సంఖ్యాపరంగా.. సక్సెస్‌పరంగా.. టాలీవుడ్ దర్శకులలో టాప్ లైన్‌లో దర్శనమిచ్చే పూరి జగన్నాధ్ తన ఆలోచనలు, అభిప్రాయాల విషయంలో మాత్రం మిగతావారికంటే చాలా భిన్నంగా అనిపిస్తాడు..కనిపిస్తాడు. తాను వలచిందే రంభ, తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు వంటి మొండి వాదన చేయడు కానీ.. అతని మాటలు, రాతలు, చేతలు ట్రెడిషనల్ ట్రెండ్‌కి భిన్నంగా ఉంటాయి. బేసికల్‌గా రైటర్ కమ్ డైరెక్టర్ అయిన పూరి డైలాగుల్లో నిగూఢార్ధాలు, గొప్ప పద ప్రయోగాలు కనిపించవు. కానీ సూటిగా, సుత్తిలేకుండా మంచి పవర్‌ఫుల్ పంచ్‌లు రాస్తాడు, తీస్తాడు. అతని మాటల్లో నీతులు కనిపించవు.. కానీ నిజాలు గర్జిస్తాయి. అతని టైటిల్స్, డైలాగులు, తన హీరోల బాడీ లాంగ్వేజ్, కేర్‌లెస్ యాటిట్యూడ్‌ల ప్రభావం యూత్ మీద బాగానే పనిచేస్తుంది.
మీ పాత్రలు, డైలాగులు, వాటి బాడీ లాంగ్వేజ్ యూత్‌ని చెడగొడుతున్నాయనే విమర్శలు వినిపిస్తుంటాయ్..ఈ విమర్శలకు మీ సమాధానం ఏమిటి అని అడిగితే..నేను చెడగొట్టలేనంతగా చెడిపోయారు ఈ జనం..నేను వాళ్ళని కొత్తగా చెడగొట్టేదేమిటి.. అంటూ ఎదురొస్తాడు పూరి. ఇంతకి ఎవరు ఎవర్ని చెడగొడుతున్నారన్నది ప్రక్కన పెడితే..పూరీ ప్రభావం మాత్రం..మన యూత్‌మీద చాలానే ఉంది.
సినిమాలు, పాత్రల విషయంలోనే కాదు..వ్యక్తిగతంగా కూడా పూరిలో ఒక విలక్షణ వ్యక్తిత్వం గోచరిస్తుంది. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ.. బట్ ఈజ్ ఎవ్రీవేర్ హీజ్ ఇన్ చైన్స్.. అంటారు. పూరి ప్రతి కదిలికలోనూ..ఆ ఛైన్స్ తెంచుకోవాలనే స్వేచ్ఛా ప్రియత్వం కనిపిస్తుంది. జనజీవన స్రవంతిలో ఉంటూనే జనాభిప్రాయానికి దూరంగా జరిగే డిటాచ్‌డ్ థింకింగ్ వైపు సాగుతుంటాయి పూరి ఆలోచనలు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మాణ్యం నాటి పూరి ఇప్పుడు లేడు. అందాలు-ఆనందాలు, అనుభవాలు-అనుభూతులు, అన్యాయాలు-అబద్ధాలు, విజయాలు-అపజయాలు, డిప్లమసీ-హిపోక్రసీల మధ్య నలిగి, కలగి, దొర్లి పొర్లిన..రాటుదేలిన తనంతో పాటు వీటికి దూరంగా పారిపోవాలని, ఏదో తెలియని ఆవలి తీరానికి చేరుకోవాలి అనే ప్రయత్నమూ కనిపిస్తుంటుంది పూరిలో. ఇలా ఎటాచ్‌డ్ ప్లస్ డిటాచ్‌డ్ క్యారక్లరైజేషన్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్లేస్‌మెంట్‌ను సాధించుకున్న పూరినీ... ఓ ఇంటర్య్వూ కావాలని అడిగింది సినీజోష్.
