Advertisementt

మహేష్ నా బలం: శ్రీకాంత్ అడ్డాల

Wed 18th May 2016 07:20 PM
srikanth addala,brahmothswam movie,mahesh babu  మహేష్ నా బలం: శ్రీకాంత్ అడ్డాల
మహేష్ నా బలం: శ్రీకాంత్ అడ్డాల
Advertisement
Ads by CJ

'కొత్త బంగారులోకం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ తరువాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు','ముకుంద' చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా మే 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో సినీజోష్ ఇంటర్వ్యూ..

రెండో అవకాశం ఇవ్వడం గొప్ప విషయం..

మహేష్ బాబు గారితో ఇది రెండోసారి వర్క్ చేయడం. ఆయనెప్పుడు టాప్ లోనే ఉంటారు. ఒక సెన్సిటివ్ స్టొరీను అర్ధం చేసుకొని నాకు రెండో సారి అవకాశం ఇవ్వడమనేది గొప్ప విషయం. ఆయన నటుడికంటే ముందు మంచి మనసున్న మనిషి. ఆయన దర్శకుల హీరో. 

రెండు వేర్వేరు కథలు..

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బ్రహ్మోత్సవం' రెండు వేర్వేరు కథలు. ఆ సినిమా ఇద్దరి అన్నదమ్ముల కథ. మధ్యతరగతి కుటుంబం వారి మధ్య నడిచే కథ. బ్రహ్మోత్సవం కథ కంప్లీట్ డిఫరెంట్. ఒక సంపన్న కుటుంబానికి చెందిన కథ. విజయవాడ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. నాలుగైదు కుటుంబాలు కలిసుండే వాతావరణం. 

మనుషులంటే ఇష్టం..

సమకాలీన ప్రపంచంలో మనం అనుకున్నది జరుగుతుందా..? లేదా..? ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ లో మనుషుల మధ్య ప్రశాంతత లేకుండా పోతుంది. ఆ ప్రశాంతత ఎక్కడో బయటకు టూర్లకు వెళ్తేనో.. ఇంకేమైనా చేస్తేనో.. రాదు. మనుషుల మధ్యనే ఆ ప్రశాంతత దొరుకుతుంది. అదే పాయింట్ ను కుటుంబ పరంగా చెప్పాలని ఈ సినిమా చేశాను. నాకు మనుషులంటే ఇష్టం. ఈ పాయింట్ ను మహేష్ కు చెప్పగానే సినిమా చేద్దామన్నాడు. 

మహేష్ నా బలం..

ఏ సినిమా చేసినప్పుడైనా.. ప్రెషర్ అనేది కామన్. ఈ సినిమాకు ఎక్కువ మంది ఆర్టిస్ట్స్ తో కలిసి పని చేయడం. అందరికి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే మహేష్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడే నేనేదైనా ఎదుర్కోగలననే నమ్మకం కలిగింది. ఆయనే నా బలం. సినిమా చేస్తున్నప్పుడు ఎగుడుదిగుడులు అన్ని వస్తుంటాయి. అవన్నీ పట్టించుకుంటే సినిమా చేయలేం.

ఓంకారం చేసింది ఆయనే..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆ సమయంలో నా స్థాయి కంటే ఎక్కువగా డీల్ చేయాల్సిన కథ. అప్పుడు గణేష్ పాత్రో గారు నాకు సహాయం చేస్తారని ఆయన దగ్గరకు వెళ్లాను. ఆయన అనుభవం సినిమాకు ఎంతో ఉపయోగపడింది. ముకుంద సమయంలోనే బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నానని ఆయనకు చెప్పాను. కథ విని రెండు, మూడు పేజీలు  స్క్రీన్ ప్లే రాసిచ్చారు. ఆయనిప్పుడు లేకపోవడం బాధాకరం. బ్రహ్మోత్సవం సినిమాకు ఓంకారం చేసింది ఆయనే..

ఉత్సవానికి పీక్ ఉంటే అదే బ్రహ్మోత్సవం..

నలుగురు ఉన్న సమ్మేళనమే ఉత్సవం. ఉత్సవానికి పీక్ ఏమైనా ఉంటే అదే బ్రహ్మోత్సవం. లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని కూడిన కథ అంటే బ్రహ్మోత్సవమే.. నేనొకసారి భక్తి చానెల్ చూస్తున్నప్పుడు బ్రహ్మోత్సవం అనే పేరు కనిపించింది. టైటిల్ బావుందే అని వెంటనే పెట్టేశాను. 

కథ రాస్తున్నప్పుడు పేర్లు రాయను..

నేను కథలు రాసుకున్నప్పుడు ఎందుకో పాత్రల పేర్లు రాసుకోను. హీరోలు కూడా కథ మొత్తం విని పేరేంటి అని అడుగుతుంటారు. 

పెద్ద టెక్నీషియన్స్ అయితే బావుంటుందని..

ఇలాంటి కథను ప్రెజంట్ చేయాలనుకున్నప్పుడు పెద్ద టెక్నీషియన్స్ అయితే బావుంటుందని రత్నవేలు గారిని సెలెక్ట్ చేసుకున్నాం. అలానే తోట తరణి గారి సెట్స్ అధ్బుతంగా ఉంటాయి. ప్రతి సెట్ చాలా బాగా వేశారు. 

ఒకే రకం చేయలేం..

అన్ని ఒకేరకమైన చిత్రాలు చేయాలంటే ప్రేక్షకులకు చూడడానికి బోర్ కొడుతుంది. సమయం బట్టి జోనర్స్ ను మారుస్తూ ఉండాలి. చాలా కథలు రాసుకున్నాను. అయితే నెక్స్ట్ ఎలాంటి జోనర్ చేస్తానో.. ఇంకా చెప్పలేను. ఈ సినిమా తరువాత ఆలోచిస్తాను. 

తండ్రి మీద గౌరవాన్ని అలా చూపించాం..

తండ్రి పట్ల గౌరవాన్ని, వినయాన్ని ఎలా డిఫైన్ చేయాలని ఆలోచించి.. ఫంక్షన్ కోసం హడావిడిగా వెళ్ళిపోతున్న తండ్రికి కొడుకు చెప్పులు తొడుగుతాడు. అదే పోస్టర్ గా రిలీజ్ చేశాం. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అదొక మెయిన్ రోల్..

ఈ సినిమాలో 7 తరాల కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. కథను ముందుకు తీసుకు వెళ్ళడంలో అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది.

ఆ స్థాయిలో ఉండాలనే చేశా..

ఏ సినిమా అయినా.. హిట్ అవ్వాలనే చేస్తారు. శ్రీమంతుడు వంటి బిగ్ హిట్ తరువాత వచ్చే సినిమా అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సినిమాతో పోల్చుకోకూడదు కానీ మహేష్ కెరీర్ లో చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా స్థాయిలో ఉండాలనే ప్రయత్నంతో చేశాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