ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో కొత్త ఆలయాల ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరిగాయి. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా..
చిరంజీవి మాట్లాడుతూ.. ''ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. నాకు ఆ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు'' అని చెప్పారు.
నాగార్జున మాట్లాడుతూ.. ''సూర్యభగవానుడి ఆలయాన్నిఆవిష్కరించడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను'' అని చెప్పారు.
మురళి మోహన్ మాట్లాడుతూ.. ''నిమ్మగడ్డ ప్రసాద్ గారిని దేవాలయం నిర్మించమని లక్ష్మీ నరసింహస్వామి కలలో ఆదేశించడం జరిగింది. నిజానికి ఈరోజు ఆవిష్కరించబడ్డ మూడు ఆలయాలను కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, వారి సతీమణి నిర్మించాలనుకున్నారు. కాని నిమ్మగడ్డ ప్రసాద్ గారి కోరిక మేరకు వారు తప్పుకున్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని చెప్పారు.
నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ.. ''గత కొంతకాలంగా లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఫిలిం నగర్ టెంపుల్ కి వచ్చినప్పుడు ఇక్కడ లక్ష్మి నరసింహస్వామీ విగ్రహం లేకపోవడం గమనించాను. త్వరలోనే దానిని నిర్మించే పనులో ఉన్నామని యాజమాన్యం తెలిపింది. ఆ విగ్రహాన్ని నేనే నిర్మించాలని ఈ కార్యక్రమం చేపట్టాను. రెండు రోజులుగా ఈ కార్యక్రమంలో ఉన్న నేను ప్రపంచాన్ని మర్చిపోయాను. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ కమిటీకు రుణపడి ఉంటాను'' అని చెప్పారు.