సినిమా మొత్తం కలర్ ఫుల్ గా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ.. హీరోయిన్ హర్షికా పునాచా తన నటించిన 'అప్పుడలా ఇప్పుడిలా' సినిమా గురించి మాట్లాడారు. సూర్యతేజ, హర్షికా పునాచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో, జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'అప్పుడలా ఇప్పుడిలా'. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాత. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ హర్షికా పునాచా మాట్లాడుతూ.. ''సుమారుగా కన్నడలో 10 నుండి 12 చిత్రాల్లో నటించాను. ఇది నా తెలుగు డెబ్యూ ఫిలిం. ఏప్రిల్ 1న సినిమా రిలీజ్ అవుతోంది. చాలా టెన్షన్ గా, ఎగ్జైటెడ్ గా ఉంది. 2016లో నేను కన్నడలో నేను నటించిన 'రే' సినిమా మొదటగా రిలీజ్ అయింది. 25 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అలానే తెలుగులో కూడా ఈ సంవత్సరంలో వస్తోన్న ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కథ నచ్చి సినిమా ఒప్పుకున్నాను. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తనకు సమాజ సేవ అంటే ఆసక్తి. కుటుంబంతో చూడదగ్గ సినిమా. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో హీరో, హీరోయిన్లకు సమాన ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పటికే కన్నడలో నంది అవార్డు, సైమా, ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్నాను. తెలుగులో కూడా ఈ సినిమాతో మంచి పేరొస్తుందని ఆశిస్తున్నాను'' అని తెలిపారు.