ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య చిల్లర గొడవలకు కొదవ లేకుండాపోతోంది. వీటిని తషామా గొడవలనాలో.. అధికారుల దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పాలో అర్థంకాని పరిస్థితి. మంగళవారం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఓ తమాషా గొడవ జరిగింది. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లోని గురజాడ హాలు దీనికి వేదికైంది.
గురజాడ హాలులో ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల చిత్రపటాలున్నాయి. అయితే మంగళవారం ఇక్కడ బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనుండటంతో ఏపీ అధికారులు కేసీఆర్ ఫొటోను అక్కడినుంచి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ అధికారులు అక్కడికి చేరుకొని ఫైరయ్యారు. తమ సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని తొలగించడానికి ఎంత ధైర్యమంటూ బాబు ఫొటోను కూడా అక్కడినుంచి తొలగించారు. మరోసారి ఇలాంటి రాజకీయాలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ పరుషపదజాలంతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల నడుమ చిన్న చిన్న విషయాలపై కూడా వెనక్కి తగ్గకుండా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కాలు దువ్తుతున్నారు. అధినాయకత్వం వద్ద మెప్పు కోసమో.. గొడవలతో రాజకీయ లబ్ధి పొందాలనో చేస్తున్న ఈ చర్యలు ప్రజల మధ్య వైషామ్యాలను రగిలిస్తున్నాయి. కొసమెరుపెంటంటే చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ చివరకు ఆయన ఫొటో కూడా లేకుండా జరిగింది.