దిల్ రాజు సమర్పకుడిగా, మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం 'రోజులు మారాయి'. మారుతి కథ, స్క్రీన్ ప్లే అందించగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 1 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. మారుతి విలేకర్లతో ముచ్చటించారు.
నలుగురి మధ్య జరిగే కథ..
రీసెంట్ గా ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఓ ఐడియా వచ్చింది. దాని చుట్టూ అల్లుకున్న కథే ఈ సినిమా. అబ్బాయిని, అమ్మాయిలు కలిసి చంపేశారని ఈ మధ్య చదివాను. దానికొక థ్రిల్లింగ్ ఎలిమెంట్ జోడించి ఈ సినిమా తీశారు. డైరెక్టర్, రైటర్ కలిసి కథను డెవలప్ చేశారు. నలుగురి మధ్య జరిగే డ్రామానే ఈ సినిమా.
చిన్న సినిమాలకే కష్టపడాలి..
చిన్న సినిమాలను స్ట్రాంగ్ గా ఎవరు తీయట్లేదు. చిన్న సినిమాల మీద చిన్న చూపు ఉంటుంది. కాబట్టి చిన్న సినిమా కోసం ఎక్కువ కష్టపడాలి. కొత్త వాళ్ళతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి. వారానికి ఐదారు చిన్న సినిమాలు వస్తుంటే డస్ట్ బిన్ ఏది వేస్తున్నారని అనుకునే పరిస్థితి కలుగుతోంది. కానీ అదే సినిమా బావుంటే దానికొచ్చే పేరు, లాభాలే వేరు. నేను ఎక్కువ పేరు సంపాదించుకుంది చిన్న సినిమాలతోనే.
దిల్ రాజు గారు కథ విని చేస్తానన్నారు..
ఈ సినిమాలో ఒక జంటగా తేజశ్విని, పార్వతీశంలను తీసుకోవాలని అనుకున్నాం. అయితే వారిద్దరి డేట్స్ దిల్ రాజు గారి దగ్గర ఉన్నాయని ఆయనని కలిశాం. ఆయనకు కథ బాగా నచ్చింది. మేమే ప్రొడ్యూస్ చేస్తున్నామని తెలిసి మాతో అసోసియేట్ అయ్యారు.
అప్పుడు పేర్లతో పని ఉండదు..
దిల్ రాజు, మారుతి వంటి పేర్లు ప్రేక్షకులను థియేటర్ వరకే రప్పించగలవు. సినిమా రిలీజ్ అయిన తరువాత నూన్ షో నుండి ఆ పేర్లతో పని ఉండదు. ఆడియన్స్ కు సినిమా నచ్చితేనే చూస్తారు.
ప్రేమ అలా కాకుడదని..
ఈ మధ్యకాలంలో ప్రేమలో పడిన తరువాత మరొక ఆప్షన్ దొరికితే వెళ్లిపోతున్నారు. బట్టలు సెలెక్ట్ చేసే విధంగా ప్రేమను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రేమ అలా కాకూడదనే ఉద్దేశ్యంతో చేసిన సినిమా.
సెట్స్ మీదకి వెళ్ళలేదు..
ఈ సినిమా దర్శకత్వం విషయంలో నేను ఇన్వాల్వ్ కాలేదు. బాబు బంగారం సినిమాతో నేను బిజీగా ఉన్నాను. స్క్రిప్ట్ లో చిన్న చిన్న కరెక్షన్స్ చేశాను కానీ సెట్స్ మీదకి మాత్రం వెళ్ళలేదు. ఔట్ పుట్ చూసిన తరువాత మాత్రం నాలానే సినిమా చేశారనిపించింది.
అవకాశాలు ఇవ్వాలనే..
నేను డైరెక్ట్ చేయడానికి చాలా కథలు ఉన్నాయి. నా టీమ్ ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాను.
బాబు బంగారం షూటింగ్ పూర్తి..
వెంకటేష్ హీరోగా చేస్తోన్న బాబు బంగారం సినిమా షూటింగ్ పూర్తయింది. ఒక్క సాంగ్ బ్యాలన్స్ ఉంది. నేను చిన్నప్పటినుండి వెంకటేష్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆడియన్స్ ఆయనను ఎలా చూడడానికి ఇష్టపడతారో... అలా ఈ సినిమాలో చూపించాయి. కంప్లీట్ ఎంటర్టైనర్ సినిమా అంటూ ఇంటర్వ్యూ ముగించారు.