ఒకప్పుడు వరంగల్ జిల్లాలో రాజయ్య ఓ చిన్నపాటి నేత. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విబేధాల కారణంగా ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాకుండా.. రిజర్వ్ కేటగిరీలో ఏకంగా ఉపముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే ఆయన ఎంత అనుహ్యంగా డిప్యూటీ సీఎం పీఠం ఎక్కారో.. అంతే అనుహ్యంగా ఆ స్థానాన్ని కోల్పోయారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా సీఎం కేసీఆర్ రాజయ్యను డిప్యూటీ సీఎం స్థానం నుంచి ఏకంగా బర్తరఫ్ చేసి షాకిచ్చారు. అయినా మిన్నకుండిపోయిన రాజయ్య ఇప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ ఎంపీ సీటుకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సీటును గెలవడం కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి ఇక్కడ పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. రాజయ్యను బర్తరఫ్ చేయడంతో దళితుల సానుభూతి ఆయనకు తప్పక లభిస్తుంది. దీనికితోడు ప్రభుత్వంపై యువతలో ఉన్న వ్యతిరేకత కూడా ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు రాజయ్యను రప్పించడానికి కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తనను టీఆర్‌ఎస్ మోసం చేసిందన్న అసంతృప్తితో ఉన్న రాజయ్య కూడా కాంగ్రెస్ ఆఫర్‌కు ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం ఖరారు కావడంతో టీడీపీ కూడా ఆ పార్టీకే మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. ఇక రాజయ్య కాంగ్రెస్‌నుంచి పోటీ చేస్తే ఇక్కడ త్రిముఖ పోరు ఉత్కంఠగా కొనసాగే అవకాశం ఉంది.