ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపనను అంగరంగ వైభవంగా నిర్వహించి.. దేశం తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని చంద్రబాబు పెద్ద ఎత్తుగడే వేశాడు. అయితే ఈ ఎత్తుగడ రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయకపోగా.. ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రానికి మరింత భారం మోపింది. ఇదంతా పక్కన పెడితే శంఖుస్థాపనకు ఎవరెవరు హాజరయ్యారు.. ఎవరెవ్వరు హాజరు కాలేదు అన్న దానిపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. తెలంగాణను మినహాయించి ఇతర రాష్ట్రాలనుంచి ఏ ఒక్క సీఎం కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం చంద్రబాబుకు సెంట్రల్‌లో ఉన్న పలుకుబడికి పెద్ద మచ్చలా మారింది. ఇక సెంట్రల్ విషయాన్ని పక్కనపెడితే స్టేట్‌నుంచి ఆహ్వానాలు అందుకున్న చాలామంది ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం తెలుగు తమ్ముళ్ల ఉత్సాహంపై నీరు పోసింది. ఇక పవన్ కల్యాణ్ కూడా శంఖుస్థాపనకు రాకపోవడం విపక్షాల విమర్శలకు బలాన్ని చేకూర్చింది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సర్దార్ షూటింగ్ కోసం గుజరాత్‌లో ఉన్నారని, అందుకే ఆయన శంఖుస్థాపనకు రాలేకపోయారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే మంత్రులు శంఖుస్థాపనకు హాజరుకావాలంటూ ఆహ్వానపత్రిక అందించిన సమయంలోనే తాను రాలేనని పవన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఫోన్ చేసి పవన్‌ను ఆహ్వానించినా అంత సానుకూలంగా స్పందించలేదనే కథనాలు వినిపిస్తున్నాయి. రాజధాని భూ సేకరణకు సంబంధించి బాధిత రైతులకు అండగా పవన్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సమయంలో కొందరు టీడీపీ నాయకులు పవన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో జరుగుతున్న శంఖుస్థాపనకు తాను వెళ్లడం ఏమాత్రం సబబు కాదని పవన్ ఎప్పుడో నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అదే విషయాన్ని టీడీపీకి కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే టీడీపీ మాత్రం షూటింగ్ బిజీతోనే పవన్ రాలేదని చెబుతోంది. పవన్‌లాంటి స్టార్లు గుజరాత్‌నుంచి శంఖుస్థాపనకు హాజరై తిరిగి అదే రోజు షూటింగ్‌కు వెళ్లిపోవడం పెద్ద విషయమేమీ కాదు. దీన్నిబట్టే టీడీపీ నాయకుల వాదనలో ఉన్న బలం తెలిసిపోతోంది.