నాగార్జున, కార్తీ హీరోలుగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఊపిరి'. ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తోంది. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి విలేకర్లతో ముచ్చటించారు.
ఏడిపిస్తూ.. నవ్వించే సినిమా..
నాకు ఏడిపించే సినిమాలంటే పడదు. సో ఎప్పుడు ఆ తరహా ఎమోషనల్ మూవీస్ తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ 'ఇన్ టచబుల్స్' చూశాక ఈ సినిమాని తప్పకుండా తెలుగులో తీయాలని నిశ్చయించుకొన్నాను. ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీ. ఏడిపిస్తూనే నవ్విస్తుంది.
ఇద్దరి జీవితాల కలయికే ఊపిరి..
ప్రతి మనిషిలోనూ పలు భావోద్వేగాలుంటాయి. సందర్భానుసారంగా ఒక్కోటి బయటపడుతుంటాయి. అలా పలు భావోద్వేగాల కలయికే 'ఊపిరి'. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. ఈ పాత్రధారి లాంటి వ్యక్తిని ఎప్పుడో చూసానే అని అనుకొనే విధంగా 'ఊపిరి'లోని నటీనటుల వ్యవహారశైలి ఉంటుంది. సినిమాలో ఎటువంటి మలుపులూ ఉండవు. ఇది చాలా సింపుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో ఎటువంటి మలుపులు, ట్విస్టులు ఉండవు. సజావుగా సాగే ఇద్దరి జీవితాల కలయికే 'ఊపిరి'.
చాలా మార్పులు చేశాం..
ఒరిజినల్ వెర్షన్ 'ఇన్ టచబుల్స్' ఒక అద్భుతం. ఇప్పటివరకూ ప్రపంచంలో రూపొందిన గొప్ప సినిమాలో మొదటి వరుసలో నిలిచే స్థాయి ఉన్న సినిమా అది. ఎంత గొప్ప సినిమా అయినప్పటికీ.. మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేయకపోతే మనవాళ్లు అంగీకరించరు. అందుకే.. తెలుగు, తమిళ నేటివిటీలకు తగ్గట్లుగా కథలో చాలా మార్పులు చేశాం. ఒరిజినల్ వెర్షన్ కంటే ఎక్కువగా తెలుగు సినిమాను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.
సీన్స్ మార్చొద్దని చెప్పారు..
తొలుత నాగార్జున గారి కోసం సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేశాను. అయితే.. అప్పటికే సినిమా చూసిన నాగార్జున గారు ఎటువంటి మార్పులు చేయకు వంశీ అన్నారు. మళ్ళీ రెండు నెలలు కూర్చొని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాను. అప్పుడు ఒకే చేశారు.
ఎన్టీఆర్ రిఫర్ చేశాడు..
ఈ కథను తొలుత ఎన్టీయార్ కు చెప్పాను. అయితే.. డేట్స్ కారణంగా చేయలేనని చెప్పడంతోపాటు నాగార్జునగారికి ఫోన్ చేసి వంశీని పంపుతున్నాను బాబాయ్.. కథ విని తిట్టొద్దు అని చెప్పి మరీ పంపించాడు. సో, నా జీవిత్రంలో ఎన్టీయార్ ఎప్పటికీ ఓ ఉత్తమ స్నేహితుడిగానే ఉంటాడు.
శృతి ఇబ్బంది పెట్టింది..
తమన్నా పాత్రలో తొలుత శృతి హాసన్ ను ఎంపిక చేశాం. మొదట చేస్తానని చెప్పిన ఆమె, మరో రెండు రోజుల్లో షూటింగ్ అనగా సారీ నేను చేయలేను.. డేట్స్ కుదరడం లేదు అని చాలా సింపుల్ గా చెప్పేసి ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. సినిమా నుంచి తప్పుకొంది అనే బాధకంటే మరీ రెండు రోజుల ముందు 'నో' చెప్పడం బాధ అనిపించింది. మా అదృష్టం బాగుండి.. తమన్నా వెంటనే ఒకే చెప్పడంతో షూటింగ్ హ్యాపీగా జరిగిపోయింది.
ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేను..
సినిమా లొకేషన్స్ కోసం స్కౌటింగ్ కి వెళ్ళినప్పుడు.. ఒక రెస్టారెంట్ ను చూశాం. ఆ ప్లేస్ బాగుందని తొలుత ఓనర్ అయిన ఒక ముసలావిడని అడిగినప్పుడు మా యూనిట్ మెంబర్ ను తిట్టి పంపేసింది. ఆ తర్వాత 'ది ఇన్ టచబుల్స్' రీమేక్ అని తెలియడంతో ఎక్కడ కావాలంటే అక్కడ షూట్ చేసుకోండి. 'ది ఇన్ టచబుల్స్' చూసిన తర్వాతే చనిపోవాలనుకొన్న నా కొడుకు తిరిగి మామూలు మనిషయ్యాడు" అని చెప్పింది. ఆవిడ చెప్పిన మాట నన్ను ఎంతగానో కదిలించింది. అలాగే.. ప్యారిస్ లోనూ 'ది ఇన్ టచబుల్స్' కు ఇండియన్ వెర్షన్ షూటింగ్ అని తెలుసుకొన్న వాళ్ళందరూ ఎంతగానో హెల్ప్ చేశారు.
ఛాన్స్ వస్తే హిందీలో కూడా చేస్తా..
'ఊపిరి' సినిమా హిందీ వెర్షన్ రీమేక్ రైట్స్ ను కరణ్ జోహార్ గారు దక్కించుకొన్నారు. ఒకవేళ ఆయన అవకాశమివ్వాలే కానీ హిందీ వెర్షన్ కు తప్పకుండా దర్శకత్వం వహిస్తా.
అతను ఉండడం వలనే..
తొలుత "ఊపిరి"ని తమిళంలో తీయాలన్న ఆలోచన లేదు. అయితే తర్వాత "కార్తీ"ని సెలక్ట్ చేసుకోవడం.. తమిళ మేకింగ్ అప్పుడు కార్తీ ఎంతగానో సహకరించి ప్రతి విషయంలోనూ కేర్ తీసుకొని.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లా పనిచేయడం వలనే తమిళ వెర్షన్ ను తీయగలిగాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
అక్కినేని అఖిల్ తో నా తదుపరి చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయాలు త్వరలోనే చెబుతా అంటూ ఇంటర్వ్యూ ముగించారు.