నితిన్, యామీగౌతమ్ జంటగా ఫోటాన్ కతాస్ బ్యానర్ పై ప్రేమ్ సాయి దర్శకత్వంలో గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న చిత్రం కొరియర్ బాయ్ కళ్యాణ్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నితిన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
సినిమా పాయింట్ ఫ్రెష్ గా ఉంటుంది..
కొరియర్ బాయ్ కళ్యాణ్ కొత్త ఫార్మాట్ లో ఉండే సినిమా. రెగ్యులర్ కమర్షియల్ చిత్రమయినా కామెడీ, స్క్రీన్ ప్లే అంతా కొత్తగా ఉంటుంది. నేను నటించిన జయం సినిమాలో సాఫ్ట్ బాయ్ లా ఉండే అబ్బాయి ఫైనల్ గా హీరో అవుతాడు. ఇందులో కూడా అదే విధంగా ఓ సాధారణ కుర్రాడికి సమస్య వస్తే దానిని ఎదిరించి క్లైమాక్స్ లో హీరోగా ఎలా మారుతాడనేదే ఈ సినిమా స్టొరీ. ఈ సినిమాలో నేను చెప్పబోయే పాయింట్ చాలా కొత్తగా, షాకింగ్ గా ఉంటుంది. నా కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ అన్ని చూసాను. ఇమేజ్ పక్కన పెట్టి కంటెంట్ ను నమ్మి సినిమా చేసాను. కమర్షియల్ మూవీను డిఫరెంట్ పాటర్న్ లో చూపించారు.
చాలా కాన్ఫిడెన్స్ ఉంది..
ఈ సినిమా తెలుగులో షూటింగ్ ఒక సంవత్సరం ముందే కంప్లీట్ అయింది. తమిళంలో కొన్ని సమస్యలు ఉండడం వలన తెలుగులో కూడా రిలీజ్ వాయిదా వేస్తూ వచ్చారు. ఇంత లేట్ అయినా సినిమాపై మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మేము అనుకున్న పాయింట్ ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు. కాని ఆ పాయింట్ మాత్రం ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. సినిమా చూసిన తరువాత ఇలా కూడా అవ్వొచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది. డిలే అవ్వడం కూడా మా మంచికే జరిగింది.
ప్రేమ్ బాగా డైరెక్ట్ చేసాడు..
ప్రేమ్ సాయి సినిమా కథ నేరేట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. కాని అలా డైరెక్ట్ చేయగలడా అనే అనుమానం ఉండేది. ఒక షాట్ డైరెక్ట్ చేయగానే అతని స్టామినా ఏంటో తెలిసింది. తనకు ఇది మొదటి సినిమా అని ఒకసారి కూడా అనిపించలేదు. ప్రభుదేవా గారి దగ్గర ఆరు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. ఇది డైరెక్టర్స్ ఫిలిం. చాలా చక్కగా తీర్చిదిద్దాడు.
ప్రమోషన్ కోసమే..
గౌతంమీనన్ గారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసారు. ప్రేమ్ సాయి కొత్త డైరెక్టర్ అందుకే ప్రమోషన్స్ లో గౌతంమీనన్ గారి పేరు ఎక్కువగా ఉపయోగించాం. ఈ చిత్రం గౌతం గారి స్టైల్ లో ఉండకపోయిన ఆయన సినిమాల్లో ఉండే సెన్సిబిలిటీస్, న్యాచురాలిటీ మాత్రం ఉంటాయి.
టైటిల్ నేను సెలెక్ట్ చేయలేదు..
కొరియర్ బాయ్ కళ్యాన్ అనగానే నితిన్, పవన్ అభిమాని కనుకే కళ్యాణ్ గారి పేరు పెట్టారని చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా టైటిల్ కోసం డైరెక్టర్ గారు మొదట కొరియర్ బాయ్ కార్తిక్ లేదా కొరియర్ బాయ్ కళ్యాణ్ అని పెడదాం అనుకున్నారు. నన్ను అడగగానే మీ ఇష్టం సర్ అని చెప్పేసా. నేను నటించిన గుండెజారి గల్లంతయ్యిందే మూవీలో నా పేరు కార్తీక్ సో.. డైరెక్టర్ గారు కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే పెడదామని ఫిక్స్ అయ్యారు. అంతేకాని ఆ టైటిల్ మాత్రం నేను సెలెక్ట్ చేయలేదు.
ప్రొడ్యూసర్ గా చేయడం చాలా కష్టం..
గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్ సినిమాలకు నేను అంత ఇన్వాల్వ్ కాలేదు కాని అఖిల్ మూవీకి చాలా ఇన్వాల్వ్ అయి పని చేసాను. ప్రొడ్యూసర్ గా అన్ని పనులు చూసుకోవడం చాలా కష్టమైన పని. వినాయక గారి డైరెక్షన్ కాబట్టి సినిమా తొందరగా కంప్లీట్ అయింది. కథ ను నమ్మి బడ్జెట్ పెట్టాం. ఖర్చు గురించి మేము ముందే అనుకున్నాం. వినాయక్ గారి సినిమాల్లో అఖిల్ ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. ఇక ప్రొడ్యూసర్ గా చేయడానికి కాస్త గ్యాప్ తీసుకుంటా..
ప్రొడ్యూసర్ గా ఆఫర్ చేశా..
కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాను ప్రొడక్షన్ సైడ్ చూసుకుంటానని వారికి చెప్పాను. కాని వారు సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మేమే ప్రొడ్యూస్ చేసుకుంటామని చెప్పారు. సో.. సినిమాను వీలైనంత ప్రమోట్ చేయాలనుకుంటున్నాం.
24 కథ నాకే చెప్పారు..
ఇష్క్ సినిమా షూటింగ్ సమయంలోనే విక్రమ్ గారు నాకు 24 కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. అందులో ట్రిపుల్ రోల్ క్యారెక్టర్స్ లో నటించాలి. దానికి మంచి అనుభవం ఉండాలి. ఇప్పుడు సూర్య గారు ఆ సినిమాలో నటిస్తున్నారు. విక్రమ్ పై ఉన్న నమ్మకంతోనే 24 సినిమా హక్కులను నేను సొంతం చేసుకున్నాను.
యామి బాగా నటించింది..
ఈ సినిమాలో యామి గౌతమ్ మంచి పాత్రలో నటించింది. ఈ మూవీతో తనకు మంచి బ్రేక్ వస్తుంది.
కథ విన్నాకే ఓకే చెప్పాను..
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో అ ఆ అనే సినిమాలో నటిస్తున్నాను. త్రివిక్రమ్ బ్రాండ్ చూసి ఓకే చెప్పలేదు. ఆయన ఓ నాలుగు సార్లు కథ చెప్పి ఉంటారు. స్టొరీ నచ్చే సినిమా చేస్తున్నాను. లేడీ ఓరియెంటెడ్ మూవీ అనుకుంటున్నారు కాని హీరోకు కూడా ఇంపార్టన్స్ ఉండే చిత్రమది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.