నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై రమేష్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'అబ్బాయితో అమ్మాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో సినీజోష్ ఇంటర్వ్యూ...
సినిమా గురించి చెప్పండి..?
పెళ్ళికి ముందు అమ్మాయిని బయటకు రమ్మని అబ్బాయి అంటుంటాడు. పెళ్ళి తర్వాత అదే అమ్మాయి అతనితో బయటకు వెళ్లాలనుకున్నా వీలుపడదు. ఇలాంటి ఓ పాయింట్‌తో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ క్లీన్ లవ్ స్టోరీ. ఇందులో రెండు బొమ్మలుంటాయి. ఇవి సినిమాలో కీలకంగా ఉంటాయి.
మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది..?
ఇందులో ఫన్ లవింగ్ గయ్ పాత్రలో నటించాను. సినిమాలో నాది రిచ్ ఫ్యామిలీగానే చూపించారు.
ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు..?
ప్రేమ అంటే అబ్బాయి, అమ్మాయే కాదు. ఇద్దరి ఫ్యామిలీలకు కూడా అందులో సంబంధం ఉంటుంది. అదెలా, ఎంటనేది సినిమాలో చూడాల్సిందే.
ఇళయరాజా మ్యూజిక్ గురించి చెప్పండి..?
ఆయన మ్యూజిక్ గురించి నేను మాట్లాడేటంతవాడిని కాను. 1000 సినిమాలు చేశారు. 'అబ్బాయితో అమ్మాయి' 999వ సినిమా. ఇంత త్వరగా ఆయన మ్యూజిక్ డైరెక్షన్‌లో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
లవ్ జోనర్ లో ఉండే సినిమాలే చేస్తారా...?
మధ్యలో నేను 'జాదూగాడు' వంటి డిఫరెంట్ మూవీని ట్రై చేశాను. అందులో నటుడిగా ఓకే అయ్యాను. మళ్ళీ అలాంటి సినిమా చేయనని కాదు, కానీ కొంత సమయం తర్వాత చేస్తాను.
ఎలాంటి సినిమాల్లో నటించాలనుకుంటున్నారు..?
నాకు చాక్లెట్ బాయ్ అనే ఇమేజ్ వద్దు. సూర్యగారికి ఉన్న ఇమేజ్ ఉండాలనుకుంటాను. అమీర్‌ఖాన్ సినిమాలకు వెళ్ళేటప్పుడు ఆయన తన సినిమాలో ఏదో కొత్తగా ట్రై చేసుంటాడనిపించే సినిమాకు వెళతాం. అలా నా సినిమాకు కూడా ప్రేక్షకుడు ఆసక్తిగా రావాలి.
సినిమాలో లిప్‌లాక్ ఉన్నట్లుంది..?
ఉంటుంది కానీ అది చీటింగ్ లిప్‌లాక్.
ప్రస్తుతం మీరు ఎన్నో స్థానంలో ఉన్నాననుకుంటున్నారు..?
ప్రస్తుతం నాకు తెలిసి జీరో అనుకుంటున్నాను. 2016లో నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటితో ఒక స్టెప్ ఎక్కుతానని అనుకుంటున్నాను. చాలా మంది నేను యారగెంట్ అనుకుంటారు. కానీ నేను షూటింగ్‌లో ఒక్కడినే కూర్చుంటాను. అది దూరం నుండి చూసి సీరియస్‌గా ఉన్నాడు కదా అని అనుకుంటారు. కానీ దగ్గర ఉండేవారితో బాగానే ఉంటాను.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్..?
ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీని తరువాత 'కళ్యాణ వైభోగమే' పెళ్ళి తర్వాత ప్రేమ గురించి చెప్పే చిత్రంలో నటిస్తున్నాను. అది కాకుండా 'ఒక్కమనసు' ఒక మెచ్యూర్ లవ్‌స్టోరీ లో నటిస్తున్నాను. 'జో అచ్యుతానంద' అనే ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథ ఓకే చేశాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.