రాజకీయాలు బురద మాదిరే.. ఆచితూచి అడుగులు వేయకపోతే జారిపడి నవ్వుల పాలు కావడం ఖాయం. ప్రకటించిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకున్నా.. పార్టీకి కాస్త ప్రయోజనం చేకూరాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చి.. ప్రజల్లో చులకనకాక తప్పదు. ప్రస్తుతం జగన్ రాజకీయ ఎత్తులు పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురిచేయడమే కాకుండా ప్రజలను వైసీపీకి దూరం చేస్తోంది.
గురువారం రామోజీతో జగన్ భేటీ తెలుగు రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. బద్ద శత్రువులుగా ఉన్న జగన్, రామోజీలు గంటకుపైగా చర్చలు జరపడం వెనుక ఉన్న మతలబు ఎంటో అర్థంకాక నాయకులు ఆలోచనల్లో పడిపోయారు. ఇది ముందస్తుగా నిర్ణయించిన సమావేశం కానప్పటికీ అప్పటికప్పుడు జగన్ వెళ్లి ఫిల్మ్ సిటీలో రామోజీని కలిసి చర్చలు జరిపారు. దీన్నిబట్టి సంధికి జగనే చొరవచూపినట్లు తెలుస్తోంది. మరి ఈ సంధి చర్చలు తనపై ఉన్న కేసుల గురించా..? లేక తాను అధికారంలోకి రావడానికి రామోజీ మద్దతు తప్పని సరి అని జగన్ గుర్తించారా..? అదీకాకపోతే బీజేపీ సూచనల మేరకు జగన్ రామోజీకి దగ్గరవుతున్నారా..? అనే చర్చలు కొనసాగుతున్నాయి. అయితే మూడు దశాబ్దాలకుపైగా ఉన్న స్నేహాన్ని మరిచి టీడీపీని కాదని వైసీపీకి రామోజీ మద్దతు తెలుపుతారని భావించడం అత్యాశేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక రామోజీతో భేటీని వైసీపీ నాయకులు సమర్థించుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి పరిమితమైన వైసీపీ ఇకపై కమ్మ సామాజిక వర్గానికి కూడా చేరువవుతుందని, అందుకోసమే జగన్ చర్చలు జరిపారని వారు చెబుతున్నారు.
ఈ విషయాలన్నీ పక్కనపెడితే తెలుగునాట రాజకీయాల్లో రామోజీకి ఉన్న ప్రాధాన్యతను మరోసారి తెలియజెప్పింది. ఆయన తన ఫిల్మ్‌సిటీ సామ్రాజ్యంలో కూర్చునే అటు తెలంగాణ సీఎంను ఇటు జగన్‌ను కూడా తన వద్దకు రప్పించుకున్నారు. గతంలో రామోజీగురించి ఇష్టారీతిగా విమర్శలు చేసిన వారి నోటినుంచే తనను పొగుడుతూ ప్రకటనలిప్పించారంటే రామోజీరావు తెలుగునాట మరో చాణక్యుడు అనిపించుకున్నట్లే.