దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటుగా ఉన్న రోశయ్య.. ఊహించనిరీతిలో ఉమ్మడి రాష్ట్రం సీఎం పీఠమెక్కారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో లేదో.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఆయనకు ఊపిరి ఆడకుండా చేసింది. దీనికితోడు సీఎంగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం కావడమే కాకుండా రోశయ్యపై అవినీతి ఆరోపణలను తెచ్చిపెట్టింది. హైదరబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అమీర్‌పేటలో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసి విచారణ జరిపింది.
అటు తర్వాత ఏపీలో సీఎం పీఠానికి రోశయ్య దూరమైనా ఈ కేసు మాత్రం ఆయన్ను వీడలేదు. ముఖ్యమంత్రి పీఠం తర్వాత తమిళనాడు గవర్నర్‌గా వెళ్లిన ఆయన్ను ఈ కేసు వెన్నాడుతునే ఉంది. ఎట్టకేలకు ఈ కేసునుంచి రోశయ్య విముక్తలయ్యారు. అమీర్‌పేటలోని 9 ఎకరాల భూమి అప్పగింతలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ అవినీతి చోటుచేసుకుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని స్సష్టం చేసింది. దీంతో ఈకేసునుంచి రోశయ్యకు విముక్తి దొరికనట్లే కనిపిస్తోంది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆయనకు మళ్లీ తిప్పలు తప్పకపోవచ్చు. అయితే ఏసీబీ సుప్రీంకోర్టు గడపతొక్కే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ కూడా ఈ కేసుకు సంబంధించి రోశయ్యకు క్లీన్‌చిట్ ఇచ్చారు.