నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో బాలయ్య కూతురు బ్రాహ్మణి అభిమానుల మధ్య కేక్ ను కట్ చేసి క్యాన్సర్ బాధితులైన చిన్న పిల్లలకు తినిపించారు. అనంతరం వారికి పండ్లను పంచి పెట్టారు. ఈ సందర్భంగా..
క్యాసర్ హాస్పిటల్ సి.ఇ.ఓ ఆర్.పి.సింగ్ మాట్లాడుతూ.. ''ఇండియాలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పేరు పొందడం ఆనందంగా ఉంది. దీనికి కారణం చైర్మన్ బాలకృష్ణ గారే. ఈ సంవత్సరంతో ఆయనకు 56 సంవత్సరాలు పూర్తవుతాయి. అందుకే 56 కేజీల కేక్ ను ఆయన పుట్టినరోజు సందర్బంగా కట్ చేశాం'' అని చెప్పారు.
దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. ''బాలయ్య గారికి 56 సంవత్సరాలు అంటే పెద్ద ప్రశ్నలా ఉంది. సెట్ లో అందరి కంటే ఆయనే చిన్న పిల్లాడిలా ఉంటారు. గత ఇరవై రోజులుగా సినిమా షూటింగ్ లో మాకొక మార్గదర్శిగా, మంచి విద్యార్ధిగా ఉన్నారు. 99 సినిమాలు చేసి 100వ సినిమా అనే మైలు రాయిని అందుకోబోతున్నా.. ఇంకా చిన్న పిల్లల మనస్తత్వమే ఆయనది. విద్యార్థిలాగా అన్ని నేర్చుకుంటారు. దర్శకుడిగా నాకెంతో గౌరవాన్ని ఇస్తారు. నాకు ఆయన సినిమాల కంటే వ్యక్తిగతంగానే చాలా ఇష్టం. పుట్టినరోజు కూడా అమెరికాలోని ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం కోసం వెళ్ళారు. బాలయ్య మంచి మనిషి. గొప్ప తండ్రి. గొప్ప హీరో'' అని చెప్పారు.
బ్రాహ్మణి మాట్లాడుతూ.. ''నాన్నగారు 56 సంవత్సరాలు పూర్తి చేసుకొని 57 లో అడుగుపెడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయనకు వయస్సు పెరిగేకొద్దీ.. ఎనర్జీ కూడా పెరిగిపోతుంది. తన మనవడితో చిన్నపిల్లాడిలా ఆడుకుంటారు. తాతగారు చెప్పిన మానవ సేవే.. మాధవ సేవ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మించి ఎందరికో సేవలను అందిస్తున్నారు. ఇండియాలోనే బెస్ట్ హాస్పిటల్ గా పేరు పొందడానికి ఆయన సహకారం ఎంతో ఉంది'' అని చెప్పారు.