వెంకట్రావమ్‌రెడ్డి విలాసవంతమైన జీవితానికి డెక్కన్ గ్రూపు ఇప్పుడు పరిహారం చెల్లిస్తోంది. ఇప్పటికే డిఫాల్టర్‌గా పేరుపడ్డ డెక్కన్ గ్రూపుకు కొత్త రుణాలు పుట్టకపోగా పాత రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి. ఇక డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలు ప్రింట్ అయ్యే స్థలాన్ని కూడా డెక్కన్ గ్రూపు వదులుకోక తప్పని పరిస్థిథి నెలకొంది.
డెక్కన్ క్రానికల్ యాజమాన్యం ఆ సంస్థకు కొండాపూర్‌లో ఉన్న 9 వేల గజాలా స్థలాన్ని కోటక్ మహేంద్రకు తనఖా పెట్టి 50 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో సదరు స్థలాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి కోటక్ మహేంద్ర ప్రయత్నించింది. అయితే అక్కడ ఉన్న డెక్కన్ సిబ్బంది కోటక్ చర్యలను అడ్డుకున్నారు. దీనిపై కోటక్ సంస్థ హైకోర్టుకు వెళ్లగా.. సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి కోటక్ మహేంద్రకు హక్కులున్నాయని, పోలీసులు తగిన రక్షణ కల్పించి కోటక్ సంస్థకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ స్థలాన్ని కోటక్ సంస్థ స్వాధీనం చేసుకుంటే ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పత్రికల భవితవ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీనిపై ఆ రెండు పత్రికల్లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.