తెలుగు ఫిలిం అండ్ టివి డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల పదవీ విరమణ కార్యక్రమం హైదరాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మంటపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులను సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా..
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "ఈ రాష్ట్రంలో, దేశంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం చేయలేని పనులు ఈ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కళను వృత్తిగా నమ్ముకొని జీవనం సాగిస్తున్నప్పుడు వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎవరు ఆదుకుంటారనే భయం కలుగుతుంది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఈ సంఘం కొండంత దైర్యాన్ని వారిలో నింపుతుంది. డాన్సర్స్ ఉంటేనే సినిమా ఉంటుంది లేకపోతే లేదు. సినిమాలో వారి కృషి పూర్తి స్థాయిలో ఉంటుంది. వారికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తాం. సినిమా కళాకారులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహాయసహకారాలు అందేలా చూసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు సినీపరిశ్రమ హైదరాబాద్ లోనే స్థిరపడుతుందని పరిశ్రమలో ఉన్న సమస్యలు, అలాగే నృత్య కళాకారుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు" అని చెప్పారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "అన్ని భాషల కలయికే భారతదేశం. అలానే అన్ని మతాలు, కులాలు కలిసి ఉండేదే చిత్ర పరిశ్రమ. ముక్కురాజ్ మాస్టర్ స్థాపించిన ఈ సంఘం ఎందరినో ఆదరిస్తుంది. ఈ సంఘం మరింత వృద్ధి చెందాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఏ.పి. కార్యసంఘ అధ్యక్షులు వెంకటేష్, కాదంబరి కిరణ్, రాజేశ్వర్ రెడ్డి, మురళి గౌడ్, వేణు, సి.కళ్యాన్ తదితరులు పాల్గొన్నారు.