దానికి సారీ భయ్యా.., లోఫర్ ప్రమోషన్ బిజీలో ఉన్నాను. ఇప్పుడు టైమ్ లేదు..ఏం అనుకోకుండా.. క్వశ్చన్స్ రాసి ఆఫీస్‌లో ఇస్తే.. రాత్రికి ఆన్సర్స్ రాసి పంపిస్తానంటూ.. హడావుడిగా కారెక్కాడు పూరి. ఫేస్ టు ఫేస్ కాకుండా.. ఇలా ఇంటర్య్వూ చేయడం కూడా ఓ వెరైటీయే. అందుకే తన ప్రశ్నలను నీటుగా కంపోజ్ చేసి..పూరి ఆఫీస్‌లో అందించింది సినీజోష్. మరుసటి రోజు ఉదయానికల్లా పూరి నుండి వచ్చిన సమాధానాలు ఇవి..!! గో త్రూ అండ్ ఎంజాయ్..!!
Interviewed by Prabhu
పూరి ఆన్సర్స్...
1. మీకు పూరి ఇష్టమా? జగన్ ఇష్టమా? పూరి జగన్నాధ్ ఇష్టమా?
>పూరి : పూరి..!
2. జగన్‌గారూ.. మీ మాట, మీ చేత, మీ రాతలలో ఓ గొప్ప ఫిలసాఫర్, ఓ తిక్క పురుషుడు కలగాపులగంగా కనిపిస్తుంటారు. అసలింతకీ వాట్ యు ఆర్ మిస్టర్ పూరి?
పూరి: ఈ ప్రపంచంలో నేను ఏమీ కాను.. మనం అనుకునే ప్రపంచం కూడా విశ్వంలో ఏమీ కాదు.. ఒక రోజు ఇది ఇక్కడ వుండదు.. ఈ భూమి మీద బ్యాక్టీరియా ఎంతో, నేను అంతే.. నేను ఎవరిని, నేను ఎవరిని అని నన్ను నేనే చాలా ప్రశ్నించుకోవడం వల్ల నాకు వచ్చే సమాధానం ఇది.
3. ఇల్లు-ఇల్లాలు-పిల్లలు, హిట్లు-పట్లు, క్లాప్స్-ఫ్లాష్, బ్యాంకాక్-బ్యాంక్ బాలెన్స్, స్వీట్ సిక్స్‌టీన్-వాట్ సిక్స్‌టీ నైన్... వీటికి అతీతమైన..పూరి ఎక్కడో కనిపిస్తుంటాడు. ఎక్కడబ్బా!
పూరి: నిజానికి నాది హిప్పీ మైండ్. ఫ్రీడమ్ అంటే నాకిష్టం. ఏ లగేజ్ లేకుండా ప్రపంచమంతా తిరగాలని వుంటుంది. చాలా త్వరలో బ్యాక్ ప్యాక్ వేసుకొని బయలుదేరబోతున్నాను.
4. సంప్రదాయ ఆలోచనా విధానానికి భిన్నంగా వెళ్లే వాళ్లని లెఫ్టిస్ట్‌లు అంటారు. సినిమా ఇండస్ట్రీలో మీ భావాలు, ఆలోచనలు సంప్రదాయేతరంగా ఉంటాయి. మీ ఆలోచనల్లో ఈ లెఫ్ట్ ఓరియంటేషన్‌కు కారణం ఏమిటి?
పూరి: నూటికి 90 మంది నమ్మేది నేను నమ్మను.. ఆ మిగిలిన పది మంది మేధావులు ఎలా ఆలోచిస్తున్నారో గమనించడం నాకిష్టం.. నాలో ఈ క్వాలిటీ చిన్నప్పటినుండి వుంది.. చలం, శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, రంగనాయకమ్మ, రజనీష్ అండ్ రామ్ గోపాల్ వర్మ నన్ను ఇంకా పాడు చేసారు.
5. నా రూటే సెపరేటు, వీడు తేడా, వీడికి కొంచెం తిక్క లాంటి ఉపమానాలు, మేనరిజాలు మీకు ఎంతవరకు అప్లై అవుతాయి?
పూరి: నా రూట్ సెపరేటో, కాదో నాకు తెలీదు గానీ, తిక్క మాత్రం చాలా వుంది.. నాకిచ్చే రెమ్యునరేషన్ లో డైరెక్షన్ కే తక్కువ వుంటది.. నా తిక్కకే ఎక్కువ ఇస్తున్నారు.
6. మీరెవరిలా జీవించాలి అని అడిగితే మీ గురువు రాంగోపాల్‌వర్మలాగా అని చెప్పారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో అందరితో వివాదాలు కొని తెచ్చుకునే వర్మ మీకు ఆదర్శమైతే మరి మీకెందుకు అలాంటి కాంట్రవర్షియల్ ఇమేజ్ లేదు?
పూరి: ప్రతిరోజు ప్రపంచంతో యుద్ధం చేసే రామ్ గోపాల్ వర్మ అంటే నాకిష్టం.. అయితే నేను ఆదర్శంగా తీసుకునేది ఆయన చేసే యుద్ధం కాదు.. తనలా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం.
7. లైఫ్‌లో స్ట్రగుల్ ఈజ్ కామన్. దర్శకుడు కావడానికి ముందు, దర్శకుడుగా ఒక స్థాయికి వచ్చాక మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్‌లో తేడా ఏమిటి?
పూరి: దర్శకులు కావడానికి ముందు, సక్సెస్ రావడానికి ముందు, చాలా స్ట్రగుల్స్ పడతాం. జేబులో డబ్బులు వుండవు, రూం రెంట్ కట్టలేం, మూడు పూటలా తినలేం ఇలా చాలా వుంటాయి.. కాని సక్సెస్ వచ్చిన తరువాత తెలిసిందేంటంటే అంతకముందు పడ్డవి కష్టాలే కావు.. నిజమైన స్ట్రగుల్స్ సక్సెస్ తర్వాతే ఉంటాయి.. ఇప్పుడు నేను వున్నది స్ట్రగులింగ్ పీరియడ్ లో.
8. మీ హీరోల పాత్రలే మీరు అనుకోవచ్చా. మీ హీరోల పాత్రల్లో మీ వ్యక్తిత్వం ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది?
పూరి: నేను రాసే పాత్రల్లో చాలా వరకు నా వ్యక్తిత్వం వుంటుంది.. అలాగే నేను జీవితంలో ఎలా వుంటే బావుంటుందో అనే లక్షణాలు కూడా నా పాత్రలలో ఉండేలా రాసుకుంటాను.
9. ఐడియాటిజమ్, పోకిరిజమ్, లోఫరిజమ్, రోగ్ ఇజమ్‌లను హీరోయిజమ్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు..పూరి అనే విమర్శల పట్ల మీ స్పందన ఏమిటి?
పూరి: అలాంటి విమర్శలు విన్నప్పుడు నేను చాలా హ్యాపీ గా ఫీల్ అవుతాను.. ఎందుకంటే ఏదో ఒక ఇజం పేరుతో ఎవర్నో ఒకడ్ని ఇన్స్పైర్ చేయగలుగుతున్నా.. లేదా వాళ్ళ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాను.. నన్ను విమర్శించే వాడు ఏం చెయ్యట్లేదు కదా.
10. మీ హీరో పాత్రలను నెగటివ్ ఏటిట్యూడ్ తో స్టార్ట్ చేసి పాజిటివ్ ఏటిట్యూడ్‌తో ఎండ్ చేస్తారు. అంత నెగటివ్ టచ్ ఉన్న హీరోను, హీరోయిన్, ఇతర పాత్రలు ఓన్ చేసుకునేలా టర్న్ చేయటం చాలా పెద్ద సవాల్ కదా. ఎందుకంత రిస్క్ తీసుకుంటారు?
పూరి: ఒక కొత్త ఐడియాలో రిస్క్ లేకపోతే అది కొత్త ఐడియానే కాదు.. అందుకే నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం.. ఈ ప్రపంచంలో ఎవరికీ ఏ విషయం పూర్తిగా తెలీదు.. అయితే మనకు తెలిసిన ఆ కాస్త విషయాన్నీ ఎంత కాన్ఫిడెంట్ గా, కన్విన్సింగ్ గా చెప్పామనే దాంట్లోనే మన సక్సెస్ ఉంటుంది.. అందుకే నెగెటివ్ షేడ్ తో ఉన్న నా హీరోలు చెప్పే మాటలు కన్విన్సింగా ఉండేలా చూసుకుంటాను.. రీజనింగ్ వుంటే అందరూ నమ్ముతారు.
11. కమీషనర్ల కూతుర్లకు పెళ్లిళ్లు కావా? మొగుళ్లు రారా? అని ప్రశ్నించే మీ పాత్రల ఏటిట్యూడ్‌ను, హీరోయిజాన్ని ఎవడైనా కుర్రాడు ఎడాప్ట్ చేసుకుని రియల్ లైఫ్‌లో ప్రయత్నిస్తే వాడికి ఎలాంటి రిజల్ట్, రియాక్షన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు?
పూరి: అలా ఒళ్ళు పొగరుతో కమీషనర్ కూతుర్ని అడిగితే స్టేషన్ లో పడేసి కాళ్ళు ఇరగ్గొడతారు. నా హీరో క్యారెక్టర్ నుంచి అర్ధం చేసుకోవాల్సింది హైపర్ యాటిట్యూడ్.. నేను రాసే డైలాగులు హైపర్ గా ఉంటాయి తప్పా, పొగరుగా వుండవు.
12. ఒక పబ్లిక్ ఫిగర్ ప్రయాణంలో పబ్లిక్ నుండి యాక్సెప్టింగ్, రెస్పెక్టింగ్ అనే రెండు దశలు ఉంటాయి. మీరు ఏ దశలో ఉన్నారు?
పూరి: రెస్పెక్టింగ్ స్టేజ్ లో వున్నాను కాబట్టే మీరు నన్ను క్వశ్చన్ అడిగారు.. ఏ ఒక్క తప్పు చేసిన నాకు ఉన్న ఈ రెస్పెక్ట్ పోతుంది.. అలా అని తప్పు చేయకుండా ఉండలేము.. ఒకటి మాత్రం నిజం.. ఎంత బ్యాంక్ బ్యాలన్స్ ఉంటే అంత రెస్పెక్ట్ ఉంటది.. 100 సినిమాలు తీసిన తర్వాత కూడా చిల్లి గవ్వ మిగల్చకపోతే ఇంట్లో కూడా రెస్పెక్ట్ పోతుంది.
13. మంచి చిత్రానికి ఓ మంచి నిర్వచనాన్ని ఇంతవరకు ఎవరూ ఇవ్వలేకపోయారు. డబ్బులొచ్చిందే మంచి సినిమా అని ఒకప్పుడు మహా నటుడు ఎన్.టి.ఆర్. గారు నిర్వచించి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. మరి మంచి చిత్రానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?
పూరి: నేను చెప్పేది కూడా అదే.. ఏ సినిమాకి డబ్బులు వస్తే అదే మంచి సినిమా.. సమాజానికి పనికొచ్చే సినిమా సూపర్ హిట్టే.. దాని వల్ల కోట్ల రూపాయలు జనరేట్ అవుతాయి.. గవర్నమెంట్ కి అందరం టాక్స్ లు కడతాం.. ఆ డబ్బుతో దేశం బావుంటుంది.
14. ఈ మధ్య హర్రర్ అనేది ఒక సక్సెస్‌ఫుల్ జోనర్ అయింది. టెక్నాలజీ మీద మంచి పట్టు ఉన్న మీరు ఆ జోనర్‌ను ఎందుకు ట్రై చేయడం లేదు. మీలాంటి విలక్షణ ఆలోచనా విధానం ఉన్న దర్శకుడు పొలిటికల్ సెటైర్ తీస్తే ఇంపాక్ట్ బలంగా ఉంటుంది. బిజినెస్‌మ్యాన్, గంగతో రాంబాబుల్లో ఆ జోనర్‌ను కొంత టచ్ చేసినప్పటికీ ఫుల్‌ప్లెడ్జ్‌డ్ పొలిటికల్ ఫిలిం తీసే ఆలోచన ఏమైనా ఉందా?
పూరి: నాకు హారర్ సినిమా అంటే ఇష్టం ఉండదు గానీ, హారర్ కామెడీ ఇష్టం.. ఖచ్చితంగా అలాంటిది ట్రై చేస్తాను.. అలాగే బిజినెస్ మెన్ లాంటి సినిమా ఇంకోటి తీయాలని వుంది.
15. పోకిరి తో మీరు ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తే రాజమౌళి దాన్ని మగధీర తో క్రాస్ చేశారు . దాన్ని అత్తారింటికి దారేది తో త్రివిక్రమ్ క్రాస్‌చేశాడు. మరలా దాన్ని బాహుబలి తో రాజమౌళి క్రాస్‌చేశాడు. మరలా మీ వంతు ఎప్పుడు? అసలు అలాంటి టార్గెట్ ఏదైనా ఉందా?
పూరి: పోకిరి సినిమా అలాంటి టార్గెట్ తో తీసింది కాదు.. అది ఆల్ టైం రికార్డ్ అవుతుంది అని నాకు మాత్రం ఏం తెలుసు. కాని బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు తెలుగు సినిమా పొటెన్షియల్ ని మరోసారి ప్రూవ్ చేశాయి.. చూద్దాం మళ్ళీ నాకు లాటరీ తగుల్తుందేమో.
16. సోషల్ కాజ్‌కు కమర్షియల్ వాల్యూస్ మిక్స్ చేస్తూ హిట్స్ కొట్టడంలో తమిళ దర్శకులకు ఉన్నంత కమిట్‌మెంట్, కమాండ్ మన దర్శకులకు లేదు అనే విమర్శలతో మీరు ఏకీభవిస్తారా?
పూరి: అవును నేను కూడా ఏకీభవిస్తాను.. అలాంటి దర్శకులు మనకులేరని అనను కానీ.. ఇక్కడ ఎవరు ట్రై చెయ్యట్లేదు.
17. తమిళ సినిమాకు తెలుగులో ఉన్న మార్కెట్‌తో పోల్చితే తెలుగు సినిమాకు తమిళంలో అసలు మార్కెటే లేదు. ఎందుకు? ఇది తెలుగు దర్శకుల ఇష్యూనా, హీరోల ఇష్యూనా?
పూరి: తమిళ సినిమాని ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు.. తెలుగు వాళ్ళు ఆ పని చేయట్లేదు. సూర్య, కార్తి లాంటి హీరోలు ఇక్కడకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు... ఆడియో ఫంక్షన్ లు చేస్తున్నారు.. పాత్రికేయులతో ముచ్చటిస్తున్నారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి హీరోలు సినిమా ప్రమోషన్ కోసం ఎన్నో సిటీలు, టౌన్ తిరుగుతున్నారు.. మన హీరోలు ధోరణి మార్చుకంటే తెలుగు సినిమా కూడా మిగతా రాష్ట్రాలకి వెళ్తుంది.
18. నేషనల్ అవార్డ్స్, ఫిలిం ఫెస్టివల్స్ జరిగే సందర్భాలలో ఇతర భాషా చిత్రాలతోను, దర్శకులతోనూ పోల్చి మన వాళ్ళను మన వాళ్లే విమర్శిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది?
పూరి: విమర్శించనివ్వండి తప్పు లేదు. ఎందుకంటే మనకంటే మంచి సినిమాలు వాళ్ళు తీస్తున్నారు కాబట్టి.. అలా తిడితే, సిగ్గుపడి మనం కూడా మంచి సినిమాలు తీస్తాం.
19. చిరంజీవిగారి 150వ సినిమాయే ఒక ఎడతెగని సీరియల్ ఇష్యూగా సాగుతుంటే దానికి మీరు డైరెక్టర్ అనేది మరొక ఎండ్‌లెస్ ఎపిసోడ్ అయింది. దీనికి ఎండ్ ఎప్పుడు?
పూరి: ఎండ్ ఎప్పుడో నాక్కూడా తెలీదు.. అది ఏదో ఒకరోజు ఎండ్ అవ్వక తప్పదు.
20. మీరు టాప్ హీరోల టాప్ ఛాయిస్‌గా ఎదిగి చాలా కాలం అయింది. మరిప్పుడు ఎప్పటికైనా చిరంజీవిగారిని డైరెక్ట్ చేయాలని ఉంది అని మిమ్మల్ని మీరు ఆఫర్ చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి?
పూరి: ఎందుకంటే నేను చిరంజీవి గారికి అభిమానిని.. ఆయన సినిమా కోసం క్యూలో నుంచునేవాడ్ని. 12 ఏళ్ళ క్రితం చిరంజీవి గారికి ఒక కథ చెప్పా.. అది చెప్తున్నంతసేపు ఆ కథ ఒకే అయితే బావుండు అన్న ఆలోచన కంటే, రెండు గంటల పాటు నేను చెప్తుంటే మెగాస్టార్ వింటున్నారు అన్న ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాను.. అది సినిమా తీసినంత పని అయింది నాకు. కాని ఇప్పుడు నేను చెప్పే ఆలోచనలు ఆయనకీ నచ్చితే బావుండును అని ఉంది.. అందుకే ఒక కథ తయారు చేస్తున్నాను.
మరి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మరో అప్ డేట్ లో....