Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-స్వాతి(త్రిపుర)

Thu 05th Nov 2015 08:50 AM
swathi,tripura movie,rajakiran,naveen chandra  సినీజోష్ ఇంటర్వ్యూ-స్వాతి(త్రిపుర)
సినీజోష్ ఇంటర్వ్యూ-స్వాతి(త్రిపుర)
Advertisement

'డేంజర్' సినిమాతో నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన స్వాతి ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించింది. తెలుగులో కంటే తమిళంలో పాపులర్ నటిగా బాగా బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో స్వాతి కథానాయికగా నటిస్తున్న త్రిపుర చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ స్వాతితో సినీజోష్ ఇంటర్వ్యూ.. 

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి..?

పల్లెటూరు లో ఉండే అమాయకపు అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తనకు వచ్చే కలలన్నీ నిజమవుతుంటాయి. అవి యాదృచ్చికంగా జరుగుతున్నాయా.. లేక తనకు భవిష్యత్తు తెలుస్తుందా.. అనే అంశాలతో చాలా సస్పెన్స్ తో ఎంటర్టైనింగ్ సినిమా సాగుతుంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని భర్తతో సుఖంగా జీవిస్తున్న తనకు వచ్చిన ఒక కల ఆమె జీవితాన్ని ఏ విధంగా మార్చింది అనేది చిత్ర కథాంశం. 'త్రిపుర' దెయ్యం సినిమా కాదు. ఒక థ్రిల్లర్‌ మూవీ. మంచి సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. నేను దెయ్యంగా కనిపిస్తాననే వార్తలు నిజం కావు

సినిమాలో లుక్ కోసం ఎలాంటి కేర్ తీసుకున్నారు..?

'గోల్కొండ హై స్కూల్' సినిమాలో నేను చీర కడితే మరీ చిన్న పిల్లలా ఉన్నావు అంటూ చాలా మంది కామెంట్ చేసారు. అందుకే ఈ సినిమా సమయానికి కొంచెం బరువు పెరిగాను. త్రిపుర సినిమాలో దాదాపుగా చీరల్లోనే కనిపిస్తాను. ఒక సాధారణ గృహిణి నిజజీవతంలో ఎలా ఉంటుందో అదే విధంగా కనిపించడానికి ప్రయత్నించాను. 

గీతాంజలి కథ మీకోసం, త్రిపుర కథ అంజలి కోసం రెడీ చేసారంట కదా..?

త్రిపుర స్టొరీ కోసం అంజలిని అనుకున్నారని నాకు తెలియదు కాని గీతాంజలి సినిమా కోసం నన్ను సంప్రదించారు. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ సినిమాలో నటించలేకపోయాను.

నిజ జీవితంలో దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా..?

మనిషిలోనే ఘోస్ట్ ఉంటాడు. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని అసలు నమ్మను. కాని డెస్టినీ ను, కర్మలను నమ్ముతాను. 

సినిమా షూటింగ్ సమయంలో ఎప్పుడైనా.. భయపడ్డారా..?

నా కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది మెయిన్‌ స్ట్రీమ్‌ చిత్రమే 'త్రిపుర'. నేను మొదటిసారిగా చేసిన హర్రర్‌ మూవీ. సాధారణంగా నేను హర్రర్‌ సినిమాలను భయపడుతూ చూస్తాను. సినిమా చేసేటప్పుడు ఎక్కడా భయపడలేదు. చాలా సీరియస్‌గా చేశాను

రియల్ లైఫ్ లో మీకు ఎలాంటి కళలు వస్తుంటాయి..?

నిజజీవితంలో నేను పెద్దగా కలలు కనను. అయితే.. చిన్నప్పుడు కాలేజ్ లో నాకు స్కాలర్ షిప్ వచ్చినప్పుడు.. ఎక్కడ నన్ను అమెరికా పంపించేస్తారో అన్న భయంతో.. నన్ను నిజంగానే అమెరికా పంపేసినట్లు పీడ కలలు కనేదాన్ని. 

