రాష్ట్ర ఓటర్లపై పవన్‌కల్యాణ్ ప్రభావం తక్కువే అయినా గత ఎన్నికల్లో అది టీడీపీ విజయానికి దోహదపడింది. మిత్రపక్షాలు బీజేపీ, టీడీపీల తరఫున ప్రచారం చేసిన ఆయన ప్రతిపక్షాలపై విజయానికి కావాల్సిన మెజార్టీ ఓట్లను సాధించి పెట్టడంలో కీలకపాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత మాత్రం ప్రజాసమస్యలపై ఆయన స్పందించకుండా ఉండిపోయారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించకున్నా.. జనసేన అధినేత పవన్ కేంద్రాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపన పోలేదు. ఈ విషయమై ఏపీవాసులు ఆత్మత్యాగాలకు పాల్పడుతున్న.. కనీసం ప్రధానిని ఓసారి కలిసి విన్నవించాలన్న ఆలోచన కూడా పవన్‌కు రాకపోవడం ప్రజల్ని తీవ్రంగా బాధించింది. ఇక అదే సమయంలో రాజధాని నిర్మాణానికి బలవంతంగా భూములు సేకరిస్తున్నారని, పవన్‌కల్యాణ్ స్పందించాలంటూ రైతులు ఆందోళనకు దిగడంతో.. చిట్టచివరకు జనసేన అధినేత మళ్లీ జనం బాట పట్టారు.
రాజధాని భూసేకరణకు ప్రతిపాదించిన ప్రాంతాల్లో పర్యటించిన పవన్.. రైతులను భూములను బలవంతంగా లాక్కుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం మాత్రం తనపని తాను చేసుకుంటూనే వెళ్లిపోయింది. పవన్ మాటలపై పలువురు ఏపీ మంత్రులు తీవ్ర ఆగ్రహానికి గురైనా.. బాబు సూచనతో వారు మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజధాని శంఖుస్థాపనకు ముహుర్తం ఖరారైంది. దీనికి హాజరుకావాల్సిందిగా చంద్రబాబే స్వయంగా పవన్‌కు ఆహ్వాన పత్రికను అందిస్తారని సమాచారం. మరి పవన్ ఈ కార్యక్రమానికి హాజరై రాజధాని నిర్మాణానికి మద్దతుగా నిలుస్తారా..? లేక రైతుల పక్షాన నిలబడి శంఖుస్థాపనకు హాజరుకాకుండా నిరసన తెలుపుతారా..? అలాకాకుంటే శంఖుస్థాపనకు హాజరై ప్రత్యేకహోదా గురించి ప్రధానితో చర్చిస్తారా..? అనే విషయాలపై ఇప్పుడు ఊహాగానాలు తీవ్రమయ్యాయి. మరి అక్టోబర్ 22న పవన్ ఏ బాటన నడిచి ఎవరి పక్షాన నిలబడతారో తేలనుంది.