోయే సినిమాల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇప్పుడు ప్రభాస్ ఒక భాష హీరో కాదు, మూడు భాషల హీరో అనిపించుకుంటున్నారు. ఇకపై ప్రభాస్ చేసే సినిమాలన్నీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే నిర్మాణం జరుపుకోవచ్చు. ఇటు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌లో కూడా ప్రభాస్ ఇమేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా 'డార్లింగ్' అని పలకరించే ప్రభాస్‌ని అందరూ ఎంతో ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుకుంటారు. అలాంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.