సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో శిరీష్ నిర్మించిన చిత్రం 'సుప్రీమ్'. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా.. చిత్ర సమర్పకుడు దిల్ రాజు విలేకర్లతో ముచ్చటించారు.
అనిల్ రావిపూడి కథ చెప్పినప్పుడు సుప్రీమ్ పెద్ద కమర్షియల్ ఎంటర్ టైనర్ అవుతుందని నమ్మి చేశాను. నా సినిమా రిలీజ్ అయితే నలుగురైదుగురు ఫోన్ చేసి సినిమా ఎలా ఉందో చెప్పేవారు. కాని ఈ సినిమా కోసం ఎవరు ఫోన్ చేయలేదు. అయితే నేను, అనిల్ కలిసి థియేటర్ లో సినిమా చూశాం. ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ తో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. మొదటివారంలో కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా స్టడీగా ఉన్నాయి.
ఆ ఆలోచన తనదే..
ఈ సినిమాలో దివ్యాంగులుతో ఒక ఫైట్ ఉంటుంది. అది అనిల్ ఆలోచనే.. కథ రాసుకున్నపుడే ఆ సీన్ రాసుకున్నాడు. క్లైమాక్స్ లో వచ్చే ఆ ఫైట్ సరిగ్గా చూపించలేకపోతే రిస్క్ లో పడేవాళ్ళం. కాని చక్కగా ఎగ్జిక్యూట్ చేసి ఈరోజు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు.
కొత్త బ్యానర్ పెడుతున్నాను..
ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం చిత్రాలు తర్వాత నేను కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టాను. సుమారుగా అన్ని సినిమాలు సక్సెస్ ను సాధించాయి. అయితే నా మార్కు సినిమాలు రావడం లేదని చాలా మంది అంటున్నారు. నా తరహా ప్యామిలీ, యూత్ ఫుల్ సినిమాల కోసం నేను నిర్మాతగా వ్యవహరిస్తాను. అలానే కొత్త బ్యా నర్ ను స్థాపించి శిరీష్, హర్షిత్ లను నిర్మాతలుగా పెట్టి సినిమాలు చేస్తాను. ప్రస్తుతం ఈ కొత్త బ్యానర్ లో మారుతి తో కలిసి ఓ సినిమాను, బెక్కం వేణుగోపాల్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నాను.
ఆ సినిమా ఒక పాఠం..
నా బ్యానర్ లో సినిమా వచ్చి ఫ్లాప్ అయిందంటే ఎవరిని బ్లేం చేయను. ఎందుకంటే కథను నేను ఓకే చేసిన తర్వాత సెట్స్ లోకి వెళుతుంది. అందుకే సక్సెస్, ఫెయిల్యూర్స్ ను ఒకేలా తీసుకుంటాను. కృష్ణాష్టమి విషయానికి వస్తే సునీల్ ను కొత్తగా చూపించాలని ప్రయత్నించాం. అయితే మా ప్రయత్నం సక్సెస్ కాలేదు. కృష్ణాష్టమి సినిమా నాకొక పాఠంగా భావిస్తాను.
పూరికి ఇచ్చేశాను..
నా బ్యానర్ లో జనగణమన అనే టైటిల్ రిజిష్టర్ చేశాను. అయితే సినిమా చేయడానికి సమయం దొరకలేదు. ఈలోగా పూరి జగన్నాథ్ గారు నాకు ఫోన్ చేసి నాకు ఆ టైటిల్ కావాలని అడిగారు. ఎలాగో నేను సినిమా చేయట్లేదని ఆయనకు ఇచ్చేశాను.
వాళ్ళతో సినిమాలు చేస్తానో.. లేదో..
పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనుకున్నాను. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోతే సినిమాలు చేయను అంటున్నారు. ఆయనతో సినిమా చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తాను. అలానే చిరంజీవి గారితో సినిమా ఉంటుందో లేదో చెప్పలేను. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేము.
ఎలాంటి గొడవలు లేవు..
సతీష్ వెగ్నేశ దర్శకత్వంలో శతమానం భవతి సినిమా చేయాలని భావిస్తున్నాను. అయితే మొదట ఆ సినిమా కథను సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్ లు విని సినిమా చేస్తామన్నారు. అయితే రాజ్ తరుణ్ తో ఏదో గొడవలు వచ్చాయని, అందుకే తనతో సినిమా చేయడం లేదని, మరో హీరోతో ఆ సినిమా చేస్తున్నాననే వార్తలు వచ్చాయి. కానీ నిజానికి శతమానం భవతి సినిమాను ఆగస్టులో మొదలుపెట్టి 2017 జనవరి 14న రిలీజ్ చేయాలని భావిస్తున్నాను. ఆ సమయానికి ఎవరి డేట్స్ కుదిరితే వారితో చేస్తాను.