'అష్టాచమ్మా','గోల్కొండ హై స్కూల్','అంతకముందు ఆ తరువాత' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ప్రస్తుతం నాని హీరోగా, సురభి, నివేత హీరోయిన్లుగా మోహన్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం 'జెంటిల్ మన్'. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ విలేకర్లతో ముచ్చటించారు.
నాని కోసం ఎదురు చూశాం..
ఈ సినిమా కథ నాకు తెలిసినప్పటికీ నాని 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో నటిస్తున్నాడు. అ తరువాత తను రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. దాంతో నేను నాని కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో మరో హీరోతో వెల్లిపోదాం అనుకున్నాను. శర్వానంద్ కు కథ చెప్పాం కాని తను 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా మంది హీరోలకు చెప్పాను కాని నాని అయితేనే ఈ కథకు న్యాయం చేయగలడనిపించింది. అందుకే తన కోసం ఎదురు చూసి సినిమా మొదలుపెట్టాను.
తెలుగు టైటిల్ పెట్టాలనుకున్నాను..
నా సినిమాలకు తెలుగు టైటిల్స్ పెట్టాలనుకుంటాను. ఎవరైతే ఒక వ్యక్తిని విలన్ అని భావిస్తారో.. తను విలన్ కాదు నిజమైన జెంటిల్ మన్ అని చెప్పే విధంగా సినిమా ఉంటుంది. అందుకే జెంటిల్ మన్ అనే టైటిల్ పెట్టాం. మొదట ఉత్తముడు అనుకున్నాం కాని కుదరలేదు. ఉత్తమ విలన్ అనే టైటిల్ మా కథకు బాగా సెట్ అవుతుంది. అయితే ముందే విలన్ మంచోడని తెలిసిపోతుంది. అలా తెలియకూడదనుకున్నాం.
స్క్రీన్ ప్లే పెద్ద చాలెంజ్..
ఈ సినిమా చివరి పది నిమిషాలు ఆడియన్స్ కు తెలియని విషయాలు చెప్పాలనుకున్నాం. వాళ్ళు ఊహించని అంశాలు ఉండాలి. దాని కోసం చాలా ఆలోచించాం. సుమారుగా 18 నిమిషాల పాటు క్లైమాక్స్ సీన్ తీశాం. దాన్ని కుదించి 12 నిముషాలు ఉండేలా చేశాం. వాయిస్ ఓవర్ పెట్టి విజువల్ గా కూడా బాగా రావడానికి ప్రయత్నించాం. స్క్రీన్ ప్లే పెద్ద చాలెంజ్ అయింది. క్లైమాక్స్ లో నాని పెర్ఫార్మన్స్ కు క్లాప్స్ పడ్డాయి.
కొన్ని మార్పులు చేశాను..
డేవిడ్ నాథన్ అనే తమిళ రచయిత రాసిన కథ ఇది. ఆ కథను మన సంస్కృతికి తగ్గట్లుగా మార్పులు చేశాను. నేను ఇది వరకు కూడా 'మాయాబజార్' అనే సినిమాను వేరే వాళ్ళ కథతో తెరకెక్కించాను. వేరొకరు రాసిన కథను మనం డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కథను యడాప్ట్ చేసుకోవాలి. నేను సరిగ్గా డైరెక్ట్ చేయలేకపోతే రచయిత అసంతృప్తి చెందుతారు. ఈ సినిమా విషయంలో డేవిడ్ నాథన్ సంతోషంగానే ఉన్నారు. చెన్నైలో కూడా ఈ సినిమా బాగా రన్ అవుతోంది. నా సెన్సిబిలిటీస్ వొదులుకొని సినిమా చేయలేదు. నేను ఇప్పటివరకు ఏ జోనర్ ను రిపీట్ చేయలేదు. నా సినిమాలు సంసార పక్షంగా సెన్సార్ పక్షంగా ఉంటాయని నేనే సెటైర్ వేసుకుంటాను. కథ, కథాంశంను బట్టి అంశాలు ఉంటాయి.
ఇంటర్వ్యూ చూసి సెలెక్ట్ చేశా..
నివేత స్థానంలో మొదట నిత్యమీనన్, కీర్తి సురేష్ ఇలా రకరకాల పేర్లు అనుకున్నాం. కాని కో డైరెక్టర్ సురేష్ గారు మలయాళంలో నివేత నటించిన మరిరత్నం అనే సినిమా చూపించారు. పాపనాశం సినిమాలో కమల్ కూతురిగా నటించింది. తమిళంలో తను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చూసిన తరువాత తన కాన్ఫిడెన్స్ లెవెల్స్, మాట్లాడే విధానం నచ్చాయి. అందుకే తననే హీరోయిన్ గా ఫైనల్ చేశాం. ఈరోజు నివేత, నాని పెర్ఫార్మన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మణిశర్మ కసితో చేశారు..
ఈ సినిమాలో మ్యూజిక్ కు తీవ్రమైన పేరు వచ్చింది. ఎంతో కసితో ఆయన పని చేశారు. 60 నుండి 70 లైవ్ ట్రాక్స్ ఇచ్చారు. ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించారు. పట్టుదలతో, ఇష్టంతో చేశారు.
నాని లక్కీ చాంప్..
కమర్షియల్ గా ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధిస్తోంది. యుఎస్ లో కూడా వీకెండ్ కలెక్షన్స్ బావున్నాయి. 'అష్టాచమ్మా' నా కెరీర్ లో మొదటి హిట్. ఆ తరువాత మరోసారి నానితో చేసిన ఈ సినిమా నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నాని నా లక్కీ చాంప్.
ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేను..
నేను మొదట కథ, కథనం సిద్ధం చేసుకొని, అప్పుడు ఆర్టిస్టుల గురించి ఆలోచిస్తాను. ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి కారణం కూడా అదే. వారి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని నేను కథలు రాయలేను.
తదుపరి చిత్రాలు..
అంతర్జాతీయ చలన చిత్ర వేడుకల్లో ప్రదర్శించే సినిమా చేయాలనుంది. అలానే నాకు షేక్స్ పియర్ నవల్స్ అంటే చాలా ఇష్టం. అందులో రొమాన్స్, కామెడీ ఉండే కథను తీసుకొని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించాలనుకుంటున్నాను. కుటుంబరావు గారి రెండు నవలల రైట్స్ తీసుకున్నాను. మరియు బుచ్చి బాబు గారి 'చివరకు మిగిలేది' అనే మరో నవల హక్కులను పొందాను. వాటిని చిత్రాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నాను అంటూ.. ఇంటర్వ్యూ ముగించారు.