డైరెక్టర్ రాజకిరణ్ గురించి చెప్పండి..? 

రాజ్ కిరణ్ గారు ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నారు. అందువల్ల చిత్ర పరిశ్రమలో పలు విభిన్నమైన శాఖల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఒక్కోసారి ఆయన చెప్పే విషయాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఆయన ఒక దెయ్యంతో 3 నెలలపాటు సావాసం చేసారట. సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తీ ఆయన. త్రిపుర సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. 

మొదటిసారి నవీన్ చంద్ర తో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

నవీన్ చంద్రను ఫస్ట్ డే సెట్స్ లో చూసినప్పుడు చాలా సైలెంట్ గా కూర్చున్నాడు. మొదటిరోజు కదా బిల్డప్ ఇస్తున్నాడు అనుకొన్నాను. కానీ సినిమా పూర్తయ్యేంతవరకూ తన నడవడిక మారలేదు. అప్పుడు అనిపించింది.. ఈ అబ్బాయ్ నిజంగానే చాలా సైలెంట్ అండ్ డీసెంట్ అని.  

తెలుగు చిత్రాల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నట్లున్నారు..?

ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఆ విషయం నన్ను అడగడం కంటే మన తెలుగు సినిమా దర్శకుల్ని, నిర్మాతల్ని అడగడం సబబు అని నా భావన. అయితే.. ఈ విషయం నన్ను కూడా అప్పుడప్పుడూ తొలిచేస్తూ ఉంటుంది. కానీ ఎంత ఆలోచించినా నాకైతే అర్ధం కాలేదు. 

ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు..?

సినిమాకి సినిమాకి మధ్య వచ్చే గ్యాప్ లో సరదాగా నా తల్లిదండ్రులతో గడిపేందుకు సమయం లభిస్తుంది. మా అమ్మతో నాకు కాబోయేవాడి గురించి చర్చించడం, సరదాగా షికార్లు తిరగడం. మనముందే మన తల్లిదండ్రుల వయసు పెరుగుతుంటే చూడడం కంటే అదృష్టం ఇంకేముంటుంది. ఇప్పుడు నేను ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. 

సినిమాలో పెళ్లి సీన్ లో నటించడానికి నవీన్ టెన్షన్ పడ్డారట. మీకు కూడా ఆ ఫీలింగ్ కలిగిందా..?

నేను మొదటిసారి పెళ్లి అవతారంలో రెడీ అయ్యాను. షూటింగ్ మొదటి రోజు సీన్ షూట్ చేసారు. అప్పటికి నవీన్ తో నాకు పెద్దగా పరిచయం లేదు. మండపంలో కూర్చున్న వెంటనే జూనియర్ ఆర్టిస్టులు మా పెళ్లి ఇలా అయింది.. అలా అయింది అంటూ నాకు సజెషన్స్ ఇస్తున్నారు. కెమెరా చాలా దూరంగా ఉంది. మా చుట్టూ వాతావరణం చూస్తే నిజంగా పెళ్లి అవుతుందేమో అనే ఫీలింగ్ కలిగింది. నాలో సెన్సిటివిటీ ఇంకా మిగిలి ఉందని అప్పుడు అనిపించింది. 

పెళ్ళెప్పుడు..?

నన్ను అర్ధం చేసుకొనే వ్యక్తీ కోసం చూస్తున్నాను. నన్ను సంతోషంగా చూసుకోగలడు, నన్ను అర్ధం చేసుకోగలడు అన్న నమ్మకం ఎవరిమీదైనా కలిగితే.. అప్పుడు ఆ వ్యక్తిని పెళ్లాడి.. చక్కగా నా ఇల్లు సర్దుకుంటూ కూర్చుంటా. పెళ్లైయ్యాక సినిమాలు చేస్తానా లేదా అనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement