ఎస్.ఎమ్.ఎస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి రెజీనా. 'రొటీన్ లవ్ స్టొరీ','పిల్లా నువ్వులేని జీవితం' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం రెజీనా నటించిన 'సౌఖ్యం' సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనాతో సినీజోష్ ఇంటర్వ్యూ..
సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి..?
'సౌఖ్యం' సినిమాలో శైలజ అనే పాత్రలో కనిపిస్తాను. 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలో క్యారెక్టర్ కు దగ్గరగా ఉండే రోల్. సినిమాలో కామెడీ కూడా చేశాను. నాకు డాన్స్ అంటే ఇష్టం. 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాకు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్సే. ఆ సినిమాలో నాకు డాన్స్ చేయడానికి స్కోప్ లేదు కాని 'సౌఖ్యం' మాత్రం మూడు పాటల్లో డాన్స్ చేసే అవకాశం లభించింది. చాలా హ్యాపీగా అనిపించింది.
సినిమా అంగీకరించడానికి కారణం..?
గోపీచంద్ గారు, రవికుమార్ చౌదరి గారు ఈ ప్రాజెక్ట్స్ లో ఉన్నారని తెలిసింది. రవికుమార్ చౌదరి గారితో ఇదివరకే ఒక సినిమా చేశాను. కాబట్టి ఈ సినిమాకు పని చేయడం కష్టంగా అనిపించదు. అంతేకాకుండా భవ్య క్రియేషన్ బ్యానర్ అనగానే వెంటనే ఓకే చేశాను. ఆర్టిస్ట్స్ లను, టెక్నీషియన్స్ ను భవ్య క్రియేషన్స్ ట్రీట్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది. నటీనటులకు ఫ్రీడమ్ ఇస్తారు. ఇంత మంచి బ్యానర్ లో పని చేసే అవకాశం రావడం సంతోషంగా అనిపించింది.
డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారితో రెండోసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
'పిల్లా నువ్వులేని జీవితం' తరువాత మరోసారి ఆయనతో కలిసి వర్క్ చేశాను. రవికుమార్ చౌదరి గారికి కోపం ఎక్కువని అందరు అనుకుంటారు కాని ఆయన ఆర్టిస్ట్స్ మీద కోపం చూపించరు. నటన విషయంలో నాకు స్వేచ్చనిస్తారు. నన్ను సొంత కూతురిని ట్రీట్ చేసినట్లు చేస్తారు. మా ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది.
గోపీచంద్ గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి..?
గోపీచంద్ చాలా కామ్ గా, సైలెంట్ గా ఉండే మనిషి. కాని ఆయనకు తెలిసిన వాళ్ళతో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తారు.
హీరోయిన్ గా బిజీగా ఉన్నట్లున్నారు..?
హీరోయిన్ అంటే బిజీగానే ఉండాలి కదా..! అయితే నా సినిమాలు ప్లానింగ్ నేను చేయను. నా టీం చేస్తుంది. డెసిషన్స్ మాత్రం నేను తీసుకుంటాను. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అక్టోబర్ కు ముందే రిలీజ్ కావాల్సింది కాని అక్టోబర్ లో రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో నేను నటించిన రెండో సినిమా రిలీజ్ అవుతుంది.
స్టార్ హీరోయిన్ అవ్వడానికి ఎంత దూరంలో ఉన్నారనుకుంటున్నారు..?
ఇండస్ట్రీలో నా నెంబర్ ఒకటా, రెండా, మూడా అని నేను చూడను. నాకంటూ నేను కొన్ని స్టాండర్స్ పెట్టుకుంటాను. వాటికి రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇన్నర్ సాటిస్ఫ్యాక్షన్ అనేది ఉండాలి. టాలీవుడ్ లో నేను నటించిన సినిమాల గురించి, నా ఇంటర్వ్యూల గురించి స్నేహితులను, తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకొని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.
విరామం లేకుండా సినిమా ఆఫర్స్ వస్తే చేస్తారా..?
నా మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. పని ఎక్కువ ఉంటే నేను చేయగలనా..? అని ఒకరకమైన భయం వస్తుంది. రోజులో 24గంటలు నేను పని చేయలేను. ఖచితంగా బ్రేక్ కావాలి. బిజీ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ ఉంటూనే నాకు బ్రేక్ కూడా కావాలి.
