ఉమ్మడి ఏపీలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ రేపిన చిచ్చు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నష్టమో.. లాభమో.. ప్రాంతాలకతీతంగా పదేళ్లపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆపై రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత పరిస్థితి కాస్త కుదుటపడింది. అయితే మళ్లీ ఇప్పుడే రాయలసీమలో ప్రత్యేకవాదం ఊపందుకుంటోంది. అభివృద్ధి విషయంలో రాయలసీమను, ఉత్తరాంధ్రను పూర్తిగా విస్మరిస్తున్నారంటూ మళ్లీ కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రత్యేకవాదాన్ని వినిపిస్తున్నారు.
నూతన రాజధాని విషయంలో ఏడాదిపాటు తీవ్రంగా ఆలోచించి చివరకు అమరావతిని ఏపీ రాజధానిగా ఎంపికచేశారు. ఇంకా ఇక్కడ రాజధాని పనులు కూడా ప్రారంభం కాకముందే రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ ఆ ప్రాంత నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. గత ఆరు దశాబ్దాలుగా పూర్తిగా అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేశారని, ఇప్పుడు అక్కడినుంచి సీమవాసులను తరిమివేశారని, అదే పరిస్థితి మళ్లీ రిపీట్ అవుతోదంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. అందునా ఈ వాదన ప్రతిపక్షాలనుంచి కాక అధికారపక్షం నుంచే రావడం విస్మయం కలిగిస్తోంది. మాజీ మంత్రి , టీడీపీ నేత టీజీ వెంకటేశ్ ఈ విషయమై మాట్లాడుతూ.. గతంలో లాగానే మళ్లీ అభివృద్ధి మొత్తాన్ని రాజధానికే పరిమితం చేసి రాయలసీమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెబుతున్నారు. ఇలా అయితే మరోసారి రాష్ట్ర విభజన ఉద్యమం వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి హెచ్చరికలు ఏ ప్రాంతానికి ఎంతవరకు లబ్ధి చేకూరుస్తాయో తెలియదు కాని.. ప్రజల్లో మాత్రం సమైక్య భావాన్ని దెబ్బతీస్తాయి. రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన పథకాలు, కేటాయించాల్సిన నిధుల గురించి కాకుండా నాయకులు ఇలా.. విభజన మంత్రాన్ని జపించడం ప్రజలకు ఏమాత్రం రుచించడం లేదు. ఇప్పటికే రాజధానిని కోల్పోయి.. లోటు బడ్జెట్‌తో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో అందరూ సమైక్యంగా ఉంది అభివృద్ధి పథంలో నడవాల్సింది పోయి ఇలా విభజన హెచ్చరికలు జారీ చేయడం సబబు కాదంటూ సీమాంధ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడిగా ఉన్న టీజీ వెంకటేష్ ఆయా ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాల్సిందిపోయి హెచ్చరికలతో ఏం సాధిస్తారో తెలియకుండా ఉంది.