తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడెరేషన్ కార్యవర్గ సభ్యులు వేతనాల పెంపు కోసం గత కొన్ని రోజులుగా పోరాడుతున్నారు. ఎట్టకేలకు ఈ వేతనాల పెంపు విషయం ఓ కొలిక్కి వచ్చింది. ఈ సందర్భంగా వేతనాల వివరాల గురించి అందరికీ తెలియజేయడం కొరకు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..
తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడెరేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ "ఈరోజు నుండి సీరియల్స్ కు సంబంధించిన షూటింగ్ లు జరగవేమో అనే భావనతో వర్కర్స్ ను నిన్న రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పని చేయించుకున్నారు. వారు అలసిపోయినా సరే ఈ కార్యక్రమాన్ని దిగ్విజాన్ని చేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. గత 20 సంవత్సరాలుగా ప్రొడ్యూసర్స్ అతి తక్కువ మొత్తంలో వేతనాలను ఇస్తుంటే ఇష్టంతో చేసే పని కాబట్టి వారు ఎంత ఇస్తే అంత తీసుకొని పని చేసాం. కాని ఈరోజు ఆ వేతనాలతో భార్య, బిడ్డల్ని పోషించడం కష్టంగా మారింది. అందుకే వేతనాల విషయంలో సవరణ రావాలనే ఉద్దేశ్యంతో యూనియన్ ఫెడెరేషన్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు కలిసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారితో చర్చలు నిర్వహించారు. నిన్న ఉదయం నుండి ఈరోజు ఉదయం వరకు జరిగిన ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. వేతనాలను పెంచుతున్నారు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. టివి పరిశ్రమను అభివృద్ధి పరచడానికి తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడెరేషన్ సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది" అని చెప్పారు.
విజయ్ యాదవ్ మాట్లాడుతూ "టైమింగ్ విషయంలో వేతనాల విషయంలో సవరణ చేసేందుకు ఈరోజు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు అంగీకరించారు. ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ కు వారికిస్తున్న వేతనంపై అదనంగా 100 రూపాయలను, ప్రొడక్షన్ లేడీకు మరో వంద రూపాయలు, లైట్ మ్యాన్ అసోసియేషన్ కి యాబై రూపాయలు, మేకప్ యూనియన్ కు 500 రూపాయలను, కాస్ట్యూమ్స్ యూనియన్ కు 300 రూపాయలను పెంచుతున్నారు. అవి కాకుండా రాత్రి 9 గంటల తరువాత పని చేస్తే ప్రతి గంటకు 100 రూపాయలు అదనంగా ఇస్తారు" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నర్సింగరావు, సి.హెచ్.ఎస్.ప్రసాద్, యాదగిరి, ఎమ్.రాజబాబు, ఏ.బాలకృష్ణ, బాలరాజు, బి.నరేష్ తదితరులు పాల్గొన్నారు.