ఎలాంటి పాత్రల్లో నటించాలనుకుంటున్నారు..?
సినిమాల్లో నటించాలనుకున్నప్పుడు మంచి పాత్రల్లో నటించాలి.. హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకున్నాను. 'ఎస్.ఎస్.ఎస్', 'రొటీన్ లవ్ స్టొరీ' చిత్రాల తరువాత రెజీనా కమర్షియల్ సినిమాల్లో నటించలేదని కొందరు అన్నారు. ఆ మాటలు విని నేను బాధ పడ్డానని చెప్పను కాని నటిగా అన్ని రకాల పాత్రలు చేయగలనని నిరూపించుకోవాలనుకున్నాను. యాక్టర్ అనేవాడు అన్ని రకాల పాత్రలు చేయగలగాలి. నేను ఏ పాత్రలో నటించడానికైనా సిద్ధంగా ఉన్నాను. హారర్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు అన్ని చేయగలను.
ఇండస్ట్రీకు వచ్చినప్పుడు ఇంత బిజీ హీరోయిన్ అవుతానని ఊహించారా..?
నిజాయితీగా చెప్పాలంటే అసలు అనుకోలేదు. షార్ట్ ఫిల్మ్స్ లో నటించేప్పుడు, ఎస్.ఎమ్.ఎస్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ అయితేనే ఇండస్ట్రీ ఉండాలనుకున్నాను. లేదంటే టాటా చెప్పేసి నా సైకాలజీ చదువు కంటిన్యూ చేయాలనుకున్నాను. కాని 'ఎస్.ఎమ్.ఎస్' తరువాత 'రొటీన్ లవ్ స్టొరీ' సినిమా చాన్స్ వచ్చింది. ఇక నటిగా కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యాను.
సాయి ధరం తేజ్ తో వస్తున్న రూమర్స్ సంఘతేంటి..?
ఏవో రూమర్స్ వస్తున్నాయి కదా అని నా కెరీర్ ఏం మారిపోదు. మూడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు.. మీ మీద ఒక్క రూమర్ కూడా రాలేదేంటని మీడియా వారు, నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు. ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి నాకు తెలిసి వాళ్ళంతా హ్యాపీగా ఉంది ఉంటారు.
తమిళంలో సినిమాలు ఎందుకు ఒప్పుకోవట్లేదు..?
తమిళంలో నేను ఒక సంవత్సరం తరువాత నటించడానికి వెళ్ళినా నన్ను యాక్సెప్ట్ చేస్తారు. కాని తెలుగులో గ్యాప్ ఇస్తే తరువాత ఛాన్స్ లు రావడం కష్టం అవుతుంది. తెలుగు వొదిలేసి తమిళంలో సినిమాలు చేయాలనుకోవట్లేదు. అయినా నేను హడావిడిగా రెండు భాషల సినిమాల్లో నటించలేను.
బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయా..?
ఇంతకముందు వచ్చేవి కాని ఇప్పుడు రావట్లేదు. బొంబాయి కంపనీ వాళ్ళు చేసిన 'బిబా' యాడ్ లో నటించాను.
సినిమాలు కాకుండా ఇంకేం చేస్తుంటారు..?
నాకు సమయం దొరికితే సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాను. 'టీచ్ ఫర్ చేంజ్' , 'లైఫ్ ఈజ్ బాల్' , 'ఆదిత్య మెహతా ఫౌండేషన్' ఇలా కొన్ని ఆర్గనైజేషన్స్ కు పని చేస్తున్నాను.
డబ్బింగ్ చెప్పే ఆలోచన ఉందా..?
ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. డబ్బింగ్ చెప్పే స్థాయికి ఇంకా ఎదగలేదని భావిస్తున్నాను. డబ్బింగ్ అనేది ఒక ఆర్ట్.
క్రిస్మస్, న్యూ ఇయర్ ఎలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు..?
బహుసా క్రిస్మస్ వేడుకలు థియేటర్ లో ఉండొచ్చు. న్యూ ఇయర్ కి నా ఫ్రెండ్ పెళ్లి ఉంది. సో.. చెన్నై వెళ్తున్నా.. అక్కడే సెలెబ్రేట్ చేసుకుంటాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.