ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్‌కు సమఉజ్జీలే కనబడటం లేదు. చంద్రబాబు పూర్తిగా ఏపీకి పరిమితమవగా .. మిగిలిన నాయకులు కేసీఆర్‌ను విమర్శించడంలో అవుట్ డేటెడ్‌గా మిగిలిపోయారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఆచితూచి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌లో ఉన్నాడా..? లేక టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నాడా..? అనేది ప్రజలకర్థం కాకుండా ఉంది. ఇక టీడీపీనుంచి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను బాగానే విమర్శించినా.. ఏసీబీ కేసు తర్వాత ఆయన వాడిలో వేడి కాస్త తగ్గింది. ఇక ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శించడంలో సమతూకం కరువైంది. ఆస్థానాన్ని భర్తీ చేసే నాయకుడి కోసం రాజకీయవర్గాలు ఎదురుచూస్తున్నా.. ప్రత్నామ్నాయం మాత్రం దొరకడం లేదు. అయితే ఇటీవలే కోదండరాం ప్రభుత్వంపై చేస్తున్న సున్నితమైన విమర్శలు తెలంగాణలో కేసీఆర్‌కు సమస్థాయి వ్యక్తి దొరికాడన్న సూచనలు ప్రజల్లోకి పంపిస్తున్నాయి.
తెలంగాణ సాధనలో కోదండరాం, కేసీఆర్‌లు ఉద్యమమనే రథానికి రెండు చక్రాల్లాగా వ్యవహరించారు. నిద్రావస్థలో ఉన్న తెలంగాణ భావాన్ని కేసీఆర్ తట్టి లేపగా.. అన్ని రాజకీయ పక్షాలను, ఉద్యోగసంఘాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి ఎలాంటి విభేదాలు కలగకుండా కోదండరాం ముందుకు తీసుకెళ్లాడు. రాజకీయాలను పక్కనపెడితే వీరిద్దరూ సమఉజ్జీలే. తెలంగాణ సాధనలో వీరిద్దరికీ అత్యధిక ప్రాధాన్యత ఉంది. తెలంగాణ సెంటిమెంట్‌తోనే గత ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, వచ్చే ఎన్నికల్లో కూడా అదే సెంటిమెంట్‌ను ఆయన తిరిగి వాడుకుంటారని విపక్షలు భావిస్తున్నాయి. ఇక ఈ విషయంలో కేసీఆర్‌ను దెబ్బకొట్టాలంటే కోదండరాంను రాజకీయాల్లోకి తీసుకురావాలని టీడీపీ, కాంగ్రెస్‌లు అనేకమార్లు ప్రయత్నించి భంగపడ్డాయి. వారి విన్నపాలను కోదండరాం సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు ఆయన వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. జాబ్ నోటిఫికేషన్లు, కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఇటీవలే జరిగిన నక్సల్స్ ఎన్‌కౌంటర్ తదితర విషయాల్లో కోదండరాం ప్రభుత్వంపై ప్రత్యక్ష విమర్శలకు దిగారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి కోదండరాం మాట్లాడుతూ అక్కడ ఎదురు కాల్పులు జరిగినట్లు కనిపించడం లేదని, పోలీసులే నక్సల్స్‌ను హతమార్చారని ఆరోపించారు. దీంతో కోదండరాం రూటు మారిందనే వాదనలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. కోదండరాం విమర్శలు భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చూడాలి.