'జబర్దస్త్' షో తో మంచి క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్. టీవిలో బాగా ఫేమస్ అయిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయన' లో తలుక్కున మెరిసింది. ఇప్పుడు లీడ్ క్యారెక్టర్ లో నటించిన 'క్షణం' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఈ సందర్భంగా అనసూయ విలేకర్లతో ముచ్చటించారు.
టెలివిజన్ మాత్రం వదలను..
సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి కదా.. అని టెలివిజన్ ను మాత్రం వదలలేను. నేను నేర్చుకున్నదంతా అక్కడే.నిజానికి 'క్షణం' మూవీ నా డెబ్యూ ఫిలిం కావాల్సింది. కాని 'సోగ్గాడే చిన్ని నాయన' ముందుగా రిలీజ్ అయింది. అందులో నాది చిన్న రోల్. ఈ సినిమాలో ఫుల్ లెంగ్థ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నటిగా నన్ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఎదురు చూస్తున్నాను.
శ్వేతా పాత్ర కోసం అనుకున్నా..
దేవిశ్రీప్రసాద్ లైవ్ కాన్సెర్ట్స్ కోసం అమెరికా వెళ్లాను. అక్కడే 45 రోజులు ఉన్నాం. ఆ సమయంలో అడవి శేష్ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. సినిమా చేయాలనుకుంటున్నాం.. కథ వింటారా అని. ఆ టైంలో నేను బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఆ తరువాత ఇండియా వచ్చాక రెండు నెలలు నా పనుల్లో బిజీ అయిపోయాను. ఒకసారి కాఫీ షాప్ కి వెళ్ళినపుడు శేష్ కలిశాడు. స్టొరీ వినిపించాడు. శ్వేతా అనే క్యారెక్టర్ కోసం అడుగుతున్నారనుకున్నాను. కాని జయా భరద్వాజ్ అనే కాప్ క్యారెక్టర్ కోసం అనుకున్నారు.
పోలీస్ డ్రెస్ వేసుకోలేదు..
ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించినా.. సినిమాలో ఒక్కసారి కూడా పోలీస్ డ్రెస్ వేసుకోలేదు. మొదట ఈ పాత్రలో నేను చేయగలనా..? అనుకున్నాను. షూటింగ్ టైంకి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. షనిల్ డియో ఫోటోగ్రఫీ సినిమాకు ప్లస్. తన వలనే నేను నటించగలననే నమ్మకం కుదిరింది. జయా భరద్వాజ్ క్యారెక్టర్ లో పోలీస్ లో ఉండే అథారిటీ, స్ట్రిక్ట్ నెస్ తో పటు విమెన్ లో ఉండే అలిగన్స్ కూడా ఉంటుంది.
ఎవరిని ఇమిటేట్ చేయలేదు..
కాప్ క్యారెక్టర్ అనగానే దానికి సంబంధించిన సినిమా చాలానే చూశాను. కాని ఈ సినిమాలో ఎవరిని ఇమిటేట్ చేసి నటించలేదు. నేను ఇమిటేటింగ్ బాగా చేయగలను. జయా భరద్వాజ్ పాత్ర కోసం నేను నేనుగా నటించాలనుకున్నాను.
నాగ్ సర్ తో అనగానే గెంతాను..
టీవీలో అయిన సినిమా అయిన పాత్రల విషయంలో నేను పర్టిక్యులర్ గా ఉంటాను. నా పాత్ర, దర్శకుడి మేకింగ్ చాలా ముఖ్యం. సోగ్గాడే చిన్ని నాయన లో రెండు సీన్లు, ఒక్క పాటలో నటించాలని చెప్తే మొదట ఒప్పుకోలేదు. నాగ్ సర్ నా ఫేవరేట్ యాక్టర్. ఆయనతో సినిమా అంటే గెంతాను. రమ్యకృష్ణ, నాగార్జునలతో కలిసి వర్క్ చేయొచ్చని సినిమా ఒప్పుకున్నాను.
ఆ స్వార్ధంతో సినిమాలకు దూరమయ్యాను..
టెలివిజన్ షోస్ లో నేనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. కాని సినిమాల్లో అలా ఉండదు. ఆ స్వార్ధంతోనే నేను సినిమాలకు దూరమయ్యాను. కాని అవకాశాలు రావడంతో నటిస్తున్నాను.
ఎంటర్టైన్ చేయడమే ముఖ్యం..
నాకు పెళ్లైంది.. పిల్లలున్నారు. బాలీవుడ్ లో కూడా పెళ్ళైన చాలా మంది నటిస్తున్నారు. కాని అక్కడ పెర్సనల్ లైఫ్ చూడరు. స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేస్తున్నారా..? లేదా..? అనే చూస్తారు. నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. అంతే మంది హేటర్స్ కూడా ఉన్నారు. కాని నేనెవరిని పట్టించుకోను. స్క్రీన్ మీద ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే నాకు ముఖ్యం.
ఎవరి కష్టాలు వాళ్ళవి..
ఒక్కోసారి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను. ఆ సమయంలో నా ఫ్యామిలీ, నా భర్త నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. నువ్వంటే ఏంటో.. మాకు తెలుసు.. ఎవరికీ సమాధానం చెప్పకర్లేదని నా వెన్నంటే ఉంటారు. అయిన సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి. ఎవరి ప్రాబ్లెమ్స్ వాళ్ళకు ఉంటాయి.
నేను హార్డ్ వర్క్ చేయడం వలనే..
చాలా తక్కువ సమయంలో అనసూయకు పెద్ద పేరొచ్చిందని అందరూ అనుకుంటారు. కాని వాళ్లకు తెలియదు కదా.. నేను ఎంత హార్డ్ వర్క్ చేసానో.. నేను షార్ట్ టైంలో ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వలన ఈ స్థాయిలో ఉన్నాను. నా గురించి నెగెటివ్ గా మాట్లాడే వాళ్లకి అర్ధమయ్యేలా చెప్పలనుకుంటాను కాని అనవసరం అనిపిస్తుంది.
సినిమానే సులువు..
నేను ఇంకా పని నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు టెలివిజన్ కు, సినిమాకు పెద్ద తేడా అనిపించలేదు. టీవీలోనే ఇంకా డిసిప్లైండ్ గా ఉండాలి. సినిమాల్లో నటించడం నాకు సులువుగా అనిపించింది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ఇంకా ఏది ప్లాన్ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. క్షణం ట్రైలర్ చూసి ఐదు సినిమాల్లో కాప్ పాత్రల్లో నటించమని ఆఫర్స్ వచ్చాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు.