రాజ్ తరుణ్, అర్థన జంటగా శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 29న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ అర్థన సోమవారం విలేకర్లతో ముచ్చటించారు.
నా ఫోటో చూసి పిలిచారు..
నేను కేరళ అమ్మాయిని. ప్రస్తుతం బి.ఏ జర్నలిజం చేస్తున్నాను. నా స్నేహితురాలి ప్రొఫైల్ లో నన్ను చూసి ఓ కాస్టింగ్ మ్యానేజర్ సినిమాలో నటించమని అడిగారు. ఈ సినిమా కోసం వచ్చి ఆడిషన్ ఇచ్చాను. ఆ ప్రాసెస్ అంతా వింతగా జరిగింది.
పాత్ర నచ్చే ఒప్పుకున్నాను..
ఈ సినిమాలో నా పాత్ర పేరు సీత. మోడరన్ గా కనిపించే సీత పాత్ర నాకు బాగా నచ్చింది. కేవలం హీరోయిన్ కొన్ని సీన్లకు, పాటలకు పరిమితం అవ్వకుండా సినిమా అంతా నా పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే నటించడానికి ఒప్పుకున్నాను.
మొదట్లో కష్టపడ్డాను..
నాకు తెలుగు భాష మీద కొంచెం కూడా అవగాహన లేదు. ఈ సినిమా ఒప్పుకునే వరకు ఒక తెలుగు సినిమా కూడా చూడలేదు. ఒప్పుకున్న తరువాత తెలుగు నుండి మలయాళంలో డబ్ అయిన సినిమాలు చూశాను. మొదట్లో భాష రాకపోవడం వలన చాలా కష్టపడ్డాను. కాని ఒక నటిగా ఆ సమస్యను అధిగమించాలనుకొన్నాను. ఇప్పుడు తెలుగు కొంచెం అర్ధమవుతుంది. మాట్లాడానికి ప్రయత్నిస్తున్నాను.
నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు..
రాజ్ తరుణ్ మంచి నటుడు. నా హావభావాలు, డైలాగ్స్ విషయంలో చాలా హెల్ప్ చేసేవాడు. నాకు ఇప్పుడు తను మంచి ఫ్రెండ్ అయిపోయాడు. తను చేసిన సపోర్ట్ మర్చిపోలేను.
చదువు మధ్యలో వదలను..
నేను ఇప్పుడు చదువుకుంటున్నాను. చదువు మధ్యలో ఆపేసి సినిమాల మీద ధ్యాస పెట్టే ఉద్దేశ్యం లేదు. ఎక్కువ సినిమాలు చేసేయాలనే ఆలోచన లేదు. మెల్లగా నాకు నచ్చిన స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చదువుకున్న హీరోయిన్ గా మంచి కెరీర్ ఉండాలని ఆశిస్తున్నాను.
గ్లామరస్ రోల్స్ చేయను..
నేను నటించే పాత్ర నాకు నచ్చాలి. నటించేప్పుడు నాకు సంతోషంగా అనిపించాలి. హీరోయిన్ అనేవారు అందంగా కనిపించాలి. కాని గ్లామర్ పాత్రలో నటించడానికి నేను రెడీగా లేను. కంఫర్టబుల్ కూడా అనిపించదు.
శ్రీనివాస్ టాలెంటెడ్ డైరెక్టర్..
డైరెక్టర్ శ్రీనివాస్ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆర్టిస్టుల నుండి ఎలాంటి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. నాకు స్క్రిప్ట్ చాలా బాగా నేరేట్ చేశారు. ఫ్యూచర్ లో తను ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతారు.
కథను కొత్తగా ప్రెజంట్ చేశారు..
ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. సీత గురించి రాముడు ఏం చేసాడనేదే మెయిన్ పాయింట్. కథ కొత్తది అని చెప్పను కాను కొత్తగా ప్రెజంట్ చేశారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
మలయాళంలో ఒక సినిమాలో నటించాను. అది ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదవుతుంది. ప్రస్తుతానికి మరే ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.