Advertisementt

సీనియర్ ఆర్టిస్టులకు మా అసోసియేషన్ సన్మానం!

Sun 12th Jun 2016 03:33 PM
dasari narayanarao,maa association,kaikala sathyanarayana,jamuna  సీనియర్ ఆర్టిస్టులకు మా అసోసియేషన్ సన్మానం!
సీనియర్ ఆర్టిస్టులకు మా అసోసియేషన్ సన్మానం!
Advertisement

పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగిన సీనియర్లను ఎంపిక చేసి దశల వారీగా సత్కరించేదుకు ఏర్పాట్లు చేసింది 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'. ఇందులో భాగంగా నాటి మేటి కథానాయిక జమునను, అలానే ఎన్‌టి‌ఆర్, ఏఎన్నార్ వంటి స్టార్లకు సమకాళికులు, నవరసాల్ని వెండితెరపై పోషించిన గొప్ప నటుడు కైకాల సత్యనారాయణను జూన్ 12 ఆదివారం నాడు హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో మా అసోసియేషన్ సంస్థ సత్కరించింది. ఈ సంధర్భంగా..

దాసరి నారాయణారావు మాట్లాడుతూ.. ''చెన్నైలో ప్రారంభమయిన ఈ మా అసోసియేషన్ హైదరాబాద్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గా రూపాంతరం చెందింది. ఈ సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలను చేపడుతోంది. ముఖ్యంగా ఈ ఎలెక్షన్స్ బాడీ బీద కళాకారులను ఆదుకోవడంలో ముందు ఉంటుంది. ఈ అసోసియేషన్ లో కోటీశ్వరులైన హీరోలు ఉన్నారు, అలానే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులు ఉన్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున 14 కోట్ల రూపాయలను ఏర్పాటు చేయగలిగాను. ఆ డబ్బుతోనే ఎందరో కళాకారులకు హెల్త్ ఇన్షూరెన్స్ పాలిసీలు చేయించాం. మురళీమోహన్ గారు మా అసోసియేషన్ సంస్థను నడుపుతున్నప్పుడు బడా హీరోలను కలిసి వారి ద్వారా 10 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి తద్వారా వచ్చే డబ్బుతో పేద కళాకారులకు సహాయం చేయమని చెప్పాను. కానీ ఎందుకో కుదరలేదు. ఇప్పుడు అదే ఐడియాను రాజేంధ్రప్రసాద్ కు చెబుతున్నాను. త్వరలోనే వారు ఈ కార్యక్రమాన్ని చేబడతారని నమ్ముతున్నాను. ఇది ఇలా ఉండగా.. మా అసోసియేషన్ తరఫున జమున, కైకాల లాంటి గొప్ప సీనియర్ నటులను సత్కరించుకోవడం మంచి విషయం. జమున ఆర్టిస్ట్ గా తన పని చూసుకొని వెళ్లిపోయేది. ఎవరి పనుల్లో జోక్యం చేసుకునేది కాదు. కొందరు బడా హీరోలు కావాలనే తనను బహిష్కరించిన సంగతి కూడా నాకు తెలుసు. అయినా..తాను మాత్రం దేనికి భయపడేది కాదు. గ్లామర్, నటన రెండు ఉన్న మనిషి. నేను డైరెక్ట్ చేసిన 150 సినిమాలలో 75 సినిమాల్లో కైకాల సత్యనారాయణ నటించి ఉంటాడు. గొప్ప నటుడు. ఇలాంటి వారికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వకుండా.. ఎవరెవరికో పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చి వాటి విలువను పోగొడుతున్నారు. కనీసం వారిని గుర్తించి మా అసోసియేషన్ వారు సన్మానించాలనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేబట్టాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. 

జమున మాట్లాడుతూ.. ''50 ఏళ్లుగా నా నట జీవితంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎందరో సన్మానించారు. కానీ మా అసోసియేషన్ వారు చేసిన ఈ సన్మానం మరపురాని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. నేను ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంటాను. రోజుకి రెండు గంటలు నడుస్తాను. గతంలో మా అసోసియేషన్ వారికి లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మాట నిలుపుకుంటాను. మాలానే ఎందరో సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వారిని కూడా ఇలానే గౌరవించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. ''అప్పట్లో సినిమా రిలీజ్ అవుతుందంటే ఇండస్ట్రీలో ఉండే వారందరికి మూడు, నాలుగు ప్రివ్యూ షోలు వేసేవారు. కానీ రాను రాను ఈ సంప్రదాయాలు అన్నీ కనుమరుగైపోతున్నాయి. సీనియర్ ఆర్టిస్టులను ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. ఇండస్ట్రీకు నేను ఎంతో సేవ చేశాను. మా అసోసియేషన్ సభ్యులు మమ్మల్ని గుర్తుపెట్టుకొని సన్మానించడం మంచి విషయం. ఈ సన్మానం నాకు ఎంతో తృప్తినిచ్చింది'' అని చెప్పారు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement