Advertisement

నం.1 స్థానం కోసం పోటీ.. బాబులో టెన్షన్‌..!

Thu 01st Oct 2015 02:09 AM
errabelli dayakar rao,revanth reddy,tdp,chandrababu  నం.1 స్థానం కోసం పోటీ.. బాబులో టెన్షన్‌..!
నం.1 స్థానం కోసం పోటీ.. బాబులో టెన్షన్‌..!
Advertisement

తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎమ్మెల్యేలు, కార్యకర్తల వలసలు, ఏసీబీ కేసు, ఆధిపత్య పోటీ ఆ పార్టీని తెలంగాణలో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. ఇక ఆ పార్టీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిల మధ్య విభేదాలు టీడీపీని మరింత దెబ్బతీస్తాయేమోనని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

రెండు రోజుల క్రితం వరంగల్‌లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి ఎర్రబెల్లి అరెస్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎర్రబెల్లిని తెలుగు దేశం పార్టీ నాయకులంతా విమర్శించినా రేవంత్‌రెడ్డి మాత్రం కనీసం ఆయనకు ఫోన్‌ కూడా చేయనట్లు సమాచారం. అంతేకాకుండా ఇంతపెద్ద సంఘటనపై రేవంత్‌ మీడియాలోనూ స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోంది. అదే సమయంలో గతంలో రేవంత్‌రెడ్డిని ఏసీబీ కేసులో అరెస్టు చేసినప్పుడు ఎర్రబెల్లి ధర్నాలు, ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. మరి ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎందుకు మిన్నకుండిపోయారన్నది అర్థంకాకుండా ఉంది.

గతంలో హైదరాబాద్‌లో మైహోం సంస్థకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. అయితే ఈ విషయంలో ఎర్రబెల్లి తీవ్రంగా స్పందించారు. మై హోం సంస్థ గురించి రేవంత్‌ ఇంకెప్పుడు మాట్లాడవద్దంటూ చంద్రబాబు సమక్షంలోనే ఎర్రబెల్లి స్పష్టం చేసినట్లు తెలిసింది. అప్పటినుంచి వారిద్దరి మధ్య విబేధాలు పొడచూపాయి. అయితే ఆ విషయాన్ని ఎర్రబెల్లి మరిచినా రేవంత్‌రెడ్డి మాత్రం ఇంకా గుర్తుకుపెట్టుకున్నారని, అందుకే ఎర్రబెల్లి విషయంలో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. అంతేకుండా తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ నుంచి నం.1 స్థానం కోసం ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిల మధ్య పోటీ నడుస్తోంది. ఎర్రబెల్లి అరెస్టుపై రేవంత్‌ మాట్లాడకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చనే ఊహాగానలు వినిపిస్తున్నాయి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement