Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-కుమార్ నాగేంద్ర(తుంటరి)

Tue 08th Mar 2016 10:51 AM
kumar nagendra interview,thuntari movie,nara rohit  సినీజోష్ ఇంటర్వ్యూ-కుమార్ నాగేంద్ర(తుంటరి)
సినీజోష్ ఇంటర్వ్యూ-కుమార్ నాగేంద్ర(తుంటరి)
Advertisement
Ads by CJ

నారా రోహిత్, లతా హేగ్దే జంటగా శ్రీ కీర్తి ఫిల్మ్స్ బ్యానర్ పై కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్, నాగార్జున్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'తుంటరి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 11న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు కుమార్ నాగేంద్రతో సినీజోష్ ఇంటర్వ్యూ..

కృష్ణవంశీ గారి ప్రియశిష్యుడ్ని..

ఖడ్గం నుండి రాఖీ సినిమా వరకు కృష్ణవంశీ గారి దగ్గర పదిహేను సంవత్సరాలుగా పని చేశాను. నేనాయన ప్రియశిష్యుడ్ని. దర్శకునిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే సమయంలో లక్ష్మి మంచు గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆమెను కలిసి 'గుండెల్లో గోదారి' కథ చెప్పాను. కథ నచ్చడంతో ప్రాజెక్ట్ మొదలుపెట్టాను. ఆ తరువాత 'జోరు' సినిమా చేశాను. 'తుంటరి' నా మూడవ సినిమా. నేను చేసిన రెండు సినిమాలకంటే ఈ సినిమా ఇంకా బావుంటుందనే నమ్మకం నాకుంది. 

'తుంటరి' ఫాంటసీ కథ..

కొందరి స్నేహితులకు భవిష్యత్తులో రాబోయే ఓ న్యూస్ పేపర్ దొరుకుతుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు మొదలుపెడతారు. జరగబోయేది ముందే తెలిసిపోతే ఎలా ఉంటుందనేదే ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం. 'తుంటరి' ఫాంటసీ నుండి మొదలవుతుంది. 

చాలా మార్పులు చేశా..

తమిళంలో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. దాంతో తెలుగులో రీమేక్ చేస్తే బావుంటుందని చిత్ర నిర్మాతలను కలిసి సినిమా రైట్స్ తీసుకున్నాను. ఒరిజినల్ గా ఈ సినిమా నిడివి రెండుగంటల ముప్పై నిమిషాలు. కాని తెలుగులో మాత్రం ఈ సినిమాను రెండు గంటలు మాత్రమే ఉండేలా క్రిస్ప్ చేశాను. లవ్ ట్రాక్ కంప్లీట్ గా మార్చేశాను. ఎమోషనల్ గా కూడా చాలా మార్పులు చేశాను. తమిళంలో కేవలం క్లైమాక్స్ 25 నిమిషాల పాటు ఉంటుంది. మరీ అలా అయితే తెలుగులో చూడరేమో నిదిద్వి తగ్గించాను.

రోహిత్ గారినే అనుకున్నాను..

ఈ సినిమాను చేయాలనుకున్నప్పుడు మొదట నారా రోహిత్ గారినే హీరోగా అనుకున్నాను. ఆయనకు కూడా సినిమా కథ నచ్చడంతో నా పని సులువు అయిపోయింది. నిజానికి ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో కనిపిస్తారు. నిజానికి ఆయన బాక్సర్ కాదు. కొందరు రోహిత్ బాక్సర్ అని అపార్ధం చేసుకొని ఆయన మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఎలిమెంట్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.

మురుగదాస్ గారి సలహానే అది..

ఈ సినిమాకు మురుగదాస్ గారు కథ అందించారు. రైట్స్ తీసుకోగానే ఆయనను వెళ్లి కలిశాను. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. లవ్ స్టోరీ ఇంకాస్త బలంగా ఉంటే బావుంటుందని ఆయన చెప్పడంతోనే నేను మార్చి చేశాను. 

నేరుగా చేసే సినిమాల్లోనే కిక్ ఉంటుంది..

రీమేక్ సినిమాలకంటే స్ట్రెయిట్ సినిమాలు చేయడంలోనే కిక్ ఉంటుంది. స్ట్రెయిట్ సినిమా అంటే నా ఊహ. నేను ఏం చేస్తున్నానో ఎవరికీ తెలియదు. అందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. అదే రీమేక్ సినిమా అంటే సెట్ లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి అంత కిక్ ఉండదు. నేను ఎంజాయ్ చేసేది స్ట్రెయిట్ సినిమాలు చేసినప్పుడే.. నిర్మాతలకు లాభాలు రావాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేశాను.

'జోరు' తో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారు..

జోరు సినిమా మిస్ ఫైర్ అవ్వడానికి కారణం బడ్జెట్. గుండెల్లో గోదారి సినిమాలో అందరూ కొత్త వాళ్ళు. రెండు మూడు సినిమాలు చేసిన వాళ్ళతోనే వర్క్ చేశాను. కాని జోరు సినిమా కోసం సుమారుగా 25 మంది స్టార్ కాస్ట్ ను పెట్టుకొని పని చేశాను. నాకున్న బడ్జెట్ లో ఏరోజు షూటింగ్ ఆరోజు చేసేయాలి. ఆర్టిస్ట్ కు వన్ మోర్ చెప్పే ఛాన్స్ లేదు. సో.. వాళ్ళు ఇచ్చిన పెర్ఫార్మన్స్ తీసుకున్నాను. నేను అనుకున్నది చేయలేకపోయాను. అంతేకాదు అదొక కన్ఫ్యూషన్ కామెడీ సినిమా. నాకు అర్ధమయిన విధంగానే ప్రేక్షకులను అర్ధమవుతుందనుకున్నాను. కాని కన్ఫ్యూజ్ చేసేసాను.

రోహిత్ గారి నటన హైలైట్..

ఈ సినిమాలో మెయిన్ హైలైట్ రోహిత్ గారి పెర్ఫార్మన్స్. ఇప్పటివరకు ఆయన సీరియస్ గా ఇంటెన్స్ ఉన్న పాత్రల్లోనే నటించారు. మొదటిసారి చాలా ఈజ్ ఉన్న పాత్రలో నటించారు. 'సోలో' కంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. సినిమాలో ప్రతి సీన్ ఆయనే లాగేసుకుంటారు. అలానే సినిమాలో 5 పాటలు విజువల్ గా చాలా గ్రాండియర్ గా ఉంటాయి. చివరి నలభై నిమిషాల ఎమోషనల్ కంటెంట్ హైలైట్ గా నిలుస్తుంది.

అలాంటి సినిమాలు చేయాలనేదే నా ఆశ..

ప్రేక్షకులు మనకు డబ్బులిచ్చి విలువైన వారి సమయాన్ని కూడా ఇస్తున్నారు. అలాంటప్పుడు గొప్ప గొప్ప సినిమాలు చేయాలి. కాని దానికి మంచి హీరో, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్  కావాలి. మొదట్లోనే అలాంటి అవకాశాలు రావు కదా..! అందుకే వచ్చిన అవకాశాల్లో సినిమాలు చేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళే సినిమాలు చేస్తాను. నేను చేసిన మూడు సినిమాలు నా స్థాయి సినిమాలు కావు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు. ఈ సినిమా రిజల్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