ఒప్పుడు తెలంగాణవాదులకు గవర్నర్ నరసింహన్ అంటే అసలు పడేది కాదు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని, ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు ఇస్తున్నారంటూ టీఆర్‌ఎస్ నాయకులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అదే సమయంలో సీమాంధ్ర నేతలు గవర్నర్‌కు బాసటగా నిలిచేవారు. కాని రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏపీ నాయకులు గవర్నర్‌పై విమర్శలు ఎక్కుపెడుతుంటే.. టీఆర్‌ఎస్ ఆయనకు ఎనలేని ప్రాధాన్యతనిస్తోంది. మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ ఏకంగా నాలుగు గంటలపాటు గవర్నర్‌తో భేటీ కావడమే ఇందుకు నిదర్శనం. ఇక అదేవిధంగా గవర్నర్ కూడా ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల నడుమ నెలకొన్న వివాదాలకు సంబంధించి గవర్నర్ మిన్నకుండిపోవడం ఈ విమర్శలకు మరింత ఊతమిచ్చింది.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న నరసింహన్ రాష్ట్రపతి, హోంమంత్రులను కూడా కలుసుకున్నారు. అదే సమయంలో ఏపీ రాజధాని శంఖుస్థాపన గురించి అడిగితే తనకు ఆహ్వానం వస్తే తప్ప వెళుతానని సమాధానం చెప్పారు. దీన్నిబట్టి ఏపీ రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఉన్న నరసింహన్‌కు రాజధాని విషయమై ఎలాంటి సమాచారం లేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్‌తో అన్ని విషయాలను చర్చించాల్సి ఉంటుంది. కాని ఏపీలో ఇదేదీ జరుగుతున్నట్లు కనిపించడం లేదు. గవర్నర్ నరసింహన్‌తో బాబు అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారనేది సుస్పష్టం. ఇక పనిలో పనిగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై కూడా గవర్నర్ తేల్చేశారు. మంత్రి తలసాని గురించి మాట్లాడుతూ.. ఇది తన పరిధిలోని అంశం కాదని, స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇన్నాళ్లు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు గవర్నర్‌కు వినతి పత్రాల మీద వినతి పత్రాలు ఇచ్చారు. ఇక వారికి నిరాశను మిగిలిస్తూ గవర్నర్ విషయాన్ని స్పీకర్ కోర్టులోకి నెట్టి టీఆర్‌ఎస్‌కు మరో మేలు చేసినట్లు కనిపిస్తోంది.