ఏపీ మంత్రిమండలి ప్రక్షాళన త్వరలోనే జరగనుందా..? కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారా..? గతంలో తాను ఇచ్చిన హామీల మేరకు మరికొందరికి మంత్రి పదవులు ఇవ్వనున్నారా..?.. ప్రస్తుతం ఈ విషయాలపై టీడీపీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ఇదివరకే సంబంధిత మంత్రులకు, నాయకులకు సంకేతాలు కూడా పంపినట్లు సమాచారం.
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చంద్రబాబు సమక్షంలోనే తన సొంత ప్రభుత్వంపై విమర్శలకు దిగడం అప్పట్లో సంచలనంగా మారింది. అదే వేదికపై బాబు అప్పటికప్పుడు కృష్ణమూర్తికి తగిన సమాధానం చెప్పారు. దీనికితోడు కేఈ నోరు జారుడు వ్యవహారంపై బాబు పూర్తిగా ఆగ్రహానికి గురైనట్లు టీడీపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఆయప పదవి ఊస్ట్ అవడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే గంట, చిన్నరాజప్పల పనితీరుపై బాబు అసహనంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరికితోడు సుజాత, రవీంద్ర, పల్లెలు పైరవీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీరందరూ చంద్రబాబు టార్గెట్‌లో ఉన్నారని, వీరికి పదవీ గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అదే సమయంలో పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ధూళిపాల నరేంద్ర తదితరులకు చంద్రబాబు మంత్రి మండలిలో స్థానం కల్పించే అవకాశాలున్నాయి. మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ చేయడానికి తగిన సమయం కోసం బాబు ఎదురుచూస్తున్నట్లు టీడీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.