హేబా పటేల్, రాజ్ తరుణ్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న చిత్రం 'కుమారి 21 ఎఫ్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు సూర్య ప్రతాప్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
'కరెంట్' సినిమా తరువాత చాలా గ్యాప్ తో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్లున్నారు..?
అవును. సుమారుగా ఐదు సంవత్సరాల తరువాత ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. 'కరెంట్' సినిమా తరువాత నాకు సినిమాల ఆఫర్స్ వచ్చాయి. అదే సమయంలో సుకుమార్ గారి దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వమని కబురు వచ్చింది. మరో సినిమాకు డైరెక్టర్ గా పని చేసే కంటే సుకుమార్ గారి టీం లో పని చేయడం గొప్పగా భావించాను. ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళొచ్చు. నాకు ఎగ్జిగ్యూషన్ వర్క్ లో మంచి ఎక్స్పీరియన్స్ కాని రైటింగ్ డిపార్ట్మెంట్ లో అంత అనుభవం లేదు. సో.. వర్క్ నేర్చుకోవచ్చని ఆయన దగ్గర చేరాను.
మరి సుకుమార్ గారి లెవెల్ కు రీచ్ అయ్యానని అనుకుంటున్నారా..?
ఆయన లెవెల్ కు రీచ్ అవ్వడమంటే చాలా కష్టమైన విషయం. కాని సుకుమార్ గారు కథ రెడీ చేసుకొని 'నువ్వు డైరెక్ట్ చేయరా' అని చెప్పగానే ఆయనకు నాపై ఉన్న నమ్మకం ఎంతో అర్ధమయ్యింది.
ఈ సినిమా చేయాలనే ఆలోచన ఎలా పుట్టింది..?
బేసిక్ థాట్ సుకుమార్ గారిదే. '1 నేనొక్కడినే' సినిమాకు సుకుమార్ గారితో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక కథ చెప్పారు. సినిమాగా ఎందుకు చేయకూడదని అడగగానే కథ మొత్తం రెడీ చేసి నన్ను డైరెక్ట్ చేయమన్నారు. ఇదొక బోల్డ్ సబ్జెక్టు. ప్రస్తుతం ఉన్న జెనరేషన్ కు తగ్గట్లుగా ఉంటుంది. ఒక అమ్మాయి, అబ్బాయి గురించి ఏం ఆలోచిస్తుంది..? అలానే ఒక అబ్బాయి, అమ్మాయి గురించి ఏం అనుకుంటాడు..? అనే అంశాలతో సినిమా ఉంటుంది. క్లీన్ లవ్ స్టొరీ. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే మానసిక సంఘర్షణే 'కుమారి 21 ఎఫ్'.
సుకుమార్ గారు డైరెక్షన్ లో ఇన్వాల్ అయ్యారా..?
'ఆర్య' సినిమాలో ఎటువంటి ఫీల్ క్యారీ చేస్తూ.. కథ నడిపించారో.. ఈ సినిమాకు కూడా అంత మంచి కథ ఇచ్చారాయన. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుండి సుకుమార్ గారు ఒక్కరోజు కూడా షూటింగ్ కు రాలేదు. ప్యాకప్ చెప్పిన రోజు అందరం ఫోటోలు దిగాలనుకున్నప్పుడు మాత్రమే ఆయన స్పాట్ కు వచ్చారు. ఎడిటింగ్ లో చిన్న మిస్టేక్స్ ఉంటే చెప్పేవారు అంతేకాని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మాత్రం అసలు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. సినిమా చూసి బాగా వచ్చిందని చెప్పారు.
కథ.. రాజ్ తరుణ్, హేబా పటేల్ ను దృష్టిలో పెట్టుకునే రెడీ చేసారా..?
నిజానికి స్క్రిప్ట్ మొదలు పెట్టినప్పుడు హీరో, హీరోయిన్స్ గా ఎవరు నటిస్తారో.. మేము ఇంకా అనుకోలేదు. ఒకసారి రాజ్ తరుణ్, సుకుమార్ గారిని ఐదు నిమిషాలు కలిసి మాట్లాడాడు. ఆ తరువాత సుకుమార్ గారు నా దగ్గరకు వచ్చి మన సినిమాలో హీరో ఇతనే అని రాజ్ తరుణ్ ను చూపించారు. అప్పటికి రాజ్ తరుణ్ రెండు సినిమాల్లో నటించాడు. ఈ సినిమాలో తన కూల్ గా ఉండే అబ్బాయి పాత్రలో కనిపిస్తాడు. తనలో మరో యాంగల్ ను ఈ సినిమాలో చూపించాం. రాజ్ కూడా చాలా బాగా నటించాడు. అలానే హేబా ను కూడా సుకుమార్ గారు చూసిన వెంటనే సెలెక్ట్ చేసేసారు.
రత్నవేలు, దేవీశ్రీప్రసాద్ లాంటి పెద్ద టెక్నీషియన్స్ పని చేసారు. ఆ ప్రెజర్ మీ మీద ఉండేదా..?
నేను సుకుమార్ గారి దగ్గర 'ఆర్య' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను. ఆ సమయంలో రత్నవేలు గారితో మంచి స్నేహం కుదిరింది. ఆయనకు నేను బాగా నచ్చేవాడ్ని. అలానే నా మొదటి సినిమా 'కరెంట్' కు దేవీ గారే మ్యూజిక్ అందించారు. వారిద్దరూ నాకు ముందే పరిచయం ఉండడం వలన ఈ సినిమాకు పని చేసినప్పుడు ఎలాంటి ప్రెజర్ ఫీల్ అవ్వలేదు. బహుసా.. సుకుమార్ గారు ఎలాంటి ప్రెజర్ పెట్టొద్దని వారికి చెప్పి ఉంటారు. రత్నవేలు గారి ఫోటోగ్రఫీతో, దేవీ గారి మ్యూజిక్ తో కథకు వేరే ఫ్లేవర్ వచ్చింది.
ఈ సినిమా కథ ఒక ఇంగ్లీష్ సినిమాను పోలి ఉందని అంటున్నారు. నిజమేనా..?
ఆ రూమర్ నేను కూడా విన్నాను. ఈ సినిమా కథ ఒక ఐడియా నుండి డెవలప్ అయింది. సుకుమార్ గారి అనుభవాల నుండి ఆయన పేస్ చేసిన పరిస్థితుల నుండి కథ సిద్ధం చేసారు. ఏ సినిమా నుండి మేము ఇన్స్పిరేషన్ తీసుకోలేదు.
ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు..?
ప్రస్తుతం ఉన్న యూత్ ను రిఫ్లెక్ట్ చేసే మూవీ ఇది. ఈ సినిమా ద్వారా ఒక పరిష్కారం దొరుకుందని చెప్పను కాని ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు మాత్రం కలుగుతుంది. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. సుకుమార్ గారు ఏం చెప్తే అది చేస్తాను. ఆయనతోనే ట్రావెల్ చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.