రామ్‌చరణ్ తేజ త్వరలోనే తన బ్రూస్‌లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన సినీ కెరియర్‌లో అత్యంత తక్కువ సమయంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిన ఈ హీరో ఇటీవలే.. విమానయాన సర్వీసుల బిజినెస్‌లోకి కూడా ఎంటరైన సంగతి తెలిసిందే. ట్రూజెట్ పేరుతో ప్రారంభించబడ్డ ఈ విమానయాన సర్వీసులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. అయితే ట్రూజెట్ విమాన సర్వీసులు బాగా లేవంటూ ప్రయాణికులనుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు ఈ కంపెనీకి చెడ్డపేరు తీసుకువస్తున్నాయి.
అప్పటికప్పుడు విమాన సర్వీసులను రద్దు చేస్తూ ఈ కంపెనీ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తిరుపతి ఫ్లైట్‌ను చివరి నిమిషాల్లో క్యాన్సిల్ చేయడంతో ప్రయాణికులు ఆందోళనకు కూడా దిగారు. అంతేకాకుండా ఈ సంస్థపై విమానయాన శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ట్రూజెట్ నడుపుతున్న విమానాల్లో చివరి నిమిషాల్లో దాదాపు 5 శాతం ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నట్లు ఇటీవలే ఓ ఆంగ్ల దినపత్రిక వార్త కథనాన్ని ప్రచురించింది. ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం సాధారణమే అయినప్పటికీ ట్రూజెట్‌లో ఈ సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరి తన సినీ కెరియర్‌ను చక్కదిద్దుకున్నట్లే రామ్‌చరణ్ ట్రూజెట్ వ్యవహారాలను చక్కబెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో..?