ఏపీ రాజధాని శంఖుస్థాపను సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జపాన్, సింగపూర్ ప్రధానులతోపాటు భారత ప్రధాని మోడీని కూడా శంఖుస్థాపనకు ఆహ్వానించి ప్రపంచ దేశాల్లో ఇన్వెస్టర్లను దృష్టిని ఆకర్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మోడీ రాక ఇప్పటికే ఖరారు కాగా జపాన్, సింగపూర్‌ల ప్రధానుల వస్తారా..? రారా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఏపీ రాజధాని డెవలప్‌మెంట్ ప్రణాళికను బాబు సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఆ దేశంలో పర్యటించి అక్కడి మంత్రులతోపాటు ప్రధానిని కూడా కలిశారు. అంతేకాకుండా జపాన్ ఇన్వెస్టర్లను కూడా ఏపీ రాజధానివైపు ఆకర్షించడానికి బాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఇరు దేశాల ప్రధానులకు ఇప్పటికే శంఖుస్థాపనకు ఆహ్వానాలు అందాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఇతర దేశాల ప్రధానులు మనదేశంలో పర్యటించడం గతంలో ఎన్నడూ జరగలేదు. దీంతో ఈ ఇరువురికి కేంద్రంనుంచి ఆహ్వానాలు పంపించాలని బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని మోడీకి విన్నవించినట్లు సమాచారం.
అయితే శంఖుస్థా పను ఆ రెండు దేశాల ప్రధానులు హాజరవుతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. కాని ప్రధాని నుంచి ఆహ్వానం లేనిది వారిరువురూ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు లేవని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ దేశాల ప్రధానుల రాక ఇప్పుడు మోడీ ఆహ్వానంపై ఆధారపడి ఉంటుంది. ఏపీకి ఇచ్చిన హామల అమలును మరిచిన మోడీ రాష్ట్రం కోసం కనీసం ఆ దేశాల ప్రధానులనైనా ఆహ్వానిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.