మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందించిన చిత్రం 'అ ఆ' అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అన్నది ఉప శీర్షిక. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. హీరో నితిన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
ప్రోపర్ లవ్ స్టొరీ..
'అ ఆ' ప్రోపర్ లవ్ స్టొరీ. ప్రేమకథకు ఫ్యామిలీను లింక్ చేసే విధానం బావుంటుంది. లవ్ స్టొరీ మాత్రమే కాకుండా.. హ్యూమన్ వాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. నేనొక చెఫ్ పాత్రలో కనిపిస్తాను. బాధ్యత గల కొడుకుగా, చెల్లెల్ని ప్రేమించే అన్నయ్యగా కొత్తగా కనిపిస్తాను. తనకొక సమస్య ఉంటుంది. అయినా.. కూడా నవ్వుతూ.. అందరిని నవ్విస్తూ.. ఉంటాడు.
కరెక్ట్ టైంలో మంచి సినిమా..
గుండెజారి గల్లంతయ్యిందే సినిమా తరువాత హార్ట్ ఎటాక్ సినిమా షూటింగ్ కోసం నేను స్పెయిన్ వెళ్లాను. ఆ సమయంలో ఈ సినిమాలో నటించమని ఫోన్ చేసి అడిగారు. చాలా సంతోషపడ్డాను. అంతా.. ఓకే అయిపోతుందనుకున్న సమయంలో సడెన్ గా ఆగిపోయింది. కొంచెం బాధపడ్డాను. కానీ సంవత్సరం తరువాత మళ్ళీ కాల్ చేసి అడిగారు. కరెక్ట్ టైం లో మంచి సినిమా పడింది.
ఆయనతో వర్క్ చేయాలనేది నా కల..
త్రివిక్రమ్ గారితో కలిసి వర్క్ చేయాలనేది నా కల. ఆయన దగ్గర నుండి ఫోన్ వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఒక కారణం ఆయనైతే మరొక కారణం కథ. నేను నటించిన 22 సినిమాలకు ఈ సినిమాకు ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. ప్రతి రోజు కథ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. ఇది దర్శకుడి సినిమా అని చెప్పొచ్చు. సినిమా మొదలయినప్పటినుండి కొత్తగా ఉండాలని త్రివిక్రమ్ గారు పరితపించేవారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుతుంది. సినిమాకు నిజమైన హీరో ఆయనే.
మొదట ఆయనకే ఫోన్ చేస్తా..
ఈ సినిమాతో త్రివిక్రమ్ గారికి నాకు మధ్య మంచి ర్యాపో కుదిరింది. పెర్సనల్ గా ఆయనొక జ్ఞాని. ఆయనకు తెలియని విషయమంటూ ఉండదు. నాకు ఎలాంటి సమస్య వచ్చినా.. మొదట ఆయనకే ఫోన్ చేస్తాను.
ఆ సమయంలోనే తెలిసింది..
2002 లో నా కెరీర్ మొదలుపెట్టాను. 14 సంవత్సరాల్లో 22 సినిమాలు తీశాను. కాని గత నాలుగు సంవత్సరాల నుండే నాకు హిట్స్ వచ్చాయి. 2011 వరకు సుమారుగా అన్నీ ఫ్లాప్సే. ఆ సమయంలో నేను చాలా నేర్చుకున్నాను. మాస్ సినిమాలు నాకు సెట్ కావట్లేదని, నా బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా లవ్ స్టోరీస్ సెలక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడే 'ఇష్క్','గుండెజారి గల్లంతయ్యిందే' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. కాని ఏరోజు నేను క్రుంగిపోలేదు. పెర్సనల్ గా నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను. ఫ్లాప్స్ వస్తున్నాయని నా డాన్స్ ప్రాక్టీస్ కాని మరొకటి కాని ఏది మానలేదు. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాను.
పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలియదు..
ఈ సినిమా సెట్స్ కు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నిజానికి ఆయన వస్తున్నారని ఎవరికీ తెలియదు. అప్పుడే సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఆయన ముందు నటించడానికి చాలా టెన్షన్ పడ్డాను కానీ బాగానే చేసానని అనుకుంటున్నాను.
నాలుగైదు రోజులు నిద్రపోలేదు..
అఖిల్ సినిమా పరాజయం నన్ను చాలా బాధ పెట్టింది. ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి వర్క్ చేశారు కానీ మేము అనుకున్న రిజల్ట్ మాత్రం రాలేదు. దాంతో ఓ నాలుగైదు రోజులు నాకు నిద్ర కూడా పట్టలేదు.
సీక్వెల్ అనుకుంటున్నాం..
మా ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మిస్తూనే ఉంటాం. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ హాఫ్ స్టొరీ కూడా రెడీ అయింది. సెకండ్ హాఫ్ కూడా బాగా వస్తేనే చేస్తాను. లేదంటే చేయను.
రాజమౌళి తరువాత త్రివిక్రమ్ గారే..
నేను చాలా మంది దర్శకులతో పని చేశాను. ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. త్రివిక్రమ్ గారు నన్ను చదివేశారు. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకునేవారు. రాజమౌళి గారి తరువాత నా మీద అంత కేర్ తీసుకొని సినిమా చేసింది త్రివిక్రమ్ గారే.
పెళ్లి వీలైనంత వాయిదా వేస్తా..
ఇంట్లో పెళ్లి చేసుకోమని రెండు సంవత్సరాలుగా అడుగుతున్నారు. నేనేమో నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా.. అని దాటేస్తూ వస్తున్నాను. వీలైనంత వరకు పెళ్లి వాయిదా వేస్తూనే ఉంటాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ఇప్పటివరకు ఏది ఫైనల్ చేయలేదు. మరొక వారం రోజుల్లో కొత్త ప్రాజెక్ట్ ఫైనల్ చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.