Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-నందిని రెడ్డి

Sat 27th Feb 2016 06:32 PM
nandini reddy interview,kalyana vaibhogame,naga shourya,damodar prasad  సినీజోష్ ఇంటర్వ్యూ-నందిని రెడ్డి
సినీజోష్ ఇంటర్వ్యూ-నందిని రెడ్డి
Advertisement
Ads by CJ

'అలా మొదలైంది' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దర్శకురాలు నందిని రెడ్డి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న నందిని 'జబర్దస్త్' అనే మరో సినిమాను కూడా డైరెక్ట్ చేసింది. కాని ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దాంతో దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 'కళ్యాణ వైభోగమే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నందిని రెడ్డితో సినీజోష్ ఇంటర్వ్యూ..

ఎంజాయ్ చేస్తూ.. తీశాను..

నా మొదటి సినిమా 'అలా మొదలైంది' నాకు నచ్చినట్లు తీశాను. మొదటి సినిమా ఎలా చేస్తానో అని భయపడుతూ చేశాను. అది ఫ్లాప్ అయితే ఇక సినిమాలు తీయకూడదనుకున్నాను. ఆ సినిమా విజయంతో మరో సినిమా మొదలుపెట్టాను. నిజానికి 'కళ్యాణ వైభోగమే' నా రెండో సినిమాగా చేయాల్సింది. కాని నా సక్సెస్ ను కాపాడుకోవడం కోసమే 'జబర్దస్త్' సినిమా చేశాను. అది కాస్త రివర్స్ అయింది. ఇక భయం లేకుండా సినిమా చేయాలని 'కళ్యాణ్ వైభోగమే' ఎంజాయ్ చేస్తూ చేశాను. 

ప్రెజంట్ పెళ్ళంటే భయపడుతున్నారు..

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ పెళ్లి అంటే వద్దు అనుకుంటున్నారు. కాని మన అమ్మ నాన్నలకు అది ఏడడుగుల బంధం అలాంటి పెళ్లిని ప్రస్తుతం ఉన్న యువత సింపుల్ గా తీసుకుంటున్నారు. నచ్చకపోతే రిలేషన్ బ్రేక్ చేసుకుంటున్నారు. పెళ్ళికి ముందు ఎలా ఉంటున్నారు.. పెళ్ళైన తరువాత ఎలా ఉంటున్నారనే అంశాలతో ఈ సినిమా తీశాను. ఇదొక హ్యూమన్ స్టోరీ. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. కమర్షియల్ గా కూడా ఉంటుంది. 

రిజల్ట్ గురించి ఆలోచించను..

కృష్ణవంశీ గారు 'నిన్నే పెళ్ళాడత' సినిమా చేసేప్పుడు అందరూ ఫ్యామిలీ లాగా కలిసి చేశారు. సినిమాలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిజమైన కుటుంబంలా ఉండేవారు. ఇలా నేను కూడా ఒక సినిమా చేయాలి అనుకునేదాన్ని. ఈరోజు నిజంగానే నాకు అలాంటి సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. సరదాగా పిక్ నిక్ లాగా షూటింగ్ జరిగింది. సినిమా రిజల్ట్ గురించి ఇక నాకు సంబంధం లేదు. ఈ సినిమా నాకు చాలా తృప్తినిచ్చింది. ఇక ఎలాంటి రిజల్ట్ వచ్చినా పర్వాలేదు. ఒక ఫిలిం మేకర్ గా ఈ సినిమాతో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగింది.

స్వప్న ప్రొడ్యూస్ చేయాల్సింది..

మొదట ఈ సినిమా స్వప్న దత్ ప్రొడ్యూస్ చేయాల్సింది. నాగ శౌర్యకు స్టోరీ కూడా వైజయంతీ మూవీస్ ఆఫీస్ లోనే చెప్పాను. కాని స్వప్నకు ఎక్కడో చిన్న అనుమానం.. నాగశౌర్య తో ఇంత బడ్జెట్ లో సినిమా చెయొచ్చా అని.. అదే సమయంలో దామోదర్ ప్రసాద్ గారు నన్ను పిలిపించి కథ విన్నారు. నేను చాలా మందికి కథలు చెప్తాను. అవి వాళ్ళకు అర్ధం కావో.. లేక మరో కారణమో కాని ఎవరికీ నచ్చవు. దాము గారికి మాత్రం నా కథలు బాగా అర్ధమవుతాయనుకుంటా.. నేను సినిమా ఎలా చేయగలనో.. ఆయన ఊహించగలరు. కథల విషయంలో మా ఇద్దరి ఛాయిస్ ఒక్కటే. 

టైటిల్ సడెన్ గా తట్టింది..

ఈ సినిమా కథ రెడీ చేసుకొని షూటింగ్ మొదలు పెట్టే సమయంలో సడెన్ గా 'కళ్యాణ వైభోగమే' అనే టైటిల్ తట్టింది. కళ్యాణంలో వైభోగం ఉంటుంది కదా అందుకే వెంటనే టైటిల్ రిజిస్టర్ చేయించాం. కథకు కనెక్ట్ అయ్యే టైటిల్.

ఆ పాట సినిమాకు హార్ట్..

కళ్యాన్ కోడూరి నేను మంచి ఫ్రెండ్స్. మా మధ్య ఎలాంటి మొహమాటాలు ఉండవు. కళ్యాన్ కు సినిమా మొదలు పెట్టక ముందే చెప్పాను. సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయి. ఒక్కో సిట్యుయేషన్ లో ఒక్కో పాట దేనికదే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాను. అలానే కష్టపడ్డాడు. పెళ్లి పాట అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. పెళ్లి నిర్వచనాన్ని చెప్పే విధంగా ఆ పాట ఉంటుంది. పెళ్లి పాట సినిమాకు చాలా ముఖ్యమైన ఎలిమెంట్. ఆ పాట సినిమాకు హార్ట్. సాంగ్స్ అన్ని సినిమాకు ప్రాణం పోశాయి. 

చాలా మంది రిజక్ట్ చేశారు..

మొదట ఈ సినిమా కథ ముగ్గురు, నలుగురు హీరోలకు చెప్పాను. వాళ్ళంతా రిజక్ట్ చేశారు. అలా రిజక్ట్ చేస్తే నేను కథ పక్కన పెట్టేస్తాను. కాని ఈ సినిమా కథను మాత్రం వదలలేదు. నేను బాగా నమ్మిన కథ ఇది. స్టార్స్ కోసం తిరిగి తప్పు చేస్తున్నావని నా స్నేహితుడు ఒకరు చెప్పడంతో సింపుల్ గా ఉండే ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని పెట్టి సినిమా చేయాలనుకున్నాను. నాగ శౌర్య, మాళవిక నాయిర్ లను ఎంపిక చేసుకున్నాను. మాళవికకు ఎగ్జామ్స్ ఉండడంతో షూటింగ్ మొత్తం సమ్మర్ లోనే చేయాల్సి వచ్చింది. 

మౌనరాగం నాకు ఇష్టమైన సినిమా..

మౌనరాగం సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో అమ్మాయికి నచ్చకుండా పెళ్లి చేస్తారు. ఇద్దరికీ నచ్చకుండా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ సినిమా చేశాను.

ఆ సినిమా తరువాత ఏడ్చేశాను..

'జబర్దస్త్' సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఏడ్చేశాను. పేపర్లలో నా గురించి రాసిందంతా చదివి తెగ బాధ పడిపోయాను. నాకు 'క్వీన్' మూవీ అంటే చాలా ఇష్టం. ఆ సినిమా డైరెక్ట్ చేసిన వికాస్ 'శాందార్' సినిమా చూసి తనను తెగ తిట్టుకున్నాను. క్వీన్ అంత బాగా చేసి శాందార్ ఎలా చేసాడా అనిపించింది. అప్పుడు రియలైజ్ అయ్యాను. 'అలా మొదలైంది' లాంటి మంచి సినిమా చేసిన తరువాత 'జబర్దస్త్' లాంటి సినిమా చేసిన నన్ను తిట్టడంలో తప్పు లేదనుకున్నాను.

ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు..

'అలా మొదలైంది' సినిమాను ఇండస్ట్రీలో చాలా మందికి చూపించాను. పెద్ద పెద్ద మేధావులంతా ఆ సినిమా బాలేదని చెప్పారు. ఆ సినిమా రిజల్ట్ చూసి మేమంతా షాక్ అయ్యాం. కళ్యాన్ కోడూరి, మధుసూదన్ మాత్రమే సినిమా బావుందని చెప్పారు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే పెద్దగా లేరనే చెప్పాలి. జగపతిబాబు, రమ్యకృష్ణ, కృష్ణవంశీ మాత్రమే మంచి ఫ్రెండ్స్. నాకు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువ.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

నాకు హ్యూమన్ రిలేషన్స్ తో సినిమా చేయడమే నచ్చుతుంది. నేను ఏ కథ తీసుకున్నా.. అందులో హ్యూమన్ రిలేషన్ ఉండేలా చూసుకుంటాను. ప్రస్తుతానికి ఒక కథ సిద్ధంగా ఉంది. అదొక సీరియస్ లవ్ స్టొరీ. చేస్తే ఆ కథనే సినిమాగా చేస్తాను అంటూ .. ఇంటర్వ్యూ ముగించారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