నాగశౌర్య, నీహారిక జంటగా టీవీ9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామరాజు దర్శకత్వంలో మధురా శ్రీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం 'ఒక మనసు'. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇదే విషయాన్ని నిర్మాత మధురా శ్రీధర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
కొందరికి బాగా నచ్చింది..
ఈ సినిమా కొందరికి బాగా నచ్చింది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అని చెప్పుకుంటున్నారు. మరికొందరు మాత్రం సినిమా స్లోగా ఉందని చెబుతున్నారు. సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా మొదటి భాగంలో రొమాన్స్ డోస్ ఎక్కువైపోయింది. మేము మొదటి నుండి కంటెంట్ ను ప్రేమించడం వలన తప్పులు తెలియలేదు. కానీ ఆడియన్స్ నుండి వస్తోన్న రెస్పాన్స్ తో ఫస్ట్ హాఫ్ కాస్త ట్రిమ్ చేస్తే బావుంటుందని 14 నిమిషాలు పాటు ట్రిమ్ చేశాం. ఇప్పుడు సినిమా చూసిన వారంతా మాత్రం బావుందని చెబుతున్నారు. అన్ని మల్టిప్లెక్స్ లలో, సింగిల్ థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
మెగాఫ్యామిలీను క్లైమాక్స్ ఆకట్టుకుంది..
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నీహారికను పద్ధతిగా, అందరికి నచ్చే విధంగా చుపించాలనుకున్నాం. ముఖ్యంగా మెగా కుటుంబ సభ్యులను ఈ సినిమా నిరాశ పరచకూడదని అనుకున్నాం. వారందరికీ సినిమా బాగా నచ్చింది. క్లైమాక్స్ 30 నిమిషాలు వారిని విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమా చేయడానికి గట్స్ ఉండాలి..
ఒక ప్రొడ్యూసర్ గా అందరూ మెచ్చే సినిమా చేయాలి. ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ విన్న ఏ ప్రొడ్యూసర్ సినిమా చేయడానికి ముందుకురారు. తెలుగు వాళ్లకు యాంటీ క్లైమాక్స్ నచ్చదని అనుకుంటారు కానీ తమిళ డబ్బింగ్ చిత్రాలు యాంటీ క్లైమాక్స్ తో ఉండే వాటిని తెలుగు వాళ్ళు ఆదరిస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు చూడడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ మనమే ధైర్యం చేయట్లేదు. అందుకే గట్స్ తో సినిమా చేశాను.
ఆ చిత్రాలతో పోల్చడం తప్పు లేదు..
ప్రతి దానికి బేసిస్ అనేది ఉంటుంది. మన పక్క వాళ్ళు మనకంటే బెటర్ గా పని చేస్తున్నప్పుడు వాళ్ళని బీట్ చేయాలని ఉంటుంది. అదే ఆధారంగా చేసుకొని పని చేస్తుంటాం. అలానే ఈ సినిమా కథ విన్నప్పుడు మరోచరిత్ర, గీతాంజలి సినిమాలు గుర్తొచ్చాయి. అలాంటి సినిమా అవ్వొచ్చని మాత్రమే చెప్పాం. అందులో తప్పు లేదు. వాటిని రీచ్ కాకపోయినా ఆ స్థాయిలో చేయడానికి ప్రయత్నించాం.
కుల రాజకీయాలే ఉన్నాయి..
స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి మన దేశంలో కుల రాజకీయాలే ఉన్నాయి. నేను వాటిని సపోర్ట్ చేస్తూ సినిమాలో ఎలాంటి డైలాగ్స్ చెప్పలేదు. మనదగ్గర ఇలాంటి ఒక సమస్య ఉందని ఎత్తి చూపించాను అంతే..
బాగా నటించారు..
నాగశౌర్య ఈ సినిమాలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. నీహారికకు మొదటి సినిమా అయినా.. చక్కగా నటించింది. తెరపై వాళ్ళిద్దరి జంట చూడముచ్చటగా అనిపించింది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. కానీ మొదట రామరాజు గారితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాను. ఇదివరకే కథ చెప్పారు. మంచి లవ్ స్టోరీ. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా తరువాత నేను బాగా నిరాశ చెందాను. అందుకే డైరెక్షన్ కి కొంత గ్యాప్ ఇచ్చి సినిమా నిర్మాణంలోకి దిగాను. ఇప్పటికే చాలా ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. ఈ సంవత్సరం చివర్లో ఖచ్చితంగా ఓ సినిమా డైరెక్ట్ చేస్తాను. మధ్యలో విక్కీ డోనర్ సినిమా రీమేక్ చేయాలనుకున్నా కానీ ఎందుకో వర్కవుట్ అవ్వదనిపించింది. అలానే శ్రీశాంత్ హీరోగా క్రికెట్ బెట్టింగ్ కోణంలో సినిమా చేయాలనుకున్నాను. కానీ సినిమా క్లైమాక్స్ విషయంలో శ్రీశాంత్ కు నాకు అభిప్రాయబేధాలు రావడంతో అది కూడా ఆగిపోయిందంటూ.. ఇంటర్వ్యూ ముగించారు.