ఏ ఏడాదికాఏడాది కనీవినీ ఎరుగని రీతిలో 'సంతోషం' వార్షికోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్న సంగతి విదితమే, అయితే దక్షిణాది భాషలలోనే కాకుండా పదకొండు భారతీయ భాషలలోని సినీ ప్రముఖులకు పురస్కారాలను ప్రదానం చేస్తూ యావత్ భారతీయ సినీ పరిశ్రమని ఆశ్చర్యానందాలకు లోను చేస్తూ ప్రస్తుతం పదమూడో వార్షికోత్సవానికి సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకి భాగ్యనగరాన్ని వేదిక చేసుకుంది సంతోషం సినీ వార పత్రిక. వరుసగా పదమూడు సంవత్సరాలుగా భూమ్యాకాశాలు ఏకమయ్యాయా అన్న చందాన అవార్డ్స్ ప్రధానం చేస్తున్న సంతోషం సినీ వార పత్రిక తాజా వేడుకకై మునుపెన్నడూ నిర్వహించని వినూత్న రీతిలో కార్యక్రమాల్ని రూపొందించింది. గత ఏడాది 23 సంవత్సరాల తర్వాత తిరిగి జయమాలిని పాల్గొంది సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ లోనే, అలాగే తెలుగు సినీ స్వర్ణ యుగపు స్టార్స్ మాత్రమే కాకుండా పదకొండు భారతీయ భాషల సినీ స్టార్స్ సైతం వేదికపై తళుకులీనిందీ "సంతోషం' అవార్డ్స్ ఫంక్షన్ లోనే... సినీ దిగ్గజాలు, దిగ్దర్శకులు, ప్రముఖ నిర్మాతలు, ప్రసిద్దులైన హీరో హీరోయిన్లు, యావత్ సినీ ప్రపంచమే ఒక్క వేదికపై సాక్షాత్కరిస్తే రెండు కళ్ళూ చూడ్డానికి సరిపోతాయా? స్వర్గధామంలా "సంతోషం' పదమూడో వార్షికోత్సవానికి బంగారు ద్వారాలు తెరుస్తోంది. కోరిన సినీ ప్రముఖుల కంటి నిండా నింపుకునే అపురూప చిత్రోత్సవంగా "సంతోషం" సినీ వార పత్రిక ఈ యేటి సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రధానం చేయబోతోందని సగర్వంగా తెలియజేస్తూ 2015 ఆగస్టు 21వ తేదీ శుక్రవారం ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించబోతున్నట్లు "సంతోషం" అధినేత సురేష్ కొండేటి తెలియజేశారు.
ఇంకా ఎందరెందరో స్టార్లని ఒకే వేదికపైకి తీసుకువచ్చి సినిమా ప్రియుల మదిని దోచిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఈ పదమూడో వార్షికోత్సవంలో సైతం ఎన్నో సంచలనాలతో పాటు ప్రతిష్టాత్మక పురస్కారాలను సైతం ప్రధానం చేయబోతోందని, దక్షిణ భారత దేశంలో ఇంత భారీ ఎత్తున ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి చారిత్రాత్మకంగా ఫిల్మ్ అవార్డ్స్ను ప్రధానం చేస్తున్న సంతోషం సినీ వార పత్రికని ఇన్నేళ్ళుగా ఆశీర్వదిస్తున్న పాఠక దేవుళ్ళకి, మార్గదర్శకులకి, హితులకి, శ్రేయోభిలాషులకి, తెలుగు సినీ పరిశ్రమకి తానెంతగానో ఋణపడి ఉన్నానని సురేష్ కొండేటి తెలిపారు.