హీరో సూర్య త్రిపాత్రాభినయం చేసిన చిత్రం '24'. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్, 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వస్తోంది. ఈ సందర్భంగా.. చిత్రదర్శకుడు విక్రం కె కుమార్ విలేకర్లతో ముచ్చటించారు.
మంచి రెస్పాన్స్ వస్తోంది..
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇండస్ట్రీ నుండి కూడా మంచి స్పందన వస్తోంది. ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ను, అందరికీ అర్ధమయ్యేలా సింపుల్ గా ఎలా చెప్పారని అడుగుతున్నారు. ఇలాంటి కాంప్లిమెంట్స్ వింటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సినిమా రిజల్ట్ తో సూర్య గారు చాలా సంతోషంగా ఉన్నారు. హీరోగా ఆయన్ను ఇప్పటివరకు రకరకాల పాత్రలలో చూసి ఉంటారు. కాని నిర్మాతగా కూడా ఆయన ఎంతో ఫ్యాషనేటెడ్ పర్సనో.. ఈ సినిమాతో తెలిసింది. ఇదే బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయలానుంది.
నిడివి కంటే కథే ముఖ్యం..
ఒక్కో కథకు ఒక్కో నిడివి ఉంటుంది. ప్రతి కథను రెండు గంటల్లోనే చెప్పాలంటే చాలా కష్టం. అలా చెప్పాలని ప్రేక్షకులు కూడా చెప్పలేదు. మంచి కథకు నిడివితో పని లేదు. ఎంత వ్యవధిలో కథ చెప్పమనేది ముఖ్యం కాదు.. ఎంత మంచి కథను చెప్పమనేదే ముఖ్యం.
ఆ సీన్ కోసం బాగా ఆలోచించాను..
సినిమాలో హీరోకు వాచ్ దొరికినప్పుడు దాంతో ఏం చేయోచ్చనే విషయాన్ని అందరికీ అర్ధమయ్యే విధంగా సింపుల్ గా చెప్పాలి. ఆ సీన్ సరిగ్గా చేయలేకపోతే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆ వాచ్ ను ఎమోషనల్ సీన్స్ కు లవ్ సీన్స్ కు, ఎలా కనెక్ట్ చేయాలని చాలా ఆలోచించాను.
ఒకే రకంగా చేస్తే బోర్ కొడుతుంది..
అన్ని సినిమాలు ఒకే మాదిరిగా చేస్తే బోర్ కొడుతుంది. అందుకే నేను చేసే ప్రతి సినిమా కొత్తగా, డిఫరెంట్ గా ఉండాలని భావిస్తాను. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తేనే.. కొత్త ఆలోచనలు వస్తాయి. టైం గురించి చాలా మంది చాలా రకాలుగా రాశారు కానీ నేను సినిమాలో నా స్టైల్ లో చెప్పాను.
సీక్వెల్ కాదు ప్రీక్వెల్ చేస్తున్నా..
ఈ సినిమాకు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. సినిమాలో ఆత్రేయ వాచ్ పొందదాలనుకోవడానికి గల కారణాలేంటనే పాయింట్ లో కథ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన కథకు ముందు ఏం జరిగిందనే దాన్ని సినిమాగా ప్రీక్వెల్ లో చూపిస్తాను.
వాళ్ళిద్దరూ నా లక్కీ గర్ల్స్..
సమంత, నిత్యమీనన్ మీ లక్కీ గర్ల్స్ అంటే అవుననే అంటాను. వాళ్ళిద్దరూ మంచి నటీమణులు. వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి ఇష్టపడతాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
అల్లు అర్జున్, మహేష్ బాబులకు లైన్స్ చెప్పాను. వాళ్ళిద్దరికీ నేను చెప్పిన లైన్స్ నచ్చడంతో సినిమా చేద్దామన్నారు. అయితే మొదట అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాను. ఆ తరువాత మహేష్ బాబు సినిమా చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.