నెలల తరబడి ఓ పథకం గురించి మాట్లాడటం.. తీరా అది ఫైనలైజ్ అయ్యే సమయానికి దాన్ని రద్దు చేయడం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. చీప్ లిక్కర్, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తదితర అంశాలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కూడా ప్రభుత్వం ఇదే తీరును ప్రదర్శించింది.
చాలాకాలంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం.. డివిజన్‌ల పునర్ విభజననే దానికి కారణంగా చెప్పింది. అదిగో అప్పుడు.. ఇదిగో ఇప్పుడు అంటూ డివిజన్ల పునర్ విభజన సాకుతో ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు హైకోర్టు మొట్టికాయలు వేయడంతో త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ సర్కారు వచ్చే ఏడాది ఆరంభంలో జీహెచ్‌ఎంసీ సమరానికి సన్నాహాలు చేస్తోంది. కాగా ఇన్నాళ్లపాటు చెబుతూ వచ్చిన డివిజన్ల పునర్‌విభజనపై ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాత డివిజన్లనే కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివెనుక ఎంఐఎంకు లబ్ధి చేకూర్చాలనే వ్యూహం ఉండవచ్చన భావం వ్యక్త మవుతోంది.
జీహెచ్‌ఎంసీ డివిజన్లను పునర్ వ్యవస్థీకరిస్తే.. పాత బస్తీల్లోని కొన్ని డివిజన్లను కూడా విభజించకతప్పదు. దీంతో కొత్త డివిజన్లలో ముస్లిం జనాభా, హిందూ ఓటర్లు సమానంగా ఉండటమో లేక.. హిందు ఓటర్లే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది ఎంఐఎం విజయావకాలను దెబ్బతీయడంతోపాటు బీజేపీకి అధిక స్థానాలు గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది. ఇక జీహెచ్‌ఎంసీ మేయర్ స్థానాన్ని ఎంఐఎం సాయంతో ఎలాగైనా గెలుచుకోవాలని ఆశిస్తున్న టీఆర్‌ఎస్‌కు పునర్ విభజనతో చిక్కు వచ్చి పడింది. శివారు ప్రాంతాల్లో కాస్త మెరుగైన ఫలితాలను సాధిస్తామనుకుంటున్న టీఆర్‌ఎస్‌కు పునర్ విభజనతో లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అదే సమయాన ఎంఐఎం దెబ్బతింటుందని ఆలోచిస్తున్న టీఆర్‌ఎస్ తాము నష్టపోయినా ఎంఐఎం గెలుపు అవకాశాలను తగ్గించొద్దన్న తలంపుతో పునర్‌విభజనపై పూర్తిగా వెనుకడుగు వేసినట్లు సమాచారం.