తెలంగాణా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సి.ఎం రిలీఫ్ ఫండ్ కొరకు తెలంగాణా స్టార్స్ వర్సెస్ చెన్నై హీరోస్ స్టార్ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో విజేతలుగా నిలిచిన వారికి 'కాకతీయ కప్' ను ప్రెజెంట్ చేయనున్నారు. ఈ మ్యాచ్ ఆగస్ట్ 23, 2015 న ఎల్.బి. స్టేడియంలో జరగనుంది. బుధవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో కాకతీయ కప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా..
క్రీడాశాఖమంత్రి పద్మారావు మాట్లాడుతూ "నేను సినిమా చూసి దాదాపు పదిహేను ఏళ్ళు అయింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మనవాళ్ళెవరూ లేరనే భావనతో సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కాని ఇప్పుడు ఆకాష్ లాంటి ఎందరో స్టార్స్ ఉన్నారని తెలిసింది. తెలంగాణా స్టార్స్ కి కెప్టెన్ గా ఉన్న ఆకాష్ ఇండస్ట్రీకు కెప్టెన్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 23న జరగబోయే ఈ క్రికెట్ మ్యాచ్ కు నేను ప్రేక్షకుడిలా వెళ్లి చూస్తాను. ఈ కార్యక్రమం కోసం ఎల్.బి.స్టేడియం లో అసోసియేషన్ చెల్లించిన సొమ్మును తిరిగి ఇప్పించేలా భాద్యత తీసుకుంటున్నాను" అని చెప్పారు.
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ "ఈ టీం లో కప్ సాధించాలనే కసి కనిపిస్తుంది. తెలంగాణా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. కాకతీయుల పేరు మీద ఈ కార్యక్రమం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా టీం చూస్తుంటే నాకు లగాన్ సినిమా గుర్తొస్తుంది. ఈ కార్యక్రమం కొత్తదనానికి భవిష్యత్తు తరాలకు వారధిగా నిలుస్తుంది. ఈ మ్యాచ్ కు మా కల్చరల్ టీమ్ తో హాజరవుతాను" అని చెప్పారు.
ఎమ్.ఎస్.నాగరాజు మాట్లాడుతూ "ఆగస్ట్ 23న ఎల్.బి. స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణాలో పది జిల్లాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చి విజయవంతం చేస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.
సంగకుమార్ మాట్లాడుతూ " ఈ మ్యాచ్ అనంతరం తెలంగాణా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బ్యానర్ గా మొదటి చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం" అని చెప్పారు.
ఆకాష్ మాట్లాడుతూ "ఆగస్ట్ 23న జరుగుతున్న ఈ మ్యాచ్ లో తెలంగాణా స్టార్స్, చెన్నై హీరోస్ పోటీపడుతున్నారు. తరువాత సెప్టెంబర్ రెండవ వారంలో రెండవ మ్యాచ్ ను, అక్టోబర్ 3న లండన్ లో చివరి మ్యాచ్ జరగనుంది. 83 ఏళ్ళ సినీ చరిత్రలో తెలంగాణా స్టార్స్ కొందరే షైన్ అయ్యారు. ఈ మ్యాచ్ తో మా టీమ్ అందరూ మంచి స్టార్స్ గా ఎదుగుతారు. ప్రస్తుతం తెలంగాణ టాప్ స్టేట్ గా ఉంది. ఫిలిం ఇండస్ట్రీను డెవలప్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్, మాణిక్, మనోజ్ నందం, సోనీ చరిష్టా, ఘంటాడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.